
Waltair Veerayya:మన పక్క రాష్ట్రం చెన్నైలో సముద్రం ఉంది.. హైదరాబాద్‌లో లేదు. కానీ ఇక్కడ కూడా ఉందిగా అని అంటున్నారు మన మీడియా మిత్రులు. అదేంటి.. హైదరాబాద్‌లో సముద్రం ఉందా? అనే సందేహం రాక మానదు. అయితే హైదరాబాద్ అల్యూమినియం ఫ్యాక్టరీకి వెళితే మాత్రం మన సముద్రాన్ని చూడొచ్చు. ఎలాగంటారా!.. వాల్తేరు వీరయ్య షూటింగ్ అల్యూమినియం ఫ్యాక్టరీలో జరుగుతుంది. ఈ ఫైనల్ స్టేజ్ షూటింగ్ కోసం అల్యూమినియం ఫ్యాక్టరీలో భారీ హార్బర్ సెట్.. సముద్రాన్ని క్రియేట్ చేశారు ఆర్ట్ డైరెక్టర్ ఎ.ఎస్.ప్రకాష్. అక్కడకు వెళ్లి ఈ సెట్‌ను చూసిన మీడియా మిత్రులు ఆశ్చర్యపోతున్నారు. వాల్తేరు వీరయ్య సినిమాకు సంబంధించిన హార్బర్ సెట్ ఫొటోలు నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి.
మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టర్ బాబీ దర్శకత్వంలో రూపొందుతోన్న చిత్రం వాల్తేరు వీరయ్య. సంక్రాంతి సందర్భంగా జనవరి 13న ఈ చిత్రం విడుదలకు సిద్ధమవుతుంది. మాస్ మహారాజా రవితేజ ఇందులో ఓ కీలక పాత్రలో నటించారు. శ్రుతీ హాసన్ హీరోయిన్‌గా నటించింది. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ వాల్తేరు వీరయ్య సినిమాను లావిష్‌గా నిర్మిస్తుంది. సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇప్పటికే విడుదలైన గ్లింప్స్, ఫొటోలు సినిమాపై అంచనాలను అమాంతం పెంచేశాయి. ఫ్యాన్స్, సినీ అభిమానులు సినిమా కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.