Heavy Rains In Afghanistan: ఆఫ్ఘనిస్థాన్ ను భారీ వర్షాలు ముంచెత్తాయి.సెంట్రల్ ఆఫ్ఘనిస్థాన్ లో భారీ వర్షాలు, వరదల కారణంగా సుమారు 50 మంది మృతి చెందారు. అనేక మంది గల్లంతైనట్లు అధికారులు ప్రకటించారు. శుక్రవారం నుంచి ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షాలకు సెంట్రల్ ఘోర్ ప్రావిన్స్ ప్రాంతంలో రోడ్లు తెగిపోయాయని అంతే కాకుండా 200కు పైగా ఇళ్లు నేలమట్టం అయ్యాయని అధికారులు వెల్లడించారు.
ఫిరోజ్ లో 200 ఇళ్లు పూర్తిగా ధ్వసం అయ్యాయి. అంతే కాకుండా 4 వేల ఇళ్లు పాక్షికంగా దెబ్బతిన్నాయి. గత వారం ఆప్ఘన్ లో కురిసిన వర్షాలకు 315 మంది చనిపోయారు. బుధవారం ఘోర్ ప్రావిన్స్ లోని నదిలో పడిపోయిన వ్యక్తుల మృతదేహాలను వెలికి తీసేందుకు ప్రయత్నిస్తుండగా వైమానిక దళం హెలికాప్టర్ సాంకేతిక లోపంతో కూలిపోగా ఒకరు మృతి చెందారు. 12 మంది తీవ్రంగా గాయపడ్డారు.
ఉత్తర ఆఫ్ఘనిస్థాన్ లో వేలాది ఇళ్లు దెబ్బతినడంతో పాటు అనేక పశువులు కూడా నీటిలో కొట్టుకుపోయాయని అక్కడి అధికారులు తెలిపారు. వరద నీరు పోటెత్తడంతో అనేక ప్రాంతాలు బురదతో నిండిపోయాయి. వరదల వల్ల నష్టపోయిన వారికి సహాయాన్ని అందించాలని ఐక్యరాజ్య సమితి, మానవతా ఏజెన్సీలు, ప్రయివేటు వ్యాపారులను ఆ దేశ ఆర్థిక మంత్రి కోరారు. భారీ వరదలతో నిరాశ్రయులైన వారిని ఆదుకోవాలని అభ్యర్థించారు.
Also Read: తాలిబన్ దేశంలో వరదలు.. ఒక్కరోజులోనే 200 మంది మృతి
ఇదిలా ఉంటే వరద బాధితులకు WFO ఆహారం, సహాయం అందించేందుకు సిద్ధమైంది. బగ్లాన్ లాంటి ప్రాంతాల్లో నివసిస్తున్న ప్రజలకు ఆహారం అందించడానికి ట్రక్కులు వెళ్లే పరిస్థితి లేదని దీంతో ప్రత్యామ్నాయ మార్గాలను మొదలు పెట్టినట్లు WFO తెలిపింది.