వలసలకు వ్యతిరేకంగా లండన్ లో భారీ ర్యాలీ జరిగింది. అదే రోజు వలసలకు అనుకూలంగా, జాత్యహంకార వ్యతిరేక నిరసనకారులు కూడా రోడ్డెక్కారు. ఈ రెండు గ్రూపుల మధ్య గొడవలు జరక్కుండా పోలీసులు జాగ్రత్తలు తీసుకున్నారు. అయినా హింసను ఆపలేకపోయారు. గొడవల్లో 26మంది పోలీసులు గాయపడ్డారు. నలుగురి పరిస్థితి విషమంగా ఉంది అంటే పరిస్థితిని అంచనా వేయొచ్చు. అసలు యూకేలో ఏం జరుగుతోంది? ఎందుకీ గొడవలు, అల్లర్లు, ఆగ్రహ జ్వాలలు? భవిష్యత్ ఎలా ఉండబోతోంది?
వలసలతో సమస్యలు..
అభివృద్ధి చెందిన దేశాలు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్య వలసలు. ఆయా దేశాల్లో జీవన ప్రమాణాలు అత్యున్నతంగా ఉండటం, ఉద్యోగ ఉపాధి అవకాశాలు మెండుగా ఉండటంతో ఇతర దేశాల నుంచి వలసలు బాగా పెరిగిపోయాయి. సహజంగానే ఇవి స్థానికుల ఉపాధి అవకాశాలను దెబ్బతీశాయి. సొంత దేశంలోనే వారి జనాభా తగ్గిపోవడం, వలస వచ్చినవారి హవా పెరిగిపోవడం మొదలైంది. దీంతో వారి అహం దెబ్బతిన్నది. అమెరికాలో ఇదే విషయంపై ప్రచారం చేసిన డొనాల్డ్ ట్రంప్ అధ్యక్ష ఎన్నికల్లో గెలిచారు. వలసవచ్చినవారిని ఏరిపారేస్తామంటూ చెప్పిన ట్రంప్ అన్నంతపనీ చేశారు. చాలామందిని విమానాలు ఎక్కించి సొంత దేశాలకు పంపించారు. ఇంకా ఆ పని చేస్తూనే ఉన్నారు.
అమెరికా లాగే యూకేలో కూడా..
మేథో వలసతో ఏ దేశానికయినే ఉపయోగం ఉంటుంది. పారిశ్రామిక వేత్తలు, ఉపాధి అవకాశాలు సృష్టించేవారు లాభపడతారు. తక్కువ జీతాలతో ఎక్కువ పనిచేసే ఉద్యోగులు వారికి సులభంగా దొరుకుతారు. కానీ ఇది అన్నివేళలా సమర్థనీయం కాదు. అమెరికా ఇప్పుడు నిరుద్యోగులతో అల్లాడిపోడానికి కారణం ఆదేశానికి వలస వచ్చినవారే అన్ని ఉద్యోగాలను ఎగరేసుకుపోవడం. దీన్ని సెట్ రైట్ చేయడానికి ట్రంప్ కొత్త మార్గాలు అణ్వేషిస్తున్నారు. ఇటు యూకేలో కూడా ఈ వలసలు పరిమితిని మించిపోయాయని, తమ ఉనికికే ఎసరుగా మారాయంటున్నారు స్థానిక బ్రిటిష్ పౌరులు. అక్రమ వలసలను ఆపేయాలంటున్నారు. దీనికోసం ‘యునైట్ ది కింగ్‌డమ్’ పేరుతో ర్యాలీ నిర్వహించారు. దీన్ని ‘బ్రిటన్‌లో అతిపెద్ద స్వేచ్ఛా ప్రసంగ ఉత్సవం’గా అభివర్ణించారు.
మేం ఎక్కడికీ వెళ్లం..
ఏ దేశంలో అయినా స్థిరపడాలంటే అక్కడ కొన్ని నియమ నిబంధనలు ఉంటాయి. వాటన్నిటినీ అనుసరించేవారు ఉంటారు, వారే సక్రమ వలసదారులు. వాటిని ఉల్లంఘించేవారు కూడా ఉంటారు. వారే అక్రమ వలసదారులు. ఇక్కడ ఈ రెండు వర్గాలను వేరు చేసి చూడటం ప్రభుత్వాలకు కష్టంగా మారింది. ఇప్పుడు వలసదారులు కూడా తమ ఆధిపత్యం చెలాయించాలని చూస్తున్నారు. బ్రిటన్ లో అదే జరిగింది. లండన్ వీధుల్లో వేలాది మంది జాత్యహంకార వ్యతిరేక నిరసనకారులు గుమిగూడారు. వీరికి జరా సుల్తానా, డయాన్ అబాట్ వంటి వామపక్ష శాసనసభ్యులు మద్దతు తెలిపారు. “శరణార్థులకు స్వాగతం”, “నిలబడండి, తిరిగి పోరాడండి!” అని నినాదాలు చేస్తూ ముందుకు కదిలారు. ఒకరకంగా ఇది స్థానికులను రెచ్చగొట్టడమేననాలి.
యూకేలో వలస వ్యతిరేక ఆందోళనలకు ప్రధాన కారణం రాబిన్సన్. ఇతనికి ఎలన్ మస్క్ సపోర్ట్ కూడా ఉండటంతో ఆందోళన కార్యక్రమాలకు ఆర్థిక మద్దతు కూడా దొరికినట్టయింది. దీంతో లండన్ వీధుల్లో నిరసనలు మిన్నంటాయి. మరోవైపు వీరికి వ్యతిరేకంగా వలస వచ్చినవారు తమ ఆత్మగౌరవం కోడం రోడ్లెక్కారు. వీరిమధ్య జరుగుతున్న ఆధిపత్య పోరు ఎటువైపు దారితీస్తుందో చూడాలి. వలసలను ఆపడం ఎవరివల్లా కాదు, మా దేశంలో మేమే ఉంటాం అని గిరిగీసుకుంటే, అంతర్జాతీయ వర్తకవాణిజ్యాలు తీవ్ర ఇబ్బందుల్లో పడే ప్రమాదం ఉంది. సహకారం, ఇచ్చిపుచ్చుకునే ధోరణి ఉంటేనే అన్ని దేశాలు అభివృద్ధివైపు అడుగులు వేస్తాయి. అలా వేయాలంటే సక్రమమైన వలసలను స్వాగతించాల్సిందే. మరి యూకే ఈ విషయంలో తప్పు చేస్తోందా? పరిణామాలు ఎలా ఉంటాయనేది వేచి చూడాలి.