Vijay Devarakonda : ఇటీవల కాలంలో ఇబ్బందులకు గురి చేస్తున్నారు అంటూ పలు విమానయాన సంస్థలపై సినీ ప్రముఖులు మండిపడుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే తాజాగా హైదరాబాద్లో ఉన్న శంషాబాద్ ఎయిర్ పోర్ట్ లో గందరగోళ పరిస్థితి నెలకొన్నట్టు తెలుస్తోంది. ఇక్కడే హీరో విజయ్ దేవరకొండ (Vijay Devarakonda) కూడా ఉండడంతో, ఆయన అభిమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
అసలు ఏం జరిగిందంటే?
శంషాబాద్ ఎయిర్ పోర్ట్ లో తాజాగా ప్రయాణికులు ఆందోళనకు దిగినట్టు సమాచారం. ఇదంతా ప్రయాగ్ రాజ్ కు వెళ్లాల్సిన విమానం కారణంగా జరుగుతోందని అంటున్నారు. ఉదయం 9 గంటలకే ప్రయాగ్ రాజ్ వెళ్లాల్సిన విమానం, సాంకేతిక లోపం కారణంగా ఇంకా టేక్ ఆఫ్ కాలేదని ప్రయాణికులు మండిపడుతున్నారు. ఇదే విమానంలో సినీ ప్రముఖులతో పాటు ఐఏఎస్ లు కూడా ఉన్నారు. అలాగే హీరో విజయ్ దేవరకొండ (Vijay Devarakonda) కూడా ఇదే విమానంలో ఉండడంతో ఆయన అభిమానులు అక్కడ జరుగుతున్న ఆందోళన కారణంగా టెన్షన్ పడుతున్నారు.
కుంభమేళాకు విజయ్ దేవరకొండ ప్రయాణం
ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్ రాజ్ లో జరుగుతున్న మహా కుంభమేళా ఈరోజుతో 26వ రోజుకు చేరుకుంటుంది. గంగ, యమున, సరస్వతి నదుల సంగమమైన పవిత్ర త్రివేణి సంగమంలో పుణ్య స్నానాలు ఆచరించడానికి ప్రపంచం నలుమూలల నుంచి భక్తులతో పాటు, సినీ, రాజకీయ ప్రముఖులు తరలి వెళ్తున్నారు. అందులో భాగంగానే తాజాగా హీరో విజయ్ దేవరకొండ కుంభమేళాకు బయలుదేరాడు. ఈరోజు ఉదయమే ఆయన తన తల్లితో కలిసి హైదరాబాద్ ఎయిర్ పోర్ట్ లో కుంభమేళాకు వెళ్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. కానీ ఇప్పటిదాకా ప్లేన్ టేకాఫ్ కాకపోవడంతో ఎయిర్ పోర్ట్ లో ప్రయాణికులు ఆందోళనకు దిగారు.
మహా కుంభమేళాలో మరో ప్రమాదం
కాగా జనవరి 13న కుంభమేళా స్టార్ట్ కాగా, ఇప్పటిదాకా 40 కోట్ల మందికి పైగా అక్కడ పుణ్యస్నానాలు ఆచరించినట్టు యూపీ అధికారులు వెల్లడించారు. ఫిబ్రవరి 27 శివరాత్రితో మహాకుంభమేళా పూర్తవుతుంది. 45 రోజుల పాటు సాగే ఈ కుంభమేళాకు దాదాపు 50 కోట్ల మంది హాజరవుతారని అంచనా వేస్తున్నారు. దానికి తగ్గట్టుగా ఏర్పాట్లు కూడా జరుగుతున్నాయి. మరోవైపు మహా కుంభమేళాలోవ్ వరుస ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి.
ఈరోజు అక్కడ అగ్ని ప్రమాదం సంభవించడం తో టెన్షన్ టెన్షన్ వాతావరణం నెలకొంది. సెక్టార్ 18 శంకరాచార్య మార్గంలో మంటలు చెలరేగాయి అని సమాచారం. వెంటనే అగ్నిమాపక సిబ్బంది అక్కడికి వెళ్లి మంటలు ఆర్పే ప్రయత్నం చేస్తున్నట్టుగా తెలుస్తోంది. మరి ఈ ప్రమాదానికి గల కారణం ఏంటి ? అన్న దానిపై పోలీసులు విచారణ చేపట్టారు. దట్టమైన పొగలు వ్యాపించడంతో భక్తులు వెంటనే సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్ళగా, ప్రాణ నష్టం తప్పింది. ఇక ఇప్పటికే కుంభమేళాలో తొక్కిసలాట కారణంగా 30 మంది భక్తులు మృతి చెందిన విషయం తెలిసిందే. అలాగే 60 మంది గాయపడ్డారు. ఈ నేపథ్యంలోనే యోగి సర్కార్ ప్రమాదాలు జరుగకుండా మరిన్ని జాగ్రత్తలు తీసుకున్నారు.