
China Li Keqiang : చైనా మాజీ ప్రధాని లీ కేఖియాంగ్ (Li Keqiang) గుండెపోటుతో కన్నుమూశారు. 68 ఏళ్ల వయస్సు గల లీ కేఖియాంగ్ గుండెపోటుకు గురై శుక్రవారం (అక్టోబర్ 27,2023) కన్నుమూశారని చైనా అధికార మీడియా తెలిపింది.
పాలనాపరంగా పలు సంస్కరణల చేసిన లీ బ్యూరోక్రాట్ గా కూడా మంచి పేరు తెచ్చుకున్నారు. ఆయన సంస్కరణలతో దేశానికి అభివృద్ధి బాట పట్టించారు. పదేళ్లపాటు చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ హయాంలోనే ప్రధాన మంత్రిగా పనిచేసి విశేష సేవలు అందించారు.
గత మార్చి నెలలో ఆయన తన పదవికి రాజనామా చేశారు. గురువారం గుండెపోటుకు గురైన లీని వెంటనే షాంఘైలోని ఓ ప్రముఖ ఆస్పత్రికి తరలించారు. ఆ తరువాత ఆయన ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటున్న సమయంలో శుక్రవారం తెల్లవారుజామున తుదిశ్వాస విడిచారని చైనా అధికార మీడియా జిన్హువా వెల్లడించింది.
బ్యూరోక్రాట్ గా ఇంగ్లీషు అనర్గళంగా మాట్లాడే సామర్థ్యం కలిగిన లీ పలు ఆర్థిక సంస్కరణలకు నాంది పలికారు. ఓ ఆర్థికవేత్తగా అంతర్జాతీయ స్థాయిలో ఆయనకు మంచి గుర్తింపు ఉంది. ప్రధానిగా పనిచేస్తున్న సమయంలో తనతోటి వారితో పోల్చితే ఆధునిక ఆలోచనలు కలిగిన వ్యక్తిగా గుర్తింపుపొందారు. పార్టీ పరిమితులను ఏమాత్రం దాటకుండాగానే మరోపక్క ఆర్థిక సంస్కరణల దిశగా పనిచేసేవారు.
పెకింగ్ యూనివర్శిటీ నుంచి న్యాయ పట్టా పొందిన లీ కేఖియాంగ్.. చదువుకునే సమయంలోనే ఆయన పాశ్చాత్య, ఉదారవాద సిద్ధాంతాల దిశగా పనిచేసేవారని తోటి విద్యార్దులు చెప్పేవారు. బ్రిటీష్ న్యాయమూర్తి చట్టాలపై రాసిన ఓ పుస్తకాన్ని లీ ట్రాన్స్ లేట్ చేశారు. తూర్పు చైనాలోని పేద అన్ హుయ్ ప్రావిన్స్ లో ఒక చిన్న పార్టీ నేత కుమారుడిగా జన్మించిన లీ.. చైనా ప్రధాని స్థాయికి చేరుకుని పదేళ్లు పాలించారు.

చైనా అధ్యక్షుడు జీ జిన్‌పింగ్ నిర్ణయాలను ఆయన పలు మార్లు వ్యతిరేకించిన సందర్భాలున్నాయి. లీ కేఖియాంగ్ మరణం తరువాత అధ్యక్షుడు జీ జిన్‌పింగ్ వ్యతిరేకత లేకుండా పోయిందని చైనా రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.