Fujian Tulou: ఇది చైనాలోని ఫుజియాన్ ప్రాంతపు తులో.. ఒక ఇల్లు కాదు.. తరతరాల కుటుంబాన్ని తనలో దాచుకున్న ఓ గ్రామం. చైనాలోని ఫుజియాన్ పర్వత ప్రాంతాల్లో కనిపించే ఈ తులో నిర్మాణాలు.. ప్రధానంగా హక్కా ప్రజల సామూహిక జీవన సంప్రదాయానికి ప్రతీకలు. ఒకే వంశానికి చెందిన అనేక కుటుంబాలు.. తరతరాలుగా ఒకే ప్రాంగణాన్ని పంచుకుంటూ.. ఒకే గోడల మధ్య జీవించడం ఈ ఇళ్ల ప్రత్యేకత.
ఒక కుటుంబంలో పిల్లలు పుడతారు.. వాళ్లు పెరుగుతారు.. వాళ్ల పిల్లలు పుడతారు.. తరం మారినా ఇల్లు మాత్రం మారదు. అందుకే ఒక తులోను చూస్తే.. అది కేవలం ఓ నిర్మాణంలా కనిపించదు. ఒక కుటుంబ చరిత్రకు నిలువెత్తు సాక్ష్యంలా కనిపిస్తుంది. చూస్తే మట్టి, కలప, రాళ్లతో నిర్మించిన భారీ గోడలు చాలా చోట్ల అనేక అంతస్తులు.. మధ్యలో పెద్ద ఖాళీ ప్రాంగణం ఆ ప్రాంగణం చుట్టూ కుటుంబాల నివాస గదులు వరుసగా ఉంటాయి. బయటకు కోట లోపల కుటుంబ ప్రపంచం.
ఒక్క ప్రధాన ద్వారం మాత్రమే ఉండటం ఈ నిర్మాణాల్లో మరో ప్రత్యేకత. బయటి వైపు కిటికీలు కూడా దిగువ అంతస్తుల్లో చాలా తక్కువగా ఉండేలా నిర్మించారు. కారణం అందం మాత్రమే కాదు. రక్షణ. గతంలో దొంగలు, దాడుల నుంచి కుటుంబాలను కాపాడుకునేలా ఈ భారీ గోడలు, పరిమిత ప్రవేశ ద్వారాలు రూపొందించారు. ఒక్క భవనంలోనే ఓ చిన్న గ్రామం. కింద అంతస్తుల్లో వంటగదులు.. భోజన ప్రదేశాలు.. కుటుంబ అవసరాలకు సంబంధించిన సామూహిక స్థలాలు.. పై అంతస్తుల్లో ధాన్యం, ఆహార నిల్వలు.. ఆ తర్వాతి అంతస్తుల్లో బెడ్‌రూమ్స్.. అంటే.. జీవితానికి అవసరమైన దాదాపు ప్రతిదీ ఒకే నిర్మాణంలో ఉన్నాయి. అందుకే UNESCO కూడా తులోలను ఒక కుటుంబానికి చెందిన ‘చిన్న రాజ్యం’ లేదా ‘కిక్కిరిసిన చిన్న నగరం’గా అభివర్ణించింది.
Also read: మళ్లీ అధికారంలోకి వచ్చేది మేమే.. టీపీసీసీ భేటీలో మంత్రి ఉత్తమ్ ధీమా!