Donald Trump: అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సుంకాల పెంపు విధింపు విషయంలో తగ్గేదేలే అన్నట్లు వ్యవహరిస్తున్నారు. ఈ క్రమంలో కెనడా, మెక్సికోలపై నేటి (మంగళవారం) నుంచి 25 శాతం సుంకం విధించనున్నట్లు తెలిపారు. ఈ విషయంలో అసలు జాప్యానికి అవకాశం లేదని ట్రంప్ అన్నారు. ట్రంప్ ఈ ప్రకటన తర్వాత ఉత్తర అమెరికాలో మళ్లీ వాణిజ్య యుద్ధం భయాందోళన పెరిగింది.
రూజ్‌వెల్ట్ గదిలో మాట్లాడిన ట్రంప్ ఈ సుంకాల విధింపు గురించి కీలక వ్యాఖ్యలు చేశారు. అమెరికా పొరుగు దేశాలు రెండూ అక్రమ రవాణాకు వ్యతిరేకంగా పోరాటాన్ని ముమ్మరం చేసేందుకు, అక్రమ వలసలను అరికట్టడానికి బలవంతం చేయడమేనని పేర్కొన్నారు. అయితే ఈ రెండు దేశాల మధ్య వాణిజ్య అసమతుల్యతను సమతుల్యం చేయాలని, మరిన్ని కర్మాగారాలు అమెరికాకు తరలిరావడాన్ని ప్రోత్సహించాలని ట్రంప్ కూడా సూచించారు. ఈ క్రమంలో కెనడా, మెక్సికోలపై నేటి నుంచి 25 శాతం సుంకాలు విధించడం ప్రారంభమవుతుందని ట్రంప్ అన్నారు.
ట్రంప్ సుంకాల ప్రకటన అమెరికా స్టాక్ మార్కెట్‌పై ప్రభావం చూపించింది. దీంతో ట్రేడింగ్‌లో ఎస్&పీ 500 ఇండెక్స్ 2 శాతం పడిపోయింది. ఈ క్రమంలో మెక్సికో, కెనడాతో దశాబ్దాల నాటి వాణిజ్య భాగస్వామ్యానికి ముగింపు పలికే అవకాశం ఉంది. దీంతోపాటు ట్రంప్ తీసుకోవాల్సిన రాజకీయ, ఆర్థిక నిర్ణయాలపై కూడా ఇది ప్రభావం చూపిస్తుందని నిపుణులు చెబుతున్నారు.
Read Also: Shahzadi Khan: పని చేయని తల్లిదండ్రుల విజ్ఞప్తి.. యూఏఈలో భారత మహిళకు ఉరిశిక్ష
అయినప్పటికీ అమెరికన్ తయారీ రంగాన్ని ప్రోత్సహించడానికి, విదేశీ పెట్టుబడులను ఆకర్షించడానికి సుంకాలు మంచి ఎంపిక అని ట్రంప్ ప్రభుత్వం భావిస్తోంది. ఈ క్రమంలోనే కంప్యూటర్ చిప్ తయారీ సంస్థ TSMC అమెరికాలో తన పెట్టుబడులను విస్తరించిందని వాణిజ్య కార్యదర్శి హోవార్డ్ లుట్నిక్ తెలిపారు. ఎందుకంటే అమెరికాలో ఇన్వెస్ట్ వస్తే 25 శాతం ప్రత్యేక సుంకం విధించే ఛాన్స్ నుంచి తప్పించుకుంటారని వెల్లడించారు.
అయితే ఫిబ్రవరిలో ట్రంప్ చైనా నుంచి దిగుమతులపై 10 శాతం సుంకం విధించారు. ఈ రేటు నేడు రెట్టింపు అయి 20 శాతానికి చేరుకుంటుందని సోమవారం ఆయన మళ్ళీ ప్రస్తావించారు. మెక్సికో, కెనడా రెండూ రాయితీలు ఇస్తామని హామీ ఇచ్చిన తర్వాత ట్రంప్ ఫిబ్రవరిలో ఒక నెల పొడిగింపు మంజూరు చేశారు. కానీ సోమవారం ట్రంప్ మాట్లాడుతూ, కొత్త సుంకాల విషయంలో మెక్సికో లేదా కెనడా తప్పించుకోవడానికి అవకాశం లేదన్నారు. ఇందులో చమురు, విద్యుత్ సహా కెనడియన్ ఇంధన ఉత్పత్తులపై 10 శాతం తక్కువ రేటుతో పన్నులు ఉంటాయన్నారు.
మరోవైపు ట్రంప్ సుంకాలు విధిస్తుంటే, మేము కూడా సిద్ధంగా ఉన్నామని కెనడా విదేశాంగ మంత్రి మెలానీ జోలీ అన్నారు. మేము $155 బిలియన్ల విలువైన సుంకాలతో సిద్ధంగా ఉన్నామని స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో కెనడా వద్ద బలమైన ప్రణాళిక ఉందని జోలీ అన్నారు. గత వారం ట్రంప్ పరిపాలన అధికారులకు కూడా దాని గురించి వివరించారు. దౌత్య ప్రయత్నాలు కొనసాగుతున్నాయని ఆయన అన్నారు.