Vidya Balan: ఒకప్పుడు బాలీవుడ్ నటీనటులు అసలు సౌత్ ఇండస్ట్రీ అంటే విలువ ఇచ్చేవారు కాదు. వారి మార్కెట్‌తో పోలిస్తే సౌత్ సినిమాల మార్కెట్ చాలా తక్కువగా ఉంటుందని ఇక్కడి సినిమాల్లో నటించడానికి కూడా ఇష్టపడేవారు. కానీ గత కొన్నేళ్లలో పరిస్థితి చాలా మారిపోయింది. బాలీవుడ్ స్టార్లు సైతం సౌత్‌లో నటించడానికి ఆసక్తి ఉందంటూ తమకు తాముగా ముందుకొస్తున్నారు. అప్పుడైనా.. ఇప్పుడైనా.. నార్త్, సౌత్‌ను ఒకేలాగా చూస్తున్న నటీనటులు ఎంతోమంది ఉన్నారు. అందులో విద్యా బాలన్ (Vidya Balan) కూడా ఒకరు. హిందీలో సినిమాలు చేస్తున్న సమయంలోనే నార్త్ నుండి వచ్చిన ఆఫర్లు యాక్సెప్ట్ చేసిన విద్యా.. కొన్నాళ్ల క్రితం ఒక షాకింగ్ విషయం బయటపెట్టింది.
రెండు సినిమాలు ఆగిపోయాయి
కొన్నాళ్ల క్రితం విద్యా బాలన్ పాల్గొన్న ఒక ఇంటర్వ్యూలో సౌత్ ఇండస్ట్రీలో తాను ఎదుర్కున్న చేదు అనుభవాల గురించి బయటపెట్టింది. ‘‘సౌత్‌లో దాదాపు ఒకటిన్నర సంవత్సరం పాటు నేనేం చేసినా కలిసిరాలేదు. నేను సైన్ చేసిన రెండు పెద్ద మలయాళ ప్రాజెక్ట్స్ ఆగిపోయిన తర్వాత నాకు బ్యాడ్ లక్ అని ముద్రవేశారు. అందులో ఒకటి సగం షూటింగ్ కూడా పూర్తిచేసుకుంది’’ అని గుర్తుచేసుకుంది విద్యా బాలన్. తనకు హీరోయిన్‌గా బాలీవుడ్‌లో గుర్తింపు లభించిన తర్వాత మలయాళ ఇండస్ట్రీ వైపు అడుగులు వేసింది. కానీ అక్కడ తనకు కొంచెం కూడా లక్ కలిసిరాలేదు. దీంతో బాలీవుడ్‌లోనే సెటిల్ అయిపోయింది. కానీ అలా అసలు ఎందుకు జరిగిందో తను వివరించింది.
Also Read: పెళ్లి అయిన మగాడితో సంబంధం పెట్టుకుంది.. నటిపై సవతి కూతురు ఫైర్
కాన్ఫిడెన్స్ తగ్గిపోయింది
‘‘నేను ముందుగా మలయాళంలో మోహన్‌లాల్‌తో నా మొదటి సినిమాను సైన్ చేశాను. అది ఫస్ట్ షెడ్యూల్ పూర్తయ్యే సమయానికి నాకు అక్కడే 7 నుండి 8 సినిమాల ఆఫర్లు వచ్చాయి. కానీ సమస్య ఏంటంటే ఫస్ట్ షెడ్యూల్ పూర్తవ్వగానే సినిమా ఆగిపోయింది. అలా జరగడంతో ఇతర సినిమాల్లో కూడా నన్ను తీసేసి వేరే హీరోయిన్లను పెట్టుకున్నారు. దీంతో నాకు బ్యాడ్ లక్ అనే ట్యాగ్ వచ్చేసింది. అలా నా అవకాశాలన్నీ వేరేవాళ్లకు వెళ్లిపోవడంతో నా కాన్ఫిడెన్స్ చాలా దెబ్బతిన్నది. మలయాళంలోనే కాదు తమిళంలో కూడా అదే జరిగింది. నన్ను ఒక పెద్ద తమిళ సినిమా నుండి అనుకోకుండా తీసేశారు’’ అని చెప్పుకొచ్చింది విద్యా బాలన్.
బెంగాళీ సినిమాతో
విద్యా బాలన్ సౌత్ ఇండస్ట్రీకి ఎప్పుడూ దూరంగా లేదు. ఇక్కడ ఎప్పుడు అవకాశాలు వచ్చినా తను యాక్సెప్ట్ చేయడానికే రెడీగా ఉండేది. కానీ తను సౌత్ స్క్రీన్‌పై కనిపించకపోవడానికి కారణాలేంటో ఈ ఇంటర్వ్యూ చూస్తేనే అర్థమవుతోంది. విద్యా కేవలం హిందీలోనే కాదు.. మరాఠీ, బెంగాళీ లాంటి ఇతర నార్త్ భాషా చిత్రాల్లో కూడా నటించింది. అసలైతే తను ‘భాలో థేకో’ అనే బెంగాళీ సినిమాతోనే హీరోయిన్‌గా గ్లామర్ ప్రపంచంలో అడుగుపెట్టింది. అందులో బెంగాళీ అమ్మయిగా అలరించడంతో ‘పరిణీతి’ అనే హిందీ మూవీలో దాదాపు అలాంటి పాత్ర చేయడానికే తనకు అవకాశం లభించింది. అప్పటినుండి విద్యా బాలన్ వెనక్కి తిరిగి చూసుకోలేదు.