Heavy Rain Fall in Hyderabad and Telangana: తెలంగాణలో భారీ వర్షం కురుస్తోంది. రాష్ట్రంలోని పలు జిల్లాల్లో భారీగా వర్షం కురుస్తోంది. ఈ క్రమంలో ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం పడుతోంది. హైదరాబాద్ నగరంలో కూడా భారీగా వర్షం కురుస్తోంది. బేగంపేట, నాంపల్లి, చిలకలగూడ, సికింద్రాబాద్, సుచిత్ర, జీడిమెట్ల, కొంపల్లి, మెహిదీపట్నం, ఉప్పల్, ఎల్బీనగర్ తోపాటు పలు ప్రాంతాల్లో వర్షం కురుస్తోంది. భారీగా వర్షపు నీరు రోడ్లపైకి చేరడంతో పలు జంక్షన్ల వద్ద భారీగా ట్రాఫిక్ జామైనట్లు సమాచారం. వరద నీరు భారీగా రోడ్లపైకి చేరడంతో రోడ్లు చెరువులను తలపిస్తున్నాయి. దీంతో వాహనదారులు తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు. ట్రాఫిక్ పోలీసులు రంగంలోకి దిగి పరిస్థితిని చక్కబెడుతున్నారు.
పిడుగుపడి ముగ్గురు మృతిచెందినట్లు తెలుస్తోంది. వికారాబాద్ జిల్లా యాలాల మండల పరిధిలో ముగ్గురు పిడుగుపాటుకు గురై మృత్యువాత పడినట్లు సమాచారం. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
కాగా, తెలుగు రాష్ట్రాల ప్రజలకు వాతావరణ శాఖ ఓ చల్లని కబురు చెప్పిన విషయం తెలిసిందే. మే 22న బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడుతుందని, అది మే 24నాటికి బలపడి వాయుగుండంగా మారుతుందని, కోస్తాంధ్ర, రాయలసీమ మీదుగా శ్రీలంక వరకు సముద్ర మట్టానికి 3.1 కిలో మీటర్ల ఎత్తులో ఉపరితల ద్రోణి ఆవరించి ఉంటుందని పేర్కొన్నది. అయితే, ఉపరితల ఆవర్తనం తమిళనాడు ఉత్తర ప్రాంతం వరకు విస్తరించి ఉన్న నేపథ్యంలో తెలుగు రాష్ట్రాల్లో మే 23 వరకు ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశముందని తెలిపింది. తెలంగాణలో పలు ప్రాంతాల్లో అయితే భారీ నుంచి అతిభారీ వర్షాలు కురుస్తాయని పేర్కొన్న విషయం విధితమే.
Also Read: దేశంలో భారీ వర్షాలు.. కురుస్తాయి: IMD
ఇటు భారత వాతావరణ శాఖ-ఐఎండీ కూడా దేశ ప్రజలకు మరో చల్లని వార్తను చెప్పింది. నికోబార్ దీవుల్లోకి నైరుతి రుతుపవనాలు ప్రవేశించాయని, ఆదివారం అవి మాల్దీవులు, నికోబార్ దీవులు, దక్షిణ అండమాన్ ప్రాంతాలను తాకనున్నాయని పేర్కొన్నది. అదేవిధంగా మే 31 లోగా ఈ నైరుతి రుతుపవనాలు కేరళ తీరాన్ని తాకుతాయని భారత వాతావరణ శాఖ తెలిపింది.
కాగా, శనివారం హైదరాబాద్ లో భారీగా వర్షం కురిసింది. జీహెచ్ఎంసీ పరిధిలో దాదాపు 2 గంటలపాటు భారీ వర్షం కురిసింది. నిజాంపేట్, కండ్లకోయ, గండిమైసమ్మ, శేరిలింగంపల్లి, మియాపూర్, చందానగర్, మేడ్చల్, దుండిగల్, పెద్ద అంబర్ పేట్, నాగోల్, ఎల్బీనగర్, వనస్థలిపురం, హయత్ నగర్ తోపాటు పలు ప్రాంతాల్లో భారీగా వర్షం కురిసింది. అమీన్ పూర్, ఆర్సీపురం, పటాన్ చెరు ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురిసింది. ఇటు బోయిన్ పల్లి, మారేడుపల్లి, బేగంపేట, అల్వాల్, చిలకలగూడ, జవహర్ నగర్ తోపాటు పలు ప్రాంతాల్లో భారీగా వర్షం కురిసింది. వరద నీరు భారీగా రోడ్లపైకి వచ్చి చేరింది. నాలాలు పొంగిపొర్లాయి. లోతట్టు ప్రాంతాలన్నీ పూర్తిగా వరద నీరుతో నిండిపోయాయి. కొన్ని చోట్లా రోడ్లు చెరువులను తలపించాయి. ఆ ప్రాంతాల్లో వాహనాలు నీటిలో మునిగిపోయాయి.