Jimmy Carter: అమెరికా మాజీ 39వ అధ్యక్షుడు.. నోబెల్ శాంతి గ్రహీత జమ్మీ కార్టర్.. 100 సంవత్సరాల వయసులో కన్నుమూశారు. అనారోగ్య కారణాలతో జార్జీయాలోని తన స్వగ్రహంలో సోమవారం తెల్లవారుజామున.. మరణించినట్లు ఆయన కుమారుడు జేమ్స్ ఇ. కార్టర్ పేర్కొన్నారు. జమ్మీ కార్టర్ మృతి పట్ల జో బైడెన్, బరక్ ఒబామా, ట్రంప్ సహా పలువురు ప్రముఖులు నివాళులు అర్పించారు. జమ్మీ కార్టర్ అసాధారణ నాయకుడు, రాజనీతిజ్ఞుడు మానవతావాది అని.. శాంతి స్థాపన, పౌర, మానవ హక్కుల అభివృద్ధి, ఇంధన విధానం, తదితర అంశాల్లో తనదైన ముద్ర వేశారని జో బైడెన్ తెలిపారు. జమ్మీ కార్టర్ 1924 అక్టోబర్1న జన్మించారు. ఈ ఏడాది తన 100వ పుట్టిన రోజును ఘనంగా జరుపుకున్నారు.
1946లో యుఎస్ నావెల్ అకాడమీ నుంచి పట్టభద్రుడైన జమ్మీ కార్టర్.. జలాంతర్గామి కార్యకలాపాలలో నైపుణ్యం కలిగిన నౌకాదల అధికారిగా ఉన్నారు. 1963 లో జార్జియా రాష్ట్ర సేనేటరుగా ప్రజా జీవితంలోకి ప్రవేశించారు. ఆ తర్వాత 1971 నుంచి 75 వరకు గవర్నర్‌గా పనిచేసి.. 1977 నుంచి 1981 వరకు అమెరికా 39వ అధ్యక్షుడిగా పనిచేశారు.
కార్టర్ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు అనేక సమస్యలు ఎదుర్కొన్నారు. అందులో ఆర్ధిక మాంద్యం, ఇరాన్ బందీ సంక్షోభం మరికొన్ని ఉన్నాయి. 1978లో ఇజ్రాయెల్, ఈజిప్టు మధ్య శాంతి ఒప్పందం, క్యాంప్ డేవిడ్ ఒప్పందాల మధ్యవర్తిత్వం వహించడంలో కీలక పాత్ర పోషించారు. జమ్మీ కార్టర్ అంతర్జాతీయ సంఘర్షణలకు శాంతియుత పరిష్కారాలను కనుగొనడానికి.. ఆర్థిక సామాజిక అభివృద్ధి ప్రోత్సహించడానికి, దశాబ్దాలుగా చేసిన నిరంతర కృషికి 2002లో నోబుల్ శాంతి బహుమతి అందుకున్నారు.
Also Read: ప్రమాణికుల విమానాన్ని ఆ దేశమే కూల్చేసింది.. సంచలన ప్రకటన చేసిన అజర్ బైజాన్ అధ్యక్షుడు..
జమ్మీ కార్టర్ గత కొన్నేళ్లుగా క్యాన్సర్ మహమ్మారితో పోరాడుతున్నారు. ఆయనకు 2023లో చర్మ క్యాన్సర్ అయిన మెలనోమియా వచ్చింది. ఈ వ్యాధి కారణంగా మెదడు, కాలేయం దెబ్బతిన్నాయి. కార్టర్ భార్య రోసలిన్ 96 ఏళ్ళ వయసులో మరణించారు. ప్రపంచానికి పెద్దన్నలాంటి యూఎస్ఏకి అధ్యక్షుడిగా సేవలు అందించి, 100 ఏళ్లు బతికిన మొదటి వ్యక్తిగాను నిలిచారు. అధికార అంత్యక్రియలకు ఏర్పాట్లు జరుగుతున్నట్లు వైట్‌హౌస్ వెల్లడించింది. కార్టర్ 1978లో భారత్ పర్యటనకు వచ్చారు.