25,900 COVID Cases Reported in Singapore: సింగపూర్ లో మరోసారి కోవిడ్ మహమ్మారి కలకలం రేపుతోంది. ఈ నెల 5 నుంచి 11 మధ్య 25, 900కు పైగా కేసులు నమోదయ్యాయని ఆ దేశ ఆరోగ్య శాఖ మంత్రి ఆంగ్ యె కుంగ్ తెలిపారు. ప్రజలంతా తప్పకుండా మాస్కులు ధరించాలని సూచించారు.
“కొత్తగా కోవిడ్ మొదలవుతోంది. క్రమంగా కోవిడ్ కేసులు కూడా పెరుగుతున్నాయి. నాలుగు వారాల్లోనే ఇవి గరిష్ట స్థాయికి చేరుకోవచ్చని ఆంగ్ యె కుంగ్ తెలిపారు. ప్రతి రోజు 250 మంది కోవిడ్ బాధితులు ఆసుపత్రుల్లో చేరుతున్నారు. పెరుగుతున్న కేసులకు అనుగుణంగా ఆసుపత్రులను సిద్దంగా ఉంచామని అధికారులు తెలిపారు. రోగులకు సరిపడా బెడ్స్ అందుబాటులో ఉంచామని వెల్లడించారు.
రోగులను ఆసుపత్రులకు తీసురాకుండా ఇంట్లోనే చికిత్స అందించే విధానాన్ని కూడా పరిశీలిస్తున్నట్లు తెలిపారు. లక్షణాలు స్వల్పంగా ఉంటే అలాంటి వారికి ఇంట్లోనే చికిత్స అందిస్తామని అన్నారు. కేసుల సంఖ్య భారీగా పెరిగితే అందుకు తగిన చర్యలపై సమీక్ష నిర్వహిస్తున్నామన్నారు. ప్రస్తుతం సింగపూర్ లో కేపీ 1, కేపీ 2, కరోనా వేరియంట్ కేసులే అధికంగా ఉన్నాయి. ఇతర వేరియంట్ల కంటే ఎక్కువగా కేపీ 1, కేపీ 2 వ్యాప్తి చెందుతున్నాయని వెల్లడించారు.
Also Read: ఆఫ్ఘనిస్థాన్ ను ముంచెత్తిన వర్షాలు, 50 మంది మృతి
ముఖ్యంగా వృద్ధులు, చిన్నారులు, వ్యాధులతో బాధ పడుతున్న వారు జాగ్రత్తగా ఉండాలని డాక్టర్లు చెబుతున్నారు. ఇతర దేశాలకు వెళ్లకుండా హోమ్ క్వారంటైన్ లో ఉండాలని సూచిస్తున్నారు. కోవిడ్ సోకిన వారు హోమ్ ఐసోలేషన్ లో ఉండాలని, సీరియస్ గా ఉంటేనే ఆసుపత్రులకు రావాలని తెలిపారు. ప్రజలెవరూ ఇళ్ల నుంచి బయటకు రావద్దని చెబుతున్నారు. అత్యవసరం అయితేనే బయటకు రావాలని మాస్కులు తప్పకుండా వాడాలని సూచిస్తున్నారు.