Varun Tej: మెగా ఫ్యామిలీ నుండి ఇప్పటికే ఎంతోమంది హీరోలుగా అడుగుపెట్టారు. వారంతా వారి వారి నటనతో సెపరేట్ ఫ్యాన్ బేస్ కూడా సంపాదించుకున్నారు. అలాంటి హీరోల్లో నాగబాబు వారసుడు వరుణ్ తేజ్ కూడా ఒకడు. అందరి లాగా కమర్షియల్ సినిమా కాకుండా తన డెబ్యూ కోసం ఒక ఫీల్ గుడ్ మూవీ ఎంచుకున్నాడు వరుణ్ తేజ్. అప్పటినుండి తనకు నచ్చిన కథలకు ప్రాధాన్యత ఇస్తూ ప్రేక్షకులను అలరించాడు. కానీ గత కొన్నేళ్లుగా ఈ మెగా హీరోకు అదృష్టం కలసి రావడం లేదు. అందుకే ఈసారి కాస్త కొత్తగా ట్రై చేద్దామని.. డిఫరెంట్ టైటిల్, డిఫరెంట్ కథతో ఆడియన్స్‌ను అలరించడానికి సిద్ధమయ్యాడు. ఈ సినిమా కోసం హీరోయిన్ కూడా ఫిక్స్ అయ్యింది.
హారర్ థ్రిల్లర్
వరుణ్ తేజ్ (Varun Tej) హీరోగా నటించిన గత మూడు సినిమాలు ఫ్లాపులుగా నిలిచాయి. ఇక పాన్ ఇండియా అంటూ పీరియాడిక్ కథతో భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన ‘మట్కా’ అయితే భారీ డిశాస్టర్‌గా నిలిచింది. వరుణ్, కరుణ కుమార్ కాంబినేషన్‌లో తెరకెక్కిన ‘మట్కా’ వరుణ్ తేజ్ కెరీర్‌లోనే అతిపెద్ద డిశాస్టర్‌గా నిలిచింది. ఈ సినిమా ఎలాగైనా హిట్ అవ్వడం కోసం వరుణ్ తేజ్ కష్టపడినా ప్రమోషన్స్ చేసినా లాభం లేకుండానే పోయింది. దీంతో వరుణ్ తేజ్ కెరీర్ ఇలాగే కొనసాగితే తన మార్కెట్ పూర్తిగా పడిపోయే అవకాశం ఉంది. అందుకే కెరీర్‌లో ముందెన్నడూ చేయని ప్రయోగంతో సిద్ధమయ్యాడు ఈ మెగా హీరో. ఒక హారర్ థ్రిల్లర్ కథకు ఓకే చెప్పాడు.
Also Read: మాట నిలబెట్టుకున్న అనుపమ పరమేశ్వరన్.. ఈసారి అలాంటి పాత్రలో..
యంగ్ బ్యూటీతో
చాలాకాలం క్రితమే ‘కొరియన్ కనకరాజు’ (Korean Kanakaraju) అనే టైటిల్‌తో వరుణ్ తేజ్ ఒక మూవీలో నటించనున్నాడనే వార్తలు వినిపించాయి. ఇప్పుడు అదే విషయం కన్ఫర్మ్ అయ్యింది. టైటిల్ ఏదో కొత్తగా ఉందే అనే ఆసక్తి అప్పుడే ప్రేక్షకుల్లో మొదలయ్యింది. అంతే కాకుండా ఈ సినిమా ఒక హారర్ థ్రిల్లర్ జోనర్‌లో తెరకెక్కనుందట. తాజాగా ఇందులో హీరోయిన్ కూడా ఫైనల్ అయ్యిందని వార్తలు వినిపిస్తున్నాయి. ‘అశోక వనంలో అర్జున కళ్యాణం’ సినిమాతో హీరోయిన్‌గా డెబ్యూ చేసి ‘హాయ్ నాన్న’లో చిన్న క్యామియో చేసిన రితికా నాయక్ (Ritika Nayak).. ‘కొరియన్ కనకరాజు’లో వరుణ్ తేజ్‌కు జోడీగా నటించనుందని తెలుస్తోంది. ఇప్పటికే వీరిద్దరి లుక్ టెస్ట్స్ కూడా పూర్తయ్యాయని సమాచారం.
కామెడీనే కాపాడింది
వరుణ్ తేజ్ తన కెరీర్‌లో ఇప్పటికే ఎన్నో ప్రయోగాలు చేశాడు. ఫీల్ గుడ్ సినిమాలు వర్కవుట్ అవ్వకపోతే.. కమర్షియల్ కథలను ఎంచుకున్నాడు. తనకు ఏ జోనర్ కూడా సక్సెస్ ఇవ్వని టైమ్‌లో కామెడీని నమ్ముకొని హిట్ కొట్టాడు. కానీ తన కెరీర్‌లో ఒక్కసారి కూడా హారర్ థ్రిల్లర్‌లో నటించలేదు వరుణ్. అందుకే ‘కొరియన్ కనకరాజు’తో వరుణ్ తేజ్ చేసే ఈ ప్రయోగం సక్సెస్ అవ్వాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. ఈ మూవీని ‘వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్’, ‘ఎక్స్‌ప్రెస్ రాజా’ ఫేమ్ మేర్లపాక గాంధీ డైరెక్ట్ చేయనున్నాడు. యూవీ క్రియేషన్స్ ఈ హారర్ చిత్రాన్ని నిర్మించడానికి ముందుకొచ్చింది.