వివిధ రకాల వైరస్ లు, ఇతరత్రా సూక్ష్మ జీవిలు పంటల్ని నాశనం చేస్తాయని మనకి తెలుసు. అలాంటిది ఆ ఫంగస్ లను ఉద్దేశపూర్వకంగానే వ్యవసాయ క్షేత్రాల్లో ప్రవేశ పెడితే దాన్ని ఏమనాలి. ఆ పని ఒక దేశం, ఇంకో దేశంలో రహస్యంగా చేస్తే దాన్ని ఎలా చూడాలి. అవును, ఆధునిక యుగంలో ఇది ఓ కొత్త తరహా యుద్ధం. ఒక దేశ ఆర్థిక వ్యవస్థను దెబ్బకొట్టేందుకు మరో దేశంచేస్తున్న కుతంత్రం ఇది. ఒకరకంగా దీన్ని వ్యవసాయ ఉగ్రవాదం అని కూడా పిలవొచ్చు. గతంలో ఇలాంటి ఉదాహరణలు ఉన్నా.. ఇప్పుడు మళ్లీ ఈ వ్యవసాయ ఉగ్రవాదాన్ని చైనా తెరపైకి తెచ్చింది. అమెరికాలో చైనా శాస్త్రవేత్తలు చేస్తున్న రహస్య ఆపరేషన్ ఎట్టకేలకు బయటపడింది.
ఇద్దరు చైనా శాస్త్రవేత్తలు అరెస్ట్..
అమెరికాలోని మిచిగాన్ యూనివర్శిటీలో పరిశోధనలు చేస్తున్న చైనా శాస్త్రవేత్తలు జున్యోంగ్ లియు, యుంకింగ్ జియాన్ ఈ దారుణానికి ఒడిగట్టారు. మిచిగాన్ యూనివర్శిటీలో ప్రయోగాలు చేపట్టేందుకు వారు అక్రమంగా చైనా నుంచి ఒక ఫంగస్ ని తెప్పించడానికి ప్రయత్నించారు. ఈ పరిశోధనలకోసం చైనా నుండి వారికి నిధులు కూడా అందుతున్నాయని తెలుస్తోంది. ఫ్యూసేరియం గ్రామినారమ్ అనేది ఈ ఫంగస్ పేరు. దీనివల్ల వరి, గోధుమ, బార్లీ, మొక్కజొన్న వంటి పంటలు పూర్తిగా నాశనం అవుతాయి. ఈ ఫంగస్ కలిసిన ఆహార పదార్ధాలను మానవవులు స్వీకరిస్తే వాంతులు మొదలవుతాయి. లివర్ దెబ్బతినే ప్రమాదం ఉంది. అలాంటి ప్రమాదకర ఫంగస్ ని చైనా నుంచి తీసుకొస్తున్న ఇద్దరు సైంటిస్ట్ లను అమెరికా పోలీసులు అరెస్ట్ చేశారు. చైనా వ్యూహాన్ని తిప్పికొట్టారు.
భారత్ కూడా బాధితురాలే..
భారత దేశంపై కూడా వ్యవసాయ ఉగ్రవాద దాడులు జరిపేందుకు పాకిస్తాన్ కుట్రలు పన్నినట్టు తెలుస్తోంది. భారత్ వ్యవసాయ ఆధారిత దేశం. దేశ GDPకి వ్యవసాయ రంగం 17శాతం వాటా అందిస్తోంది. మన జనాభాలో 55శాతం మంది వ్యవసాయం, అనుబంధ రంగాలపై ఆధారపడి ఉన్నారు. ఇలాంటి దేశంలో వ్యవసాయాన్ని దెబ్బకొడితే కచ్చితంగా ఆర్థికంగా ఎదురుదెబ్బ తగులుతుంది. దీనికోసమే పాకిస్తాన్ కూచుకుని కూర్చుంది. చైనా, పాకిస్తాన్ సరిహద్దుల్లో ఉన్న పంజాబ్, రాజస్థాన్, హిమాచల్ ప్రదేశ్ వంటి రాష్ట్రాల్లో ‘వ్యవసాయ-ఉగ్రవాదం’ ముప్పు మరింత ఎక్కువగా ఉందని సర్వేలు చెబుతున్నాయి.
గతంలో వ్యవసాయ ఉగ్రవాదాన్ని భారత్ సమర్థంగా నిలువరించింది. 2016లో బంగ్లాదేశ్ నుంచి విషపూరిత శిలీంధ్రం పశ్చిమ బెంగాల్ లోని రెండు జిల్లాలకు విస్తరించింది. రక్షణరంగ పరిశోధన అభివృద్ధి సంస్థ (DRDO) స్వయంగా ఈ వివరాలు వెళ్లడించింది. ప్రభుత్వం ఆ రెండు జిల్లాల్లో గోధుమల సాగును మూడు సంవత్సరాల పాటు నిషేధించడంతో ఆ శిలీంధ్రం వ్యాప్తి ఆగిపోయింది. బంగ్లాదేశ్‌ను ఆనుకుని ఉన్న ఇతర జిల్లాల్లో, అంతర్జాతీయ సరిహద్దు నుండి 5 కిలోమీటర్ల లోపల గోధుమ సాగుని ప్రభుత్వం నిషేధించింది. ఈ తెగులుని బంగ్లాదేశ్ నుంచి ఉద్దేశపూర్వకంగానే పశ్చిమ బెంగాల్ లోకి ప్రవేశపెట్టబడిందని అంటున్నారు. ఇక పాకిస్తాన్ సరిహద్దుల్లో పత్తి పంటపై 2015లో కాటన్ లీఫ్ కర్ల్ వైరస్ దాడి చేసింది. పత్తిపంటలో మూడింట రెండు వంతులు దీనివల్ల దెబ్బతిన్నది. దక్షిణ పంజాబ్ లో కనీసం 15మంది రైతులు ఆత్మహత్యలకు పాల్పడ్డారు. ఇది పాకిస్తాన్ కుట్రగా భావించారు.
ఆధునిక ఆయుధం..
వ్యవసాయ ఉగ్రవాద మూలాలు రెండవ ప్రపంచ యుద్ధ సమయంలోనే బయటపడ్డాయి. “కొలరాడో బంగాళాదుంప పురుగుల”తో బ్రిటన్‌లోని బంగాళాదుంప పంటలను లక్ష్యంగా చేసుకుంది జర్మనీ. ఈ పురుగుల్ని 1943లో ఇంగ్లాండ్‌లో కనుగొన్నారు. వీటిని విమానం నుంచి కిందకు వదిలారని తెలుస్తోంది. రెండో ప్రపంచ యుద్ధం కొనసాగి ఉంటే.. జపాన్ ఈ తరహా దాడుల్ని చేయాలనుకుంది. కానీ అది సాధ్యం కాలేదు. ఇప్పుడు మళ్లీ వ్యవసాయ ఉగ్రవాదం తెరపైకి వచ్చింది. చైనా ఈ తరహా ప్రయత్నాలను చేస్తున్నట్టు తెలుస్తోంది. అమెరికా ముందస్తుగా ముప్పుని గుర్తించి చైనా సైంటిస్ట్ లను అరెస్ట్ చేసింది. భారత్ కూడా ఈ విషయంలో అప్రమత్తంగా ఉండటం మంచిది.