Donald Trump: ట్రంప్.. భారత్‌పై అక్కసు వెళ్లగక్కుతున్నాడా అంటే.. తాజాగా పెంచిన అదనపు సుంకాలను చూస్తే అవును అనే సమాధానం వినిపిస్తుంది. అమెరికా ఇప్పటికే భారత్‌పై 25శాతం సుంకాలు ప్రకటించగా.. ఇప్పుడు మరో 25శాతం పెంచినట్లు ట్రంప్ ప్రకటించారు. భారత్‌పై 50శాతం టారిఫ్ విధిస్తూ ఉత్తర్వులపై సంతకం చేశారు. దీంతో భారత్ దిగుమతులపై 50 శాతం సుంకాలు కట్టాల్సి ఉంటుంది. రష్యా నుంచి చమురు కొనుగోలు చేయొద్దని చేసిన హెచ్చరికలను భారత్ పట్టించుకోలేదని, పరోక్షంగా ఉక్రెయిన్ యుద్ధానికి మద్దతు తెలుపుతోందని అమెరికా ఆరోపణ. దాని కారణంగా ట్రంప్ సుంకాల బాంబు పేల్చాడని అమెరికా చెప్తుంది.
అయితే, భారత్‌పై టారిఫ్ వార్ ప్రకటించడానికి కారణమా అంటే.. కాదని చెప్పొచ్చు. ఎందుకంటే.. ఒక్క ఇండియానే కాకుండా కొన్ని యూరప్ దేశాలు కూడా రష్యా నుంచి చమురు కొనుగోలు చేస్తున్నాయి. ఇక్కడ ఆలోచించాల్సి విషయం ఏంటంటే.. వాటిపై అమెరికా జీరో ట్యాక్స్ విధిస్తుంది. చైనా, టర్కీలపై కూడా అమెరికా ఎలాంటి అదనపు భారాన్ని మోపడం లేదు. ఆ దేశాలతో అమెరికా బిజినెస్ డీల్స్ బాగానే ఉన్నాయి. కానీ, భారత్‌నే ఎందుకు టార్గెట్ చేసి, సుంకాలు పెంచారో తెలియని పరిస్థితి ఉంది. దీనివల్ల జరిగే పరిణామాలు అమెరికా అధ్యక్షుడు ఊహించలేదా.. బలమైన మిత్ర దేశంతో శతృత్వాన్ని ట్రంప్ ఎందుకు కోరి కొనితెచ్చుకుంటున్నాడు అనేది నిపుణుల వాదన. ముఖ్యంగా వైద్య రంగానికి సంబంధించి భారత్‌పై అమెరికా ఆధారపడి ఉంది. మరి భారత్ దీనికి దీటైన జవాబు ఎలా ఇస్తుందో చూడాలి.
25 శాతం సుంకాలు ఇవాళ్టి నుంచే అమలు కానున్నాయి. ఈ అదనపు సుంకాల భారం మాత్రం ఈ నెల 27 నుంచి పడనుంది. అయితే ఈ టారిఫ్‌ల వల్ల అమెరికాలో భారత వస్తువులు ఖరీదుగా మారతాయి. దీంతో వాటిని కొనుగోళ్లు తగ్గే అవకాశం ఉంది. ఇక కొనుగోళ్లు తగ్గితే ఆటోమెటిక్‌గా దాని ప్రభావం ఎక్స్‌పోర్ట్స్‌పై పడుతుంది. ఎగుమతులు కూడా 40 నుంచి 50శాతం తగ్గే చాన్స్ ఉంటుంది. భారత వ్యాపారాలు దెబ్బ తింటాయి. రూపాయి విలువ క్షీణించే అవకాశం ఉంది.
ట్రంప్ విధించిన 50 శాతం సుంకాలతో భారత టెక్స్‌టైల్ ఇడస్ట్రీ, ఆక్వా రంగం, తోలు ఉత్పత్తులపై వెంటనే ప్రభావం పడనుంది. భారత్ నుంచి ఎగుమతయ్యే అతి కొద్ది వస్తువులకే ఈ అధిక సుంకాల నుంచి మినహాయింపు ఉంది. కొత్తగా విధించిన 25 శాతం సుంకం.. ఇప్పటికే ఉన్న డ్యూటీలు, పన్నులు, ఫీజులు, ఛార్జీలకు అదనమని చెప్తున్నారు. కొత్త సుంకాలను కలుపుకొంటే.. అత్యధిక సుంకాల బాధిత దేశమైన బ్రెజిల్ సరసన భారత్ చేరనుంది. సుంకాల వల్ల భారత్ చేసే 86 బిలియన్ డాలర్ల ఎగుమతులపై ప్రభావం పడనుంది. ఇప్పుడు దీనికి భారత్ కౌంటర్ ఇస్తుందా?.. లేక టారిఫ్ భారాన్ని మోస్తుందా అనేది ఆసక్తిగా మారింది.
Also Read: అనిల్ దెబ్బకు వేమిరెడ్డి వెనక్కి తగ్గాడా?
2024-25లో భారత్ అమెరికా మధ్య ట్రేడ్ డీల్.. 131 బిలియన్ డాలర్లు ఉంది. అందులో 86.5 బిలియన్ డాలర్లు ఎక్స్‌పోర్ట్‌పై, 45.3 బిలియన్ డాలర్లు ఇంపోర్ట్స్‌పై ఉంటుంది. అదనపు టారిఫ్ తర్వాత.. అమెరికాకు సేంద్రీయ రసాయనాల ఎగుమతులపై అదనంగా 54 శాతం సుంకం విధించనుంది. ఆటో విడిభాగాలు, వస్త్రాలు, ఎలక్ట్రానిక్స్ వంటి ఉత్పత్తులలో భారత ఎగుమతులకు చాలా ఎక్కువ ఖర్చు అవుతుంది. ఉక్కు, రసాయన ఔషధ పరిశ్రమలపై ప్రభావం పడుతుంది. జెమ్స్, ఆభరణాలు, చెప్పులు, జంతు సంబంధ ఉత్పత్తులు, విద్యుత్తు పరికరాలు, యంత్ర సామగ్రిపైనా ఈ భారం పడనుంది.