China Friendly Move India| భారత్, చైనా పరస్పర విరోధాన్ని పెంచుకోవడం కంటే భాగస్వాములుగా కలిసి పనిచేయడమే ఉత్తమమని చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యీ అభిప్రాయపడ్డారు. ఇరు దేశాల ద్వైపాక్షిక సంబంధాలపై ఆయన మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. ఆసియాలో కీలకమైన ఈ రెండు దేశాల మధ్య సహకారం అత్యంత ముఖ్యమని ఆయన నొక్కి చెప్పారు. దీన్ని సమన్వయంతో నృత్యం చేసే కళతో పోల్చారు.
“చైనా-భారత్ భాగస్వాములుగా పరస్పర విజయానికి సహకరించుకోవాలి. ఈ లక్ష్యాన్ని సాధించడానికి డ్రాగన్-ఎలిఫెంట్ డ్యాన్స్ ఒక్కటే సరైన మార్గం” అని వాంగ్ యీ వ్యాఖ్యానించారు. ఇరు దేశాలు పరస్పరం చిన్నచూపు చూపుకోవడం కంటే ఒకరికొకరు మద్దతుగా నిలవాలని పిలుపునిచ్చారు. పరస్పర సహకారమే రెండు దేశాల ప్రజల ప్రాథమిక ప్రయోజనాలను బలోపేతం చేస్తుందని ఆయన అన్నారు.
Also Read: ఉక్రెయిన్ యుద్ధం కోసం ఫ్రాన్స్ అణ్వాయుధాలు.. వార్నింగ్ ఇచ్చిన రష్యా
భారత్ మరియు చైనా మధ్య మెరుగైన సంబంధాలు ప్రపంచవ్యాప్తంగా గ్లోబల్ సౌత్ దేశాలకు కూడా ప్రయోజనకరమని వాంగ్ యీ తెలిపారు. అంతర్జాతీయ సంబంధాల్లో ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేసి, అంతర్జాతీయ వేదికలపై గ్లోబల్ సౌత్ (పేద దేశాల) స్థానాన్ని శక్తిమంతం చేస్తుందని ఆయన అభిప్రాయపడ్డారు.
ఇరు దేశాల మధ్య వివాదాలను దౌత్యమార్గంలో పరిష్కరించుకోవాలని, సమష్టి ప్రయోజనాలను కాపాడుకోవడానికి సహకారం అవసరమని వాంగ్ యీ అన్నారు. “చర్చల ద్వారా పరిష్కారం కానీ సమస్యే లేదు. అదే సమయంలో సహకారంతో చేరుకోలేని లక్ష్యాలు లేవు” అని ఆయన వెల్లడించారు.
దక్షిణాఫ్రికాలో జరిగిన జీ20 విదేశాంగ మంత్రుల సమావేశంలో భారత మంత్రి ఎస్. జైశంకర్‌తో చైనా మంత్రి వాంగ్ యీ భేటీ అయ్యారు. ఆ తర్వాత కొన్ని వారాల్లోనే ఈ ప్రకటనలు వెలువడ్డాయి. వాస్తవానికి 2020లో గల్వాన్ ఘర్షణ తర్వాత ఇరు దేశాల మధ్య సంబంధాలు అట్టడుగుకు పడిపోయాయి. ఆ తర్వాత పలు విడతలుగా ఇరు దేశాల దౌత్యవేత్తలు, సైనికాధికారులు చర్చలు జరిపారు. 2024లో ప్రధాని నరేంద్ర మోదీ మరియు చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ బ్రిక్స్ సదస్సు సందర్భంగా కజాన్‌లో కలిశారు. ఆ తర్వాత సరిహద్దుల్లో ఉద్రిక్తత ఉన్న ప్రాంతాల నుంచి ఇరు దేశాల బలగాలు వెనక్కి తగ్గి పాత స్థితికి చేరుకున్నాయి. మరోవైపు, ఈ సంవత్సరం షాంఘై కో ఆపరేషన్ ఆర్గనైజేషన్ (ఇందులో చైనా కూడా ఓ భాగం) సమావేశాలకు చైనా ఆతిథ్యం ఇస్తోంది. భారత ప్రధాని మోదీ ఈ సమావేశంలో పాల్గొనడం అత్యంత కీలకంగా మారనుంది.
అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ బాధ్యతలు చేపట్టిన తర్వాత దిగుమతి సుంకాలను భారీగా పెంచారు. ప్రధానంగా కెనడా, మెక్సికో ఉత్పత్తులపై 25 శాతం చొప్పున, చైనా ఉత్పత్తులపై అదనంగా 10 శాతం సుంకాలు విధించబోతున్నామని, మంగళవారం నుంచే ఇది అమల్లోకి వస్తుందని ట్రంప్ ప్రకటించారు. అమెరికాకు వస్తువులు ఎగుమతి చేసే దేశాలు సుంకాలు చెల్లించాల్సిందేనని ఆయన తెలిపారు.
దీనికి చైనా కూడా అంతే ఘాటుగా స్పందించింది. తమ దేశంలోకి దిగుమతి అయ్యే అమెరికా వస్తువులపై అదనంగా 15 శాతం టారిఫ్ విధిస్తున్నట్లు ప్రకటించింది. చికెన్, గోధుమలు, మొక్కజొన్న, పత్తి తదితర దిగుమతులపై ఈ టారిఫ్ వసూలు చేస్తామని, అలాగే జొన్న, సోయాబిన్, పోర్క్, బీఫ్, సముద్ర ఉత్పత్తులు, పండ్లు, కూరగాయలు, పాడి ఉత్పత్తులపై అదనంగా 10 శాతం సుంకాలు విధించనున్నట్లు వెల్లడించింది.
అయితే, చైనా ప్రస్తుత చూపులు భారత్ వైపు పడ్డాయి. భారత్ తో గతంలో ఉన్న విరోధాన్ని పూర్తిగా పక్కన పెట్టేందుకు చైనా సిద్ధమైంది. భారత్ తో శత్రుత్వం కంటే మిత్రత్వమే మేలనే భావనకు చైనా వచ్చింది. భారత్ తో కలిసి పని చేయాలని చూస్తోంది. ఈ మేరకు ఇప్పటికే ఒక మెట్టు దిగి భారత్ సహకారం కావాలంటోంది డ్రాగన్.