Bangladesh Yunus China| బంగ్లాదేశ్ తాత్కాలిక సారథి మహమ్మద్ యూనస్.. చైనాను మంచి మిత్రుడిగా చూడటం తమ దేశానికి ఎంతో ముఖ్యమని పేర్కొన్నారు. బంగ్లాదేశ్, చైనాల మధ్య సంబంధాలు కొత్త దశలోకి ప్రవేశిస్తాయని ఆశిస్తున్నట్లు తెలిపారు. ‘‘ఎన్నో ఏళ్లుగా మా బంధం బలంగా ఉంది. ఇరుదేశాల మధ్య వ్యాపారం ఇంకా బలంగా ఉంది. చైనా సహకారం వల్ల మేము చాలా ప్రయోజనం పొందుతున్నాం’’ అని ఆయన చెప్పారు. నాలుగు రోజుల పర్యటనలో భాగంగా బుధవారం చైనాకు వెళ్లారు. అక్కడ పర్యటనను ముగించుకొని, బిమ్స్‌టెక్ శిఖరాగ్ర సమావేశంలో పాల్గొనడానికి థాయిలాండ్‌కు వెళ్లనున్నారు.
పర్యటనలో భాగంగా యూనస్.. చైనా ప్రెసిడెంట్ జిన్‌పింగ్ (Xi Jinping)తో సమావేశమయ్యారు. బంగ్లాదేశ్ ఆర్థిక వ్యవస్థను పునరుద్ధరించడానికి చైనా పెట్టుబడులు పెంచాలని ఆయన కోరారు. తీస్తా నది సమగ్ర నిర్వహణ, పునరుద్ధరణ ప్రాజెక్ట్ (TRCMRP)లో పాల్గొనడానికి చైనా కంపెనీలను బంగ్లాదేశ్ స్వాగతించింది. డ్రాగన్ ఇస్తున్న రుణాలకు వడ్డీలను తగ్గించాలని, ఆ దేశ నిధులు అందుతున్న ప్రాజెక్టులకు కమిట్‌మెంట్ ఫీజ్‌ను మాఫీ చేయాలని యూనస్ కోరారు. అలాగే పలు అభివృద్ధి ప్రాజెక్టులకు మద్దతు ఇవ్వాలన్నారు.
Also Read: మయన్మార్ భూకంపం.. 1400 దాటిన మృతుల సంఖ్య.. భూకంపానికి ఇదే కారణం..
యూనుస్ హయాంలో బంగ్లాదేశ్ విదేశాంగ విధానంలో మార్పు
బంగ్లా ప్రధానిగా షేక్ హసీనా (Sheikh Hasina)ను రాజకీయ సంకోభంతో గద్దె దించిన తరువాత బంగ్లా తాత్కాలిక సారథి యూనుస్ నేతృత్వంలో.. బంగ్లాదేశ్ (Bangladesh) విదేశాంగ విధానంలో మార్పు స్పష్టంగా కనిపిస్తోంది. భారత వ్యతిరేక దేశాలైన చైనా, పాకిస్తాన్‌లకు బంగ్లా దగ్గరవుతోంది. ఆయా దేశాలతో వాణిజ్య సంబంధాలు బలోపేతం చేసుకుంటోంది. ఈ దిశగా యూనుస్ ఆయా దేశాల పెద్దలతో సమావేశాలు జరుపుతున్నారు. అందులో భాగంగానే 53 ఏళ్లలో తొలిసారి ఇటీవల పాక్ నుంచి నేరుగా బంగ్లాకు కార్గో షిప్, సరుకు రవాణా నౌకలు చేరుకున్నాయి. పాకిస్తాన్ తరువాత ప్రస్తుతం చైనాతో వాణిజ్య సంబంధాలు బలోపేతం చేసుకోవడానికి యూనస్ తెగ ఆసక్తి చూపిస్తున్నారు.
మాజీ ప్రధాని షేక్ హసీనాపై కేసు నమోదు చేసిన బంగ్లా సీఐడీ
దేశం విడిచి పారిపోయిన బంగ్లాదేశ్ (Bangladesh) మాజీ ప్రధాన మంత్రి షేక్ హసీనాపై (Sheikh Hasina) బంగ్లాదేశ్ సిఐడి పోలీసులు కేసు నమోదు చేశారు. మహ్మద్ యూనస్ (Muhammad Yunus) నేతృత్వంలోని తాత్కాలిక ప్రభుత్వాన్ని గద్దె దించేందుకు కుట్ర పన్నుతున్నారనే అభియోగంపై హసీనాతోపాటు మరో 72 మందిపై కేసులు నమోదైనట్లు అక్కడి ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. ‘‘కుట్ర వ్యవహారంలో షేక్ హసీనాపై ఢాకా మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ కోర్టులో కేసు నమోదైంది. కోర్టు ఆదేశాల మేరకు దీనిపై క్రిమినల్ ఇన్వెస్టిగేషన్ డిపార్ట్‌మెంట్ (సీఐడీ) విచారణ ప్రారంభించింది’’ అని పోలీసు ఉన్నతాధికారి ఒకరు మీడియాకు వెల్లడించారు.
గతేడాది డిసెంబర్ 19న షేక్‌హసీనా ఆన్‌లైన్‌లో సమావేశాన్ని ఏర్పాటుచేసినట్లు సీఐడీకి స్పష్టమైన సమాచారం ఉంది. ‘‘జాయ్ బంగ్లా బ్రిగేడ్’’ పేరుతో వ్యవస్థను ఏర్పాటుచేసి.. తద్వారా బంగ్లాలో మళ్లీ హసీనా ప్రభుత్వాన్ని ఏర్పాటుచేయాలన్నది ఆ సమావేశం ముఖ్య ఉద్దేశం. ఈ నేపథ్యంలో ప్రభుత్వాన్ని అస్థిర పరిచేందుకు హసీనా కుట్ర పన్నుతున్నారంటూ సీఐడీ ఆమెపై కేసు నమోదు చేసింది. షేక్ హసీనా ప్రధానిగా ఉన్న సమయంలో రిజర్వేషన్లకు వ్యతిరేకంగా జరిగిన నిరసనలు హింసాత్మకంగా మారిన నేపథ్యంలో 2024 ఆగస్టు 5న ప్రధాని షేక్ హసీనా దేశం వీడిన తరువాత.. ఆమెకు భారత దేశం ఆశ్రయం కల్పించింది. ఈక్రమంలో షేక్ హసీనాతోపాటు ఆమె మంత్రివర్గంలో ఉన్న రాజకీయ నాయకులు, సలహాదారులు, సైనికాధికారులపైనా నేరారోపణలు నమోదుయ్యాయి. ఈ క్రమంలో రాజధాని ఢాకాలోని ఇంటర్నేషనల్ క్రైమ్స్ ట్రైబ్యునల్ (ICT) కొంత కాలం క్రితం ఆమెకు అరెస్టు వారెంట్ జారీ చేసింది.