Hero Vishal: తమిళ నటుడు విశాల్ మరోసారి అనారోగ్యానికి లోనయ్యారు. తమిళనాడులోని విల్లుపురంలో జరిగిన కూవాకం ఉత్సవంలో పాల్గొన్న ఆయన వేదికపైనే స్పృహ తప్పి పడిపోవడం కలకలం రేపింది.
వివరాల్లోకి వెళితే..
కూతాండవర్ దేవాలయ ఉత్సవాన్ని పురస్కరించుకొని తిరునంగైవుల అలకిప్ పోటీని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హీరో విశాల్ హాజరయ్యారు. అయితే ఆయన వేదికపై మాట్లాడుతుండగానే అకస్మాత్తుగా స్పృహ కోల్పోయి నేలపై కూలిపోయారు. ఈ దృశ్యాన్ని చూసిన వారంతా ఒక్కసారిగా భయాందోళనకు గురయ్యారు. వెంటనే అక్కడే ఉన్న వైద్యులు విశాల్‌కు ప్రాథమిక చికిత్స అందించారు. అనంతరం ఆయనను సమీపంలోని ఆసుపత్రికి తరలించారు.
వైద్యుల ప్రాథమిక వివరాల ప్రకారం..
విశాల్ తిండి తినకపోవడంతో శక్తిలేమి ఏర్పడి స్పృహ కోల్పోయినట్టు సమాచారం. అరగంట పాటు విశ్రాంతి తీసుకున్న ఆయన, మళ్లీ కార్యక్రమానికి హాజరై యధావిధిగా తన కార్యకలాపాలు సాగించారు.
Also Read: Sree Vishnu: ఆ ఒక్క సినిమాతో బాలీవుడ్ ఆఫర్ కొట్టిన టాలివుడ్ హీరో
గతంలో కూడా విశాల్ ఆరోగ్యం పట్ల అభిమానులు ఆందోళన వ్యక్తం చేసిన సందర్భాలు ఉన్నాయి. ముఖ్యంగా మదగజరాజా ప్రమోషన్ సమయంలో ఆయన రూపం చూసినవారంతా షాక్ అయ్యారు. ఇప్పుడు మళ్లీ వేదికపైనే స్పృహ కోల్పోయిన ఘటనతో విశాల్ అభిమానులు మరింత ఆందోళన చెందుతున్నారు. ప్రస్తుతం విశాల్ ఆరోగ్యం నిలకడగా ఉన్నట్లు సమాచారం. అభిమానులు ఆయన త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నారు.
ఇక విశాల్ సినిమాల విషయంలోకి వెళితే,
హీరో విశాల్ కెరీర్ మళ్లీ ఊపందుకుంది. 2025 జనవరిలో 12 ఏళ్ల ఆలస్యంతో విడుదలైన మదగదరాజా చిత్రం బాక్సాఫీస్ వద్ద అద్భుత విజయాన్ని అందుకుంది. సుందర్ సి దర్శకత్వం వహించిన ఈ యాక్షన్ – కామెడీ చిత్రంలో విశాల్‌తో పాటు సంతానం, అంజలి, వరలక్ష్మి శరత్‌కుమార్ కీలక పాత్రలు పోషించారు. విజయ్ ఆంటోనీ అందించిన సంగీతం ఈ సినిమాకు హైలైట్ అయ్యింది. విడుదలైన కొద్దిసేపటికే రూ. 63 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసి, 2025లో తమిళ సినిమా రంగంలో 5వ అత్యధిక వసూళ్లు సాధించిన సినిమాగా నిలిచింది.
ఈ సినిమా ప్రమోషన్ లో విశాల్ ను చూసిన అభిమానులు షాక్ కు గురయ్యారు. ఆ సమయంలో డెంగ్యూ వంటి వ్యాధికి విశాల్ గురైనట్లు వదంతులు వ్యాపించాయి. చేరన్ దర్శకత్వంలో రూపొందుతున్న పారాసిగా రాజా ఫ్యామిలీ డ్రామా జూలై 16, 2025న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ చిత్రంపై విశాల్ అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి.