Vivek Agnihotri : ప్రముఖ డైరెక్టర్ వివేక్ అగ్నిహోత్రి (Vivek Agnihotri) ‘ది కాశ్మీర్ ఫైల్స్’ (The Kashmir Files) మూవీతో మంచి పాపులారిటీని దక్కించుకున్న సంగతి తెలిసిందే. త్వరలోనే ఆయన ‘ది ఢిల్లీ ఫైల్స్ – ది బెంగాల్ చాప్టర్’ (The Delhi Files – The Bengal Chapter) అనే సినిమాతో ప్రేక్షకులను అదరించడానికి సిద్ధమవుతున్నాడు. ఈ నేపథ్యంలోనే ఆయన గత చిత్రం మాదిరిగానే ఈ మూవీకి అదే గతి పడుతుంది అంటూ ఓ వ్యక్తి ట్రోల్ చేశారు. దీంతో సదరు నెటిజన్ కి వివేక్ అగ్నిహోత్రి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు.
నెగిటివ్ కామెంట్స్ పై డైరెక్టర్ ఫైర్
ఓ నెటిజన్ మూవీ డిజాస్టర్ అవుతుందని ముందుగానే ‘ది ఢిల్లీ ఫైల్స్ – ది బెంగాల్ చాప్టర్’ కామెంట్స్ చేశారు. సోషల్ మీడియా వేదికగా “బ్రదర్ మీ వ్యాక్సిన్ వార్ కి ఏమైందో గుర్తుందా? దీనికి కూడా అదే గతి పడుతుంది” అని రాసుకొచ్చారు. డైరెక్టర్ వివేక్ ఆ కామెంట్స్ పై స్పందిస్తూ “వావ్ ఇది ఎంత మంచి వార్త… ఎందుకంటే ది వ్యాక్సిన్ వార్ మూవీతో మేము చాలా డబ్బు సంపాదించాము. అదే డబ్బుని ఇప్పుడు ది ఢిల్లీ ఫైల్స్ – ది బెంగాల్ చాప్టర్ ను నిర్మించడానికి ఉపయోగించాము. లవ్ యు” అంటూ కామెంట్ చేశారు. దీంతో వీరిద్దరి మధ్య జరిగిన ఈ డిస్కషన్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
‘ది వ్యాక్సిన్ వార్’ కలెక్షన్స్
కోవిడ్ మహమ్మారి నుంచి జనాలను కాపాడడానికి వ్యాక్సిన్ తయారు చేసిన భారతీయ శాస్త్రవేత్తల స్టోరీతో ‘ది వ్యాక్సిన్ వార్’ సినిమాను తెరకెక్కించారు. ఈ మూవీ 2023 సెప్టెంబర్ 28న హిందీ, తమిళ భాషలతో పాటు తెలుగులో కూడా రిలీజ్ చేశారు. వివేక్ అగ్నిహోత్రి దర్శకత్వం వహించిన ఈ సినిమాకు పల్లవి జోషి నిర్మాతగా వ్యవహరించారు. భారీ అంచనాలతో రిలీజ్ అయిన ఈ చిత్రం మిక్స్డ్ టాక్ తెచ్చుకుంది. ఈ మూవీని ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసర్చ్ కు చెందిన ప్రొఫెసర్ బలరాం భార్గవ్ రాసిన ‘గోయింగ్ వైరల్’ పుస్తకం ఆధారంగా తెరపైకి తీసుకొచ్చారు. 10 కోట్ల బడ్జెట్ తో నిర్మించిన ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా 14.7 కోట్లు వసూలు చేసి కమర్షియల్ గా నిరాశపరిచింది.
‘ది ఢిల్లీ ఫైల్స్ – ది బెంగాల్ ఛాప్టర్’ రెండు భాగాలుగా…
ఈ నేపథ్యంలోనే వివేక్ అగ్నిహోత్రి ‘ది ఢిల్లీ ఫైల్స్ – ది బెంగాల్ ఛాప్టర్’ మూవీని తెరకెక్కిస్తున్నారు. రెండు భాగాలుగా ఈ మూవీని రిలీజ్ చేయబోతున్నారు. మేకర్స్ గతంలోనే ఈ మూవీని రెండు భాగాలుగా రిలీజ్ చేయబోతున్నట్టు వెల్లడించారు. ఇక ‘ది ఢిల్లీ ఫైల్స్ – ది బెంగాల్ ఛాప్టర్’ వాస్తవ సంఘటనల ఆధారంగా రూపొందుతోంది. 1940లో బెంగాల్ పై తీసుకున్న రాజకీయ నిర్ణయాల వల్ల ఎలాంటి పరిణామాలు చోటు చేసుకున్నాయి అనే విషయాన్ని సినిమాలో చూపించబోతున్నారు. ఈ చిత్రంలో నానా పటేకర్, పల్లవి జోషి, రైమా సేన్, అనుపమ్ ఖేర్, గిరిజా ఓక్, నివేదిత భట్టాచార్య, సప్తమి గౌడ, మోహన్ కపూర్ నటించారు. ఈ మూవీ 2025 ఆగస్టు 15న రిలీజ్ కాబోతోంది.
Wow! That’s a great news because we made lots of money with it. We used that money to make #TheDelhiFilesBengalChapter. Love you Suri the junkie. https://t.co/kt1msQADyN
— Vivek Ranjan Agnihotri (@vivekagnihotri) February 18, 2025