Arakan army : ప్రస్తుత పరిస్థితుల్లో భారత్ చుట్టూ ఉన్న దేశాలు యుద్ధ కల్లోలిత వాతావరణంలో చిక్కుకుని ఉన్నాయి. దాదాపుగా అన్ని దేశాలు అంతర్గత తిరుగుబాట్లు, రాజకీయ అస్థిరత పరిస్థితుల్లోనే ఉన్నాయి. ఈ పరిస్థితులు అన్నీ దేశ భద్రతపై తీవ్ర ప్రభావాన్ని చూపించే అంశాలే. కాగా.. వాటిని నిత్యం గమనిస్తూనే ఉన్న భారత్.. దేశ రక్షణకు అనుసరించాల్సిన విధానంపై స్పష్టతతోనే ఉన్నట్లు కనిపిస్తోంది. తాజాగా.. మన ఈశాన్య రాష్ట్రాల్లో శాంతి భద్రతలను తీవ్రంగా ప్రభావితం చేసే మయన్మార్ రాజకీయ, సైనిక అంశాల్లో ఊహించని మార్పులు చోటుచేసుకుంటున్నాయి. ఏకంగా సైనిక పాలనా ప్రభుత్వంపై అక్కడి తిరుగుబాటుదారులు స్పష్టమైన ఆధిపత్యాన్ని సాధిస్తుండండతో.. భారత్ సరిహద్దులో మరో దేశం అవిర్భవిస్తుందా.. అనే ఊహగానాలు వ్యక్తం అవుతున్నాయి. అదే నిజమైతే.. భారత్ పై ఎలాంటి ప్రభావం పడనుంది. భారత్ తీసుకోవాల్సిన చర్యలేంటి..
తాజా పరిణామాలు ఏంటి..
బర్మాగా పిలిచే మయన్మార్ లో పరిస్థితుల్ని భారత్ ఎప్పటికప్పుడు నిశితంగా పరిశీలిస్తుంది. కాగా.. ఇటీవల ఆ దేశంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. బర్మా నుంచి భారత్‌కు వెళ్లే ప్రధాన మార్గాల్లో ఉన్న ముఖ్య పట్టణాన్ని జుంటా సైన్యం నుంచి పూర్తిగా ఆధీనంలోకి తీసుకున్నట్లు అరకాన్ ఆర్మీ – (ఏఏ) ప్రకటించింది. అక్కడి చిన్ రాష్ట్రంలోని పలెట్వాను తమ నియంత్రణలోకి అరకాన్ అర్మీ ప్రకటించింది. ఈ పట్టణం భారత సరిహద్దుకు చాలా దగ్గరగహా ఉంటుంది. ఇది.. కీలక ప్రాంతం కావడంతో ఈ పరిణామాలను భారత్ చాలా జాగ్రత్తగా, నిశితంగా పరిశీలిస్తోంది. అరకాన్ సైన్యం రఖైన్ రాష్ట్రంలోని 18 ప్రావిన్సులలో 15 ప్రావిన్సులను ఇప్పటికే స్వాధీనం చేసుకోగా, మరిన్ని ప్రాంతాలను స్వాధీనంలోకి తీసుకునేందుకు ముందుకు సాగుతోంది.
అస్థిర పరిస్థితుల్లో మయన్మార్
సుమారు 6 కోట్ల మంది జనాభా ఉన్న మయన్మార్ లో మొదటి నుంచి రాజకీయ అస్థిర పరిస్థితులే కొనసాగుతున్నాయి. ఇక్కడ ప్రభుత్వాలు, సైన్యం నిత్యం ఘర్షణ వాతావరణంలో ఉంటుండడంతో.. మయన్మార్ ఆర్థికంగా, సామాజికంగా వెనుకబడి ఉంది. కాగా.. ఇక్కడి ప్రజాస్వామ్య పద్ధతిలో ఎన్నికైన ప్రజా ప్రభుత్వంపై సైన్యం తిరుగుబాటు చేసింది. 2020 ఎన్నికల్లో అక్రమాలు జరిగాయని మిలిటరీ మద్దతు ఉన్న డెవలప్‌మెంట్ పార్టీ ఆరోపించగా, ఆ దేశ సైన్యం కూడా నిజమే అని ఆరోపిస్తూ.. దేశంలో ఏడాది పాటు అత్యవసర పరిస్థితిని ప్రకటించింది. 2020 ఎన్నికలలో ఎన్నికైన సభ్యులతో ప్రమాణ స్వీకారం చేసేందుకు ముందురోజు తిరుగుబాటు చేసినస బర్మా ఆర్మీ.. ప్రెసిడెంట్ విన్ మైంట్, రాష్ట్ర సలహాదారు ఆంగ్ సాన్ సూకీ, ఇతర మంత్రులు, వారి డిప్యూటీలు, పార్లమెంటు సభ్యులను అందరినీ నిర్భంధించి.. దేశాన్ని వారి చేతుల్లోకి తీసుకున్నారు.
సైన్యం పై అరకాన్ ఆర్మీ తిరుగుబాటు
మయన్మార్‌లోని అరకాన్ ఆర్మి గురించి ఇప్పుడు భారత్ లో ఎక్కువగా చర్చ జరుగుతుంది. ఇది రాఖైన్ రాష్ట్రంలోని రాఖైన్ అనే జాతి ప్రజల కోసం ఏర్పడిని తిరుగుబాటుదారులున్న గ్రూప్. వీరు బౌద్ధాన్ని ఎక్కువగా పాటిస్తుంటారు. దాంతో.. తమకు మయన్మార్ నుంచి ప్రత్యేక ప్రతిపత్తి కావాలని, వీలైతే ప్రత్యేక దేశం కావాలని కోరుకుంటున్నారు. ఇందుకోసం.. సైనిక తిరుగుబాటును మార్గంగా ఎంచుకుని జంటా సైన్యంపై పోరాడుతున్నారు. ఈ కారణంగానే.. ఈ అరకాన్ ఆర్మీని బర్మా సైనిక ప్రభుత్వం ఉగ్రవాద సంస్థగా ప్రకటించింది. అయితే.. ప్రస్తుతం బర్మాలోని సైన్యంపై ఒంటరిగా కాకుండా.. ఎంఎన్‌డీఏఏ, టీఎన్‌ఎల్‌ఏ వంటి మరికొన్ని గ్రూపులు అక్కడి సైనిక ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాడుతున్నాయి. ఈ మూడు గ్రూపులను త్రీ బ్రదర్‌హుడ్ అలయన్స్ అంటుండగా.. ఇవి 2023 నుంచి సైన్యంపై పోరాడుతున్నాయి.
బంగాళాఖాతాన్ని ఆనుకుని ఉన్న రఖైన్ ప్రాంతంలో మయన్మార్ సైన్యాన్ని అరకాన్ ఆర్మీ ఎదుర్కొంటోంది. రఖైన్, చిన్ ప్రాంతాలు మిజోరం, మణిపుర్ రాష్ట్రాలతో సరిహద్దు కలిగి ఉన్నాయి. ఈ రెండు చోట్ల మయన్మార్ సైన్యం అతిత్వరలో ఖాళీచేయక తప్పదని అంచనా. అంతకుముందు, రఖైన్ రాష్ట్రంలోని ఆన్ పట్టణంలో అధికారంలోని జుంటా దళాలకు చెందిన సభ్యులు లొంగిపోతున్నట్లు ఉన్న వీడియో ఫుటేజీని మయన్మార్ తిరుగుబాటుదారు దళాలైన అరకాన్ ఆర్మీ విడుదల చేసింది.
భారత ఆర్మీ చర్యలు..
మయన్మార్ కు భారత్ లోని మిజోరాం రాష్ట్రంతో సుదీర్ఘ సరిహద్దు ఉంది. దాదాపు 510 కిలోమీటర్ల పొడవైన మిజోరాం ఈ సరిహద్దు వెంబడి.. రక్షణ చర్యలను భారత్ పటిష్టం చేస్తోంది. అలాగే.. కంచె లేని అంతర్జాతీయ సరిహద్దుకు రెండు వైపుల ప్రజల కదలికలను పరిశీలిస్తున్నామని, వీలైంత మేరకు నియంత్రిస్తున్నామని భారత సైనికాధికారులు వెల్లడించారు. ఇరువైపుల 10 కిలోమీటర్ల లోపు ప్రజల సైన్యం అనుమతి లేకుండా సరిహద్దులు దాటకుండా చర్యలు చేపట్టినట్లు తెలిపారు. ఇరుదేశాల నివాసితులు ఒకరినొకరు సందర్శించుకోవడానికి ఇప్పుడు సరిహద్దు పాస్ కచ్చితంగా కావాల్సిందేనని సైనిక అధికారులు తెలుపుతున్నారు.
సరిహద్దుల్లో ఎన్నో తరాలుగా ప్రజల మధ్య సత్సంబంధాలు ఉండడంతో.. వారి రాకపోకల్ని పూర్తిగా నియంత్రించేందుకు వీలుండదు. ఈ కారణంగానే.. అంతర్జాతీయ సరిహద్దుకు ఇరువైపులా 10 కిలోమీటర్ల ప్రాదేశిక పరిమితిలో నివసిస్తున్నారని ధృవీపరిచే పత్రాలు ఉంటే.. వారికి 7 రోజులకు చెల్లుబాటు అయ్యేలా ప్రత్యేక పాస్ అందిస్తున్నారు.
దౌత్య పరంగా భారత్ కు కలిసి రానున్న అంశాలు..
ప్రత్యేక దేశం కోసం పోరాడుతున్న అరకాన్ ఆర్మీ.. అక్కడున్న బలమైన సైనిక తిరుగుబాటుదారుల్లో ఒకటి. దీనికి అత్యాధునిక ఆయుధాలు సైతం మెండుగా ఉన్నట్లు నిఘా వర్గాలు వెల్లడిస్తున్నాయి. అయితే.. ప్రస్తుత పరిణామాల్లో అరకాన్ ఆర్మీ ఆశిస్తున్నట్లుగా ప్రత్యేక రఖైన్ దేశం ఏర్పాటు అయితే… దానికి భారత్ మద్దతు కచ్చితంగా కావాల్సి వస్తుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. లేదంటే.. చుట్టూ ఉన్న సంఘర్షణల్లో ఎక్కువ కాలం మనుగడ సాధించలేదు.
మయన్మార్ లో సైనిక, ప్రజా ప్రభుత్వాల మధ్య ఘర్షణ, అంతర్యుద్ధంతో అక్కడి చిన్-కుకీ తెగలు భారత్‌లోని మిజోరం, మణిపుర్‌లకు శరణార్థులుగా వచ్చారు. వారిలో.. కుకీలు 70 వేల మంది మిజోరంలో ఆశ్రయం పొందుతున్నారు. ప్రస్తుతం ఈశాన్య రాష్ట్రాల్లో చెలరేగిన అల్లర్లల్లో కుకీల పాత్ర ఉంది. అయితే.. అరకాన్ ఆర్మీకి కానీ, దాని మిత్రపక్ష తిరుగుబాటు దళాలకు కానీ కుకీలతో వ్యతిరేకత ఉంది. దీంతో.. ప్రస్తుతం చిన్ ప్రాంతంపై అరకాన్ ఆర్మీ నేతృత్వంలోని.. సీబీఏ తిరుగుబాటుదారులకి ఆధిపత్యం లభించడం భారత్‌కు కలిసొచ్చే అంశమే అంటున్నారు. ఎందుకంటే.. మన దగ్గరకు వచ్చి విద్వేషాలకు, హింసాత్మక ఘర్షణలకు కారణమైన కుకీలను వెనక్కి పంపేందుకు సీబీఏ సహకరించవచ్చని ఆశిస్తున్నారు. ఇప్పటికే.. భారత్ వర్గాలు.. సీబీఏతో సంప్రదింపులు జరుపుతున్నట్లు అంతర్జాతీయ నిఘా సంస్థలు అంచనా వేస్తున్నాయి.
చైనా డబుల్ గేమ్..
భారత్ సహా ఆగ్నేయాసియా దేశాలు తిరుగుబాటు దారులకు వివిధ తీరులుగా మద్ధతుగా నిలుస్తుండగా.. డ్రాగన్ మాత్రం సైనిక కూటమికి మద్ధతుగా నిలుస్తోంది. అసలు ప్రజా ప్రభుత్వాన్ని కూలగొట్టడంలోనూ చైనా పాత్ర ఉంది అంటారు అంతర్జాతీయ రాజకీయ విశ్లేషకులు. అక్కడి నుంచి వచ్చిన ఆయుధాలు, డబ్బుతోనే ప్రభుత్వాన్ని కూల్చేశారని అంటుంటారు. బర్మాలో సైనిక కూటమి ఉంటేనే.. తన బెల్ట్ అండ్ రోడ్ ప్రాజెక్టు(బీఆర్‌ఐ) ప్రాజెక్టుకు కలిసి వస్తుందని భావిస్తోంది. దీంతో పాటు మరికొన్ని కీలక ప్రాజెక్టుల్ని చైనా బర్మాలో మొదలుపెట్టింది. వీటిలో చాాలా వరకు రఖైన్ ప్రాంతంలో కూడా ఉన్నాయి. ఇప్పుడు అక్కడ తిరుగుబాటు దారులు పైచెయి సాధిస్తే.. డ్రాగన్ కుయుక్తులు పారవు. పైగా.. వందల కోట్ల డాలర్లు పెట్టుబడి పెట్టి నిర్మిస్తున్న ప్రాజెక్టులు మూలనపడాల్సి వస్తుందని దాని భయం. ఇందుకోసమే.. తన సరిహద్దులో నుంచి బర్మా సైనిక ప్రభుత్వం పై పోరాడుతున్నతిరుగుబాటుదారులకు సాయం చేస్తోందనే ఆరోపణలున్నాయి. ఇలా.. ఇటు వైపు తిరుగుబాటు దారులకు, మరోవైపు సైనిక ప్రభుత్వానికి సాయం చేస్తూ డబుల్ గేమ్ ఆడుతోంది.
భారత్ కు కలిసొచ్చే అంశాలేంటి..
మణిపూర్ నుంచి కుకీలను తిరిగి తరలించడంతో పాటు అనేక అంశాల్లో కలిసి రావాలంటే.. బర్మాలో తిరుగుబాటు దారుల వశం కావాల్సి ఉంటుంది. ప్రస్తుత సైనిక ప్రభుత్వం.. అక్కడి మైనార్టీలు, బౌద్ధులు, హిందువులపై తీవ్రంగా దాడులు చేస్తూ, చంపేస్తున్నాయి. అక్కడి క్రూరమైన జైళ్లల్లో నిర్భందిస్తూ.. చిత్ర హింసలకు గురిచేస్తున్నాయి. ఈ తరుణంలో.. అన్ని వర్గాల వారికి అనుకూలంగా ఉండడం.. సరిహద్దుల్లో శాంతియుత వాతావరణం ఉండాలంటే.. త్రీ బ్రదర్‌హుడ్ అలయన్స్ అధికారంలోకి రావడమో.. ప్రత్యేక దేశాన్ని సాధించడమో జరగాలని ఆశిస్తున్నారు. అదే జరిగితే.. భారత్ పూర్తి సహాయ సహకారాలు అందించవచ్చని భావిస్తున్నారు.
అంతే కాదు.. ఒకవేళ భారత సరిహద్దుల్లో ప్రత్యేక దేశం ఏర్పడితే.. భారత్ పై కచ్చితంగా ఆధారపడాల్సిన పరిస్థితుల్లో మనకు అనుకూలంగానే మసులుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి.. మనకు భద్రత పరంగా పెద్దగా ఇబ్బందులు వచ్చే అవకాశాలు లేవని అంటున్నారు. అలాగే.. ఆయా ప్రాంతాల్లో మొదలుపెట్టిన కోట్ల విలువైన ప్రాజెక్టుల్లో మళ్లీ కదలిక వస్తుందని భావిస్తున్నారు. ముఖ్యంగా.. మన ఈశాన్య రాష్ట్రాలకు సరకులు, ఇతర కనెక్టివిటీ కోసం చికెన్ నెక్ అనే ప్రాంతం దగ్గర బంగ్లాదేశ్ భూభాగం గుండా రాకపోకలు సాగించాల్సి వస్తుంది. అదే బర్మాలో ప్రత్యేక దేశం ఏర్పడితే.. ఆ ప్రాంతం గుండా ఈశాన్య రాష్ట్రలకు సులువుగా చేరే వీలుంటుందన అంటున్నారు. కాబట్టే.. భారత పాలకులు బర్మాలోని సైనిక కూటమి ప్రభుత్వానికి మద్ధతు ఉపసంహరించుకుని.. తిరుగుబాటుదారుల కూటమికి మద్ధతు ప్రకటించడం వారికి, మనకి ఉపయోగకరమని విశ్లేషిస్తున్నారు. సరిహద్దుల్లో శాంతి భద్రతలు, చైనా వంటి కుట్రల దేశాన్ని పూర్తిగా దూరం పెట్టడంతో పాటు.. భారత్ అవసరాలు పూర్తిస్థాయిలో నెరవేరాలంటే.. మయన్మార్ లో ప్రత్యేక దేశం ఏర్పడడం అత్యావశ్యకం అంటున్నారు.