Maharaja: కొన్ని సినిమాలు.. ఎన్నిసార్లు చూసిన చూడాలనిపిస్తుంది. ముఖ్యంగా సమాజంలో జరుగుతున్న సంఘటనల ఆధారంగా తీసిన సినిమాలు అయితే చెప్పనవసరం లేదు. తాజాగా సమాజంలో ఆడవారిపై అత్యాచారాలు ఎక్కువ అవుతున్నాయి. చిన్నా చితకా.. ముసలి ముతకా అనేది కూడా చూడకుండా కామాంధులు.. కామవాంఛ తీర్చుకోవడానికి మృగాళ్లుగా తయారవుతున్నారు. ఇలాంటి ఒక ఘటన ఆధారంగా తెరకెక్కిన చిత్రం మహారాజ.
మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి హీరోగా.. నిథిలన్ సామినాథన్ దర్శకత్వం వహించిన ఈ సినిమా జూన్ 14 న థియేటర్ లో రిలీజ్ అయ్యి భారీ విజయాన్ని అందుకుంది. తమిళ్ లోనే కాకుండా తెలుగులో కూడా బ్లాక్ బస్టర్ హిట్ ను అందుకుంది. ఒక తండ్రిగా విజయ్ సేతుపతి నటన అద్భుతం. కూతురును కొంతమంది రేప్ చేసి జీవచ్ఛవంలా పడేస్తే.. వారిని వెతికి వెతికి మరీ చంపేసిన తీరు ప్రతి తండ్రిని కదిలించింది.
ఇక థియేటర్ లో హిట్ అయిన మహారాజ .. నెల రోజుల తరువాత జూలై 12 న నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కు వచ్చింది. అక్కడ కూడా మహారాజ సత్తా చూపిస్తోంది. ఓటీటీలో కూడా మహారాజ బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది. నెట్ ఫ్లిక్స్ టాప్ ట్రెండింగ్ సినిమాల్లో మొదటి స్థానాన్ని మహారాజ అందుకుంది. అయితే ఒక వారం, రెండు వారాలు కాదు. దాదాపు 4 వారాలుగా మహారాజనే టాప్ ట్రెండింగ్ లో ఉండడం విశేషం. ఇది నిజంగా ఒక అరుదైన రికార్డ్ అని చెప్పాలి.
మహారాజ.. విజయ్ సేతుపతి కెరీర్ లో ఒక మైలు రాయి. విజయ్ 50 వ చిత్రంగా ఈ సినిమా తెరకెక్కింది. చిన్న సినిమాగా తెరకెక్కిన ఈ చిత్రం భారీ విజయాన్ని అందుకుంది. ఈ చిత్రం కోసం విజయ్ సేతుపతి ఒక్క రూపాయి రెమ్యూనరేషన్ కూడా అందుకోలేదు. ఆ సమయంలో నిర్మాత దగ్గర ఎక్కువ డబ్బు లేకపోయేసరికి.. తనకు పారితోషికం ఇస్తే సినిమా ఆగిపోతుందని, ఒక్క రూపాయి కూడా తీసుకోకుండా విజయ్ ఈ సినిమాను పూర్తిచేశాడు.
సినిమా హిట్ అయితే అందులో వచ్చిన లాభాల్లో వాటా ఇవ్వమని, ప్లాప్ అయితే ఈ సినిమా చేసినట్లు మర్చిపొమ్మని చెప్పాడట. ఇక ఈ చిత్రం భారీ విజయం అందుకోవడంతో నిర్మాత విజయ్ కు డబ్బులు తిరిగి ఇచ్చినట్లు సమాచారం. ఇంకా మహారాజ ఎవరైనా చూడకపోతే ఈరోజే నెట్ ఫ్లిక్స్ లో చూసెయ్యండి.