Syria Attack: సిరియా తీరప్రాంత పట్టణంలో సిరియన్ పోలీసు గస్తీ బృందంపై ముష్కరులు చేసిన మెరుపుదాడిలో దాదాపు 13 మంది భద్రతా సిబ్బంది ప్రాణాలు కోల్పోయారు. ఈ దాడి సమయంలో అనేక మంది గాయపడ్డారని పర్యవేక్షణ బృందం, స్థానిక అధికారులు తెలిపారు. అయితే ఈ దాడి, మాజీ అధ్యక్షుడు బషర్ అసద్ మైనారిటీ అలవైట్ సభ్యులు, సిరియా తీరప్రాంతంలో ఇస్లామిక్ గ్రూపుల మధ్య ఉద్రిక్తతలు పెరిగిన సమయంలోనే జరిగిందని చెబుతున్నారు. డిసెంబర్ ప్రారంభంలో, ఇస్లామిస్ట్ హయత్ తహ్రీర్ అల్-షామ్ నేతృత్వంలోని తిరుగుబాటు గ్రూపులు అసద్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా దాడులు ప్రారంభించాయి.
లటాకియా నగరానికి సమీపంలోని జబ్లే పట్టణంలో జరిగిన ఈ దాడిలో కనీసం 16 మంది మరణించినట్లు బ్రిటన్‌కు చెందిన సిరియన్ అబ్జర్వేటరీ ఫర్ హ్యూమన్ రైట్స్ తెలిపింది. పోలీసు దళంపై మెరుపుదాడి చేసిన ముష్కరులు అలవైట్లని పర్యవేక్షణ బృందం అధిపతి రామి అబ్దుర్రహ్మాన్ తెలిపారు. ఇవి పాలన పతనం తర్వాత జరిగిన అత్యంత దారుణమైన ఘర్షణలని అబ్దుర్రహ్మాన్ అన్నారు.
డమాస్కస్‌లోని స్థానిక అధికారి, జనరల్ సెక్యూరిటీ డైరెక్టరేట్‌లో 13 మంది సభ్యులు ఆకస్మిక దాడిలో మరణించారని మీడియాకు తెలిపారు. భద్రతా సమాచారాన్ని మీడియాకు తెలుపడానికి తనకు అధికారం లేనందున వారి పేరు వెల్లడించకూడదన్నారు. సిరియాలో 13 ఏళ్లుగా కొనసాగుతున్న అంతర్యుద్ధంలో దాడుల తర్వాత వెంటనే ఘర్షణల్లో అధికమంది ప్రాణాలు కోల్పోవడం సాధారణమని చెప్పవచ్చు. గత కొన్నేళ్లుగా జరిగిన ఈ ఘర్షణల్లో అర మిలియన్ మంది మరణించారని నివేదికలు చెబుతున్నాయి. దీన్ని బట్టి ఇక్కడి దాడుల గురించి అర్థం చేసుకోవచ్చు.
Read Also: Womens Day 2025: ఉమెన్స్ డే స్పెషల్.. మీ తల్లి, భార్య, సోదరిని ఇలా సర్‌ప్రైజ్ చేయండి
ఈ ఘటన నేపథ్యలో సమీపంలోని టార్టస్ నగరంలో అధికారులు 12 గంటల కర్ఫ్యూ విధించారు. ప్రజలు ఇంట్లోనే ఉండాలని , బహిరంగ ప్రదేశాల్లో భేటీలకు దూరంగా ఉండాలని కోరారు. పరిస్థితిని అదుపులోకి తీసుకురావడానికి తీరప్రాంతానికి పెద్ద సంఖ్యలో అదనపు బలగాలను పంపుతున్నట్లు అక్కడి అధికారులు తెలిపారు. జబ్లే, పరిసర ప్రాంతాలలో అలవైట్ ముష్కరులు, ఆయా స్థానాలపై హెలికాప్టర్ గన్‌షిప్‌లతో దాడి చేశాయని సిరియన్ అబ్జర్వేటరీ తెలిపింది. సిరియా మాజీ ఆర్మీ జనరల్ సుహీల్ అల్-హసన్ కు విధేయులైన యోధులు భద్రతా దళాలపై దాడుల్లో పాల్గొన్నారని వెల్లడించింది.
ఐదు దశాబ్దాలకు పైగా అసద్ కుటుంబం ఆధ్వర్యంలో సిరియాను పాలించిన అలవైట్లపై సున్నీ ఉగ్రవాదులు దాడులకు పాల్పడుతున్నారని నివేదికలు ఉన్నాయి. కొత్త అధికారులు సామూహిక ప్రతీకార చర్యలను ఖండించినప్పటికీ ఈ ఘటనలు జరిగాయి. మరోవైపు భద్రతా అధికారి సాజిద్ అల్-డీక్ చెప్పినట్లు పరిస్థితి ప్రస్తుతం అదుపులోనే ఉందని అన్నారు. గురువారం భద్రతా దళాలపై దాడి చేసిన ముష్కరులతో అలవైట్లకు ఎటువంటి సంబంధం లేదని ఆయన పేర్కొన్నారు. ఈ ఘటన నేపథ్యంలో భద్రతా దళాలు మాజీ సీనియర్ నిఘా అధికారి మేజర్ జనరల్ ఇబ్రహీం హ్వీజీని అరెస్టు చేసినట్లు తెలుస్తోంది. 1977లో లెబనీస్ డ్రూజ్ నాయకుడు కమల్ జౌంబ్లాట్ హత్యను పర్యవేక్షించినందుకు ఆయనపై పలు ఆరోపణలు ఉన్నాయి.