BigTV English

Trump USAID Stay : ట్రంప్ తలపై మొట్టికాయ వేసిన కోర్టు.. యూఎస్‌ఎయిడ్‌‌ ఉద్యోగుల ఆదేశాలపై స్టే

Trump USAID Stay : ట్రంప్ తలపై మొట్టికాయ వేసిన కోర్టు.. యూఎస్‌ఎయిడ్‌‌ ఉద్యోగుల ఆదేశాలపై స్టే

Trump USAID Stay | అధికారంలోకి వచ్చినప్పటి నుంచి అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ ఎడాపెడా ఎగ్జిక్యూటివ్ ఆర్డర్‌లు (కార్యనిర్వాహక ఉత్తర్వులు) జారీ చేస్తూ అన్ని దేశాలను కలవరపరుస్తున్నారు. ఈ క్రమంలో ట్రంప్ నకు మరో న్యాయస్థానం మొట్టికాయ వేసింది. వలస వచ్చిన వారికి పిల్లలు పుట్టినప్పుడు వారికి లభించే జన్మతః పౌరసత్వ హోదాను రద్దు చేస్తూ కార్యనిర్వాహక ఉత్తర్వులు జారీ చేసిన ట్రంప్ ను అడ్డుకున్న అమెరికా కోర్టులు.. తాజాగా అమెరికా అంతర్జాతీయ అభివృద్ధి సంస్థ (యూఎస్ఎయిడ్) ఉద్యోగుల విషయంలో కూడా కట్టడి చేసాయి.


వేలాది మంది యూఎస్ఎయిడ్ ఉద్యోగులను ఉద్యోగాలు మానేసి 30 రోజుల్లోపు స్వదేశానికి తిరిగి రావాలని ట్రంప్ ఇచ్చిన ఆదేశాలను వారం రోజులపాటు నిలుపుదల చేస్తున్నట్లు యూఎస్ డిస్ట్రిక్ట్ కోర్ట్ జడ్జి కార్ల్ నిఖోల్స్ శుక్రవారం రాత్రి మధ్యంతర తీర్పు జారీ చేశారు. యూఎస్ఎయిడ్ ను శాశ్వతంగా మూసేస్తానని ట్రంప్ తన సొంత సామాజిక మాధ్యమం ‘ట్రూత్ సోషల్’ లో పోస్ట్ పెట్టిన కొన్ని గంటలకే ఆయన నిర్ణయానికి వ్యతిరేకంగా తాత్కాలిక తీర్పు వెలువడటం విశేషం.

విదేశాల్లో యూఎస్ఎయిడ్ ఉద్యోగులు, వారి జీవిత భాగస్వాములు, చదువుకుంటున్న వారి పిల్లల భవిష్యత్తు అనిశ్చితంగా మారిన సమయంలో కోర్టు ఉత్తర్వులతో వారికి భారీ ఊరట లభించింది. అయితే ఈ విభాగానికి నిధులు ఆపేయాలని ట్రంప్ ఇచ్చిన ఉత్తర్వులను రద్దు చేయాలని ది అమెరికన్ ఫారెన్ సర్విస్ అసోసియేషన్, ది అమెరికన్ ఫెడరేషన్ ఆఫ్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ సంస్థలు చేసిన విజ్ఞప్తిని జడ్జి తిరస్కరించారు.


ట్రంప్ ప్రభుత్వం ఆదేశించడంతో యూఎస్ఎయిడ్ లో ఇప్పటికే 500 మంది ఉద్యోగులు సెలవులపై వెళ్లగా, మరో 2,200 మంది శనివారం నాడే సెలవుపై వెళ్లాల్సి ఉంది. యూఎస్ఎయిడ్ అనేది ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాల్లో సహాయక, అభివృద్ధి, దాతృత్వ కార్యక్రమాలు నిర్వహిస్తోంది. ప్రతి సంవత్సరం వందల కోట్ల డాలర్ల బడ్జెట్ ను కేటాయిస్తుంది. 2016 గణాంకాల ప్రకారం యూఎస్ఎయిడ్ ప్రభుత్వ విభాగంలో 10,235 మంది ఉద్యోగులు ఉన్నారు. వీరిలో మూడింట రెండు వంతుల మంది విదేశాల్లో పనిచేస్తున్నారు.

Also Read: అమెరికా ప్రెసిడెంట్‌గా మస్క్.. ప్రభుత్వ ఉద్యోగుల జీవితాలు ఆయన చేతుల్లోనే

విదేశాలకు అపరిమిత సహాయం అమెరికాకు భారంగా మారిందని, ఉద్యోగుల్లో 90 శాతం మందిని తీసేయాలని ట్రంప్ ప్రభుత్వం నిర్ణయించింది. ఇందులో భాగంగానే దశలవారీగా చాలా మందిని సెలవుల మీద స్వదేశానికి తిరిగి రావాలని ట్రంప్ ప్రభుత్వం హెచ్చరించింది. శాశ్వతంగా తిరిగి రావడం కాబట్టి ప్రయాణ ఖర్చులు కూడా ప్రభుత్వం భరిస్తుందని తెలిపారు. అయితే విధులు నిర్వర్తిస్తున్న దేశంలోనే ఈ సిబ్బంది పిల్లలు చదువుకుంటున్నారు. దీంతో వారంతా గందరగోళానికి గురయ్యారు.

ఆగని ట్రంప్.. పరిశోధనలపై వేటు!
వర్థమాన దేశాలకు ఆర్థిక సహాయాన్ని స్తంభింపజేసిన డొనాల్డ్ ట్రంప్, స్వదేశంలో పరిశోధన-అభివృద్ధి (రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ – ఆర్ అండ్ డి) కూడా ఆటంకం సృష్టిస్తారని ఆందోళన రేగుతోంది. ఆర్ అండ్ డి లో అల్పసంఖ్యాక వర్గాలు, మహిళల భాగస్వామ్యాన్ని పెంచడానికి, సమానత్వ సాధనకు అమెరికా ప్రభుత్వం ఇంతకాలం ప్రాధాన్యమిస్తూ వచ్చింది. దీన్ని డైవర్సిటీ (వైవిధ్యం), ఈక్విటీ (సమానత్వం), ఇన్క్లూజన్ (సమ్మిళిత) (డీఈఐ) విధానం అంటారు. దీనికి ఇస్తున్న రుణాలు, గ్రాంట్లను స్తంభింపజేస్తూ ట్రంప్ జనవరి 21న కార్యనిర్వాహక ఉత్తర్వు జారీ చేశారు. దీన్ని ఇద్దరు న్యాయమూర్తులు అడ్డుకోవడంతో ట్రంప్ ప్రభుత్వం ఆ ఉత్తర్వును రద్దు చేసింది. 2023లో అమెరికాలోని విశ్వవిద్యాలయాలకు ఆర్ అండ్ డి కోసం 6,000 కోట్ల డాలర్లు కేటాయించారు. ట్రంప్ విధానం తమపై ఎలాంటి ప్రభావం చూపుతుందోనని విశ్వవిద్యాలయాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. కృత్రిమ మేధస్సుపై పరిశోధనను ఇప్పటికే ఆపివేశారు.

Related News

Volodymyr Zelenskyy: మేం ఊరుకోం… శాంతి చర్చల ముందు ఉక్రెయిన్ ప్రెసిడెంట్ జెలెన్స్కీ స్ట్రాంగ్ వార్నింగ్

Donald Trump: ట్రంప్ మామూలోడు కాదు.. భార్య మరణాన్ని కూడా అలా వాడుకున్నాడు

India-US P-8I Deal: అమెరికాకు భారత్ షాక్.. 3.6 బిలియన్ల డాలర్ల డీల్ సస్పెండ్

Donald Trump: ముందుంది ముసళ్ల పండగ.. ట్రంప్ హింటిచ్చింది అందుకేనా?

Modi VS Trump: మోదీ స్కెచ్.. రష్యా, చైనా అధ్యక్షులతో కీలక భేటీ.. ట్రంప్ మామకు దబిడి దిబిడే!

China Support: భారత్ కు చైనా ఊహించని మద్దతు.. డ్రాగన్ లెక్క వేరే ఉందా?

Big Stories

×