Karla Sofia Gascon Row : సినీ రంగంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా భావించే ఆస్కార్ అవార్డుల వేడుక ఆస్కార్ 2025 (Oscar 2025) మరికొన్ని రోజుల్లో షురూ కాబోతోంది. ఇప్పటికే 2025 ఆస్కార్ పురస్కారం నామినేషన్ల జాబితాను అకాడమీ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇందులో ‘ఎమీలియా పెరెజ్’ (Emilia Perez) సినిమా మొత్తం 13 నామినేషన్స్ సాధించడం విశేషం. అయితే ఈ సినిమాలో నటనకు గాను నటి కార్లా సోఫియా గాస్కన్ (Karla Sofia Gascon) ఉత్తమ నటి విభాగంలో పోటీ పడబోతోంది. ఆస్కార్ చరిత్రలో ఫస్ట్ టైం ఒక ట్రాన్స్ జెండర్ నటి ఈ విభాగంలో నామినేట్ కావడంతో సంచలనం సృష్టించింది. కానీ అంతలోనే కార్లా సోఫియా ఓ వివాదంలో చిక్కుకుంది. ఒకప్పుడు ఆమె చేసిన జాత్యహంకార కామెంట్స్ ఇప్పుడు ఆమె ఆస్కార్ అవార్డుకు అడ్డుపడే అవకాశం ఉండడం అభిమానులను టెన్షన్ పడుతోంది.
ఒకటి కాదు రెండు కాదు… కార్లా వివాదాల చిట్టా
2020లో నల్లజాతీయుడైన జార్జ్ ఫ్లాయిడ్ అనే వ్యక్తిని అమెరికా పోలీసులు కాలుతో తొక్కి చంపిన సంగతి ఇంకా అందరికీ గుర్తుండే ఉంటుంది. అప్పట్లో ఈ విషయంపై అమెరికాలో పెద్ద ఎత్తున నిరసనలు జరిగాయి. ప్రభుత్వం సైతం దిగివచ్చి క్షమాపణలు చెప్పక తప్పని పరిస్థితి ఏర్పడింది.. అదే సమయంలో వివాదంపై కార్లా సోఫియా (Karla Sofia Gascon) స్పందిస్తూ “చాలామంది జార్జ్ మృతి గురించి పట్టించుకోలేదు. అతను మాదకద్రవ్యాలకు బానిసైన ఒక మోసగాడు. కానీ ఆయన మరణం మళ్లీ నల్లజాతి ప్రజల హక్కుల గురించి ప్రశ్నించేలా చేసింది. అలాగే పోలీసులను హంతకులుగా చిత్రీకరించింది. ఇది ఏ ఒక్కరి తప్పు కాదు అందరి తప్పు” అంటూ చెప్పుకొచ్చింది.
అక్కడితో ఆగకుండా ఇస్లాం మతంపై ఆమె చేసిన కామెంట్స్ వివాదానికి దారి తీసాయి. “ఇస్లాం మతం మానవాళికి ఓ పెద్ద వైరస్ గా మారుతుంది. దీనిని తుడిచి పెట్టాలి” అంటూ అప్పట్లో రాసుకొచ్చింది. అంతేనా ఆస్కార్ అవార్డులను సైతం వదిలిపెట్టలేదు. “నేను ఆస్కార్ అవార్డుల పోటీకి వచ్చానా ? లేదంటే బ్లాక్ లైవ్స్ మేటర్ ఈవెంట్ కి వచ్చానో అర్థం కావట్లేదు. ఇదొక ఆఫ్రికన్ – కొరియన్ పండగలా అనిపిస్తోంది” అంటూ చెప్పుకొచ్చింది. దీంతో తాజాగా కార్లా ఆస్కార్ కి నామినేట్ అయినప్పటి నుంచి, ఈ వివాదాలు అన్నింటిని తెరపైకి తీసుకొస్తూ నెటిజన్లు మండిపడుతున్నారు.
కార్లా రియాక్షన్…
కార్లా (Karla Sofia Gascon) తన వివాదాస్పద వ్యాఖ్యలు అన్నిటిని గుర్తు చేసుకుంటూ అందరికీ క్షమాపణలు చెప్పింది. “నేను గతంలో చేసిన సోషల్ మీడియా పోస్టుల గురించి క్షమాపణలు చెప్తున్నాను. నాకు ఈ బాధ ఎలా ఉంటుందో తెలుసు. నా వల్ల బాధపడిన వారికి నేను క్షమాపణలు చెప్తున్నాను. ఇప్పటిదాకా నేను మెరుగైన ప్రపంచం కోసమే పోరాడుతూ వచ్చాను. చీకటిపై వెలుగు ఎప్పటికీ విజయం సాధిస్తుందని నేను నమ్ముతాను” అంటూ క్లారిటీ ఇచ్చింది. మరి ఈ వివాదం ఇక్కడితో ఆగుతుందా? లేదా ఆస్కర్ పై ఎఫెక్ట్ పడుతుందా ? అనేది చూడాలి.