Longest working hours: ప్రపంచంతో పాటు పరిగెట్టాలంటే వ్యక్తిగత జీవితాన్ని పక్కనపెట్టి వృత్తిగత జీవితంలో దూసుకెళ్లాలి. ఎంతసేపు పనిచేస్తే అంత జీతాన్ని, అంత విజయాన్ని అందుకోవచ్చు. అందుకే ఎంతోమంది వ్యక్తిగత జీవితాన్ని పక్కన పెట్టి మరీ అత్యధిక గంటలు పనిచేసేందుకు ఉద్యోగులు సిద్ధమయ్యారు. అలా చేయడం వల్ల వారి మానసిక, శారీరక ఆరోగ్యం ఎంతో క్షీణిస్తుంది. ముఖ్యంగా కుటుంబంతో గడిపే సమయం తగ్గిపోతుంది. చిరాకు, అసహనం ఎక్కువైపోతాయి. కాబట్టి వ్యక్తిగత జీవితాన్ని కాపాడుకోవాలనుకుంటే రోజులో తొమ్మిది గంటలకు మించి పని చేయకూడదు. మీ జీవితంలో మీకు కొన్ని దేశాలకు వెళ్లే అవకాశం వచ్చినా కూడా వెళ్లకపోవడమే మంచిది. ఎందుకంటే కొన్ని దేశాల్లో పని గంటలు ఎక్కువగా ఉన్నాయి. ఆ దేశాలేంటో తెలుసుకోండి. ఇక్కడ మేము అత్యధిక పని గంటలు ఉన్న దేశాల జాబితా ఇచ్చాము. ఆన్ సైట్ అవకాశాలు వచ్చినా కూడా ఈ దేశాలకు వెళ్లకపోవడమే మంచిది.
ఆర్థికంగా విజయం సాధించడం కోసం, పోటీ తత్వం వల్ల, వృద్ధి త్వరగా సాధించడం కోసం కొన్ని దేశాలు తమ ఉద్యోగులను వారానికి 50 గంటలకు పైగా పనిచేయిస్తున్నాయి. దీనివల్ల ఉద్యోగుల వ్యక్తిగత జీవితంతో పాటు ఆరోగ్యం కూడా ఎంతో పాడవుతుంది.
యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్
దుబాయ్ వెళ్తే ఎంతో సంపాదించుకోవచ్చు అని చాలామంది నమ్మకం. ఇక్కడ చమురు, ఫైనాన్స్, నిర్మాణ రంగాలు దూసుకెళ్తున్నాయి. అందుకే ఎంతోమంది ఉద్యోగులు దుబాయ్ వెళ్లేందుకు ఇష్టపడుతున్నారు. అయితే ఇక్కడ వారానికి 52 గంటలకు పైగా పని చేయాలి. అలా చేయడం ఆరోగ్యానికి ఏమాత్రం మంచిది కాదు. వారానికి ఐదు రోజులు పాటు పని చేయాలి. దుబాయిలో ఆ ఐదు రోజులు పాటు రోజుకు 10 గంటలకు పైగా పని చేయాల్సి వస్తుంది. ఇది ఎక్కువ గంటలతోనే సమానం.
Also Read: నైజీరియాలో బోటు ప్రమాదం..64 మంది మృతి
మలేషియా
మ్యానుఫ్యాక్చరింగ్, వ్యవసాయం వంటివి మలేషియాలో ఎక్కువ. ఇక్కడ ఆరోగ్యకరమైన పని వాతావరణం ఉండదు. వారానికి 52 గంటలకు పైగా పని చేయాలి. ఐదు రోజులపాటు పది గంటలకు పైగా ఆఫీసులోనే ఉండి పనిచేయాల్సి వస్తుంది.
సింగపూర్
అత్యంత అభివృద్ధి చెందిన ఆర్థిక వ్యవస్థ కలిగి ఉన్న దేశం సింగపూర్. ఇది విభిన్న రంగాలలో రాణిస్తోంది. ఇక్కడ కూడా వారంలో రెండు రోజులు వీకెండ్ తీసేస్తే మిగతా ఐదు రోజుల్లో ఒక్కోరోజు 10 గంటల పాటు ఆఫీసులోనే ఉండి పనిచేయాల్సిన పరిస్థితి.
హాంగ్ కాంగ్
ప్రముఖ వాణిజ్య ఆర్థిక కేంద్రంగా పేరుగాంచింది హాంకాంగ్. ఇక్కడ జీవన వ్యయం కూడా ఎక్కువే. నిత్యం ప్రజలు ఒత్తిడిలో ఉండేలా చేస్తుంది ఈ నగరం. ఇక్కడ కూడా ఐదు రోజుల్లో 51 గంటలకు పైగా పనిచేయాల్సి వస్తుంది. అంటే రోజుకి 10 గంటల పాటు పనిచేయాల్సిందే.
తైవాన్
తైవాన్ లో శ్రామిక శక్తి చాలా ఎక్కువ. ఇక్కడ కార్మికులు సుదీర్ఘ పని గంటల వల్ల ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేస్తున్నారు. ఈ దేశంలో కూడా వారంలో ఐదు రోజులు పని చేయాలి. ఆ ఐదు రోజుల్లో కూడా రోజుకి 10 గంటల పాటు పనిచేస్తేనే ఉద్యోగం నిలబడుతుంది.
మనిషికి, మనసుకు సుఖం, ప్రశాంతత లేకుండా నిత్యం రోబోల్లా పనిచేస్తుండడం వల్ల ఎక్కువ కాలం ఆరోగ్యంగా జీవించలేరు. కాబట్టి వ్యక్తిగత జీవితానికి, ఆరోగ్యానికి ముందు ప్రాధాన్యత ఇవ్వండి.