Sri Lanka Elections : ఆర్థిక, రాజకీయ సంక్షోభాలతో ఇబ్బందులు పడుతున్న శ్రీలంక పార్లమెంట్ ఎన్నికల్లో అధ్యక్షుడు అనుర కుమార దిసనాయకే పార్టీ ఘన విజయం సాధించింది. మొత్తం సీట్లల్లో 4 వంతులకు 3 సీట్లు గెలుచుకుని.. క్లీన్ స్వీప్ చేసింది. ఈ మేరకు.. శ్రీలంక ఎన్నికల సంఘం వివరాలు వెలువరించింది.
ఓ సాధారణ రోజువారీ కూలీ కొడుకైన దిసనాయకే.. అక్కడి రాజకీయాల్లో చాన్నాళ్లుగా చురుగ్గా పనిచేస్తున్నాడు. శ్రీలంకలో కమ్యూనిస్ట్ నేతగా ఉన్న దిసనాయకే ఆధ్వర్యంలోని ఎన్‌పీపీ పార్లమెంటులోని మొత్తం 225 సీట్లకు గానూ 159 సీట్లు గెలుపొంది.. అధికారాాన్ని దక్కించుకుంది. కాగా.. సజిత్ ప్రేమదాస నేతృత్వంలోని ఎస్‌జేబీ కేవలం 40 సీట్లతో రెండో స్థానంలో నిలిచింది. ఇది ఈ పార్టీకి 2010 తర్వాత అత్యల్ప ఓటింగ్ కావడం విశేషం.
ఉత్తర జాఫ్నా జిల్లాలో ఎన్‌పీపీ విజయం
ఉత్తర జాఫ్నా జిల్లాలో తమిళులు ప్రభావం ఎక్కువగా ఉంటుంది. దాంతో.. ఇక్కడ సింహళ జాతీయవాదానికి మద్ధతుగా నిలిచే పార్టీలు గెలుపొందలేవు. కానీ.. సింహళ జాతీయ వాదాన్ని బలంగా వినిపించే ఎన్‌పీపీ ఇక్కడ మంచి ఫలితాల్ని రాబట్టింది. సంప్రదాయ తమిళ జాతీయవాద పార్టీలకు పట్టున్న జాఫ్నా జిల్లా మొత్తాన్ని తన ఖాతాలో వేసుకుంది. జాఫ్నా ప్రావిన్స్‌లోని మొత్తం ఆరు స్థానాల్లో ఎన్‌పీపీ మూడింటిని గెలుచుకుని రాజకీయ ప్రత్యర్థుల్ని ఆశ్చర్యపరిచింది.
సింహళ మెజారిటీ పార్టీలు ఇంతకు ముందు జాఫ్నాలో విజయం సాధించలేదు. యునైటెడ్ నేషనల్ పార్టీ (UNP) గతంలో జాఫ్నాలో సీట్ల ఎక్కువగా గెలుచుకునేంది. అలాంటిది.. ఈసారి ఎన్నికల్లో ఎన్‌పీపీ (NPP) జాఫ్నా జిల్లాలో 80,000 ఓట్లను గెలుచుకోగా, గ్రాండ్ ఓల్డ్ తమిళ్ పార్టీ 63,000 ఓట్ల సాధించి.. వెనుకబడింది.
తన పార్టీ అన్ని వర్గాలకు నిజమైన జాతీయ పార్టీ అంటూ ఎన్నికకు ముందు అధ్యక్షుడు దిసనాయకే ప్రకటించారు. ఎన్నికల్లో గెలుపొందేందుకు.. ఒక వర్గాన్ని విభజించడం, మరొక వర్గానికి వ్యతిరేకంగా పనిచేయడం సరైంది కాదన్న అధ్యక్షుడు దిసనాయకే.. ఆ యుగం ముగిసిందని ప్రకటించారు. ఆ ప్రభావం ప్రస్తుత ఎన్నికల్లో కనిపిస్తోందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.
చాన్నేళ్లుగా తీవ్ర ఆర్థిక, రాజకీయ సంక్షోభంతో కొట్టుమిట్టాడుతున్న శ్రీలంకకు దిసనాయకే మార్గనిర్దేశం అవసరమైంది. దాంతో.. తాను పూర్తిగా పెట్టుబడి దారులకు వ్యతిరేకంగా కాదని, దేశ ప్రయోజనాల మేరకు పెట్టుబడిదారులకు రక్షణా ఉంటానంటూ ప్రకటించారు. దాంతో.. ప్రజలతో పాటు పారిశ్రామిక వర్గాల్లో కూడా దిసనాయకేకు మంచి మద్ధతు లభించింది. పాత కాలం కమ్యునిస్ట్ సిద్ధాంతాల మాదిరి పూర్తిగా పెట్టుబడిదారుల్ని.. నేరస్తులుగా చూడకుండా పరిమితుల్లో ప్రోత్సహిస్తానంటూ చెప్పడం ద్వారా ఉపాధి కల్పన, కొత్త పరిశ్రమల ఏర్పాటుకు అనుకూలంగా ఉంటారనే అభిప్రాయం అందరిలో ఏర్పడింది.
Also Read : ప్రధాని మోదీ విమానంలో సాంకేతిక సమస్య.. రాహుల్ గాంధీకి ఇబ్బందులు
దిసనాయకే వ్యక్తిత్వం, పార్టీపై ప్రజల్లో ఉన్న అపోహల్ని దూరం చేయడంతో.. ఈ ఎన్నికల్లో ఎన్‌పీపీ (NPP) 68 లక్షల ఓట్లను గెలుచుకుంది. అంటే.. అక్కడి ఓటర్లల్లో 61% ఓట్లను పొందింది. స్వాతంత్య్రం సాధించిన తర్వాత ఏర్పడిన తీవ్రమైన ఆర్థిక సంక్షోభ సమయంలో అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన దిసనాయకే కు ఈ ఎన్నికల్లో గెలుపు మంచి సంకేతమని, అతని పాలనపై ప్రజలు ఆశలు పెట్టుకున్నారని అంటున్నారు.