Flipkart OTT:కరోనా వచ్చిన తర్వాత ఓటీటీ లకు ప్రేక్షక ఆదరణ భారీగా పెరిగిపోయింది. ఈ మధ్యకాలంలో థియేటర్లలో విడుదలైన ఎంత పెద్ద సినిమా అయినా సరే 8 వారాలకు ఓటీటీ లోకి వచ్చేసి డిజిటల్ స్ట్రీమింగ్ తో ఇటు బుల్లితెర ఆడియన్స్ కి కూడా దగ్గరవుతున్నాయి. అందుకే థియేటర్ కు వెళ్లలేని చాలామంది ఇంట్లో కూర్చుని కుటుంబ సభ్యులతో కలిసి ఈ ఓటీటీ లలో తమకు నచ్చిన సినిమాను చూస్తూ చిల్ అవుతున్నారు. అయితే ఇప్పుడు తాజాగా మరో సరికొత్త ఓటీటీ ప్లాట్ఫామ్ ప్రేక్షకుల ముందుకు రీ లాంఛ్ కాబోతోంది అని తెలిసి మిగతా ఓటీటీ దిగ్గజాలు సైతం భయపడుతున్నాయని సమాచారం. మరి అసలు ఏమైందో ఇప్పుడు చూద్దాం.
ముందుకు వెళ్లాలంటే సాహసం తప్పదు..
ఓటీటీ వ్యాపారం అనేది సవాళ్లతో కూడుకున్నది. ముఖ్యంగా కార్పొరేట్ దిగ్గజాలు ఒరిజినల్ వీడియో కంటెంట్ ను రూపొందించడం కోసం వందల కోట్లు వెచ్చించాల్సి ఉంటుంది. అయితే ఆ డబ్బు తిరిగి వస్తుందా? లేదా? అని ఆలోచిస్తే మాత్రం ముందుకు వెళ్లడం సాధ్యపడదు. ఇదే విషయంపై ప్రముఖ వ్యాపార దిగ్గజాలు, స్టూడియోల యజమానులు గతంలో విశ్లేషించారు కూడా.. ఇక నెట్ ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్ వీడియోస్ భారీ పెట్టుబడులతో సాహసం చేయడం వల్ల నేడు అవి ప్రథమ స్థానంలో ఉన్నాయని చెబుతున్నారు.
ఓటీటీలపై పెరుగుతున్న పరిమితులు, నిబంధనలు..
ఇదిలా ఉండగా మరొకవైపు ఆహా తెలుగు ఓటీటీ ని అభివృద్ధి చేయడం కోసం అగ్ర నిర్మాత , బిజినెస్ మాన్ అయిన అల్లు అరవింద్(Allu Aravindh) కోట్లాది రూపాయలను పెట్టుబడిగా పెట్టారు. ఇలా చాలా ప్రాంతీయ ఓటీటీలు బరిలోకి వచ్చాయి కానీ అన్నీ సక్సెస్ కాలేదు. ఇక ఇటీవల సెన్సార్ షిప్ లేని అడల్ట్ కంటెంట్ ని ప్రసారం చేస్తున్న 18 ఓటీటీలను కూడా కేంద్ర సమాచార ప్రసారాల శాఖ బ్యాన్ కూడా చేసింది. ఓటీటీ లపై పరిమితులు, నిబంధనలు పెరుగుతున్న నేపథ్యంలో వాటి నిర్వహణ మనుగడపై కూడా చాలా సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఇలాంటి సమయంలో 2019లో ప్రారంభమై కేవలం రెండేళ్లకే మూతపడ్డ ‘ఫ్లిప్ కార్ట్ వీడియో’ ఓటీటీ రంగంలో పోటీ నుంచి వైదలగడం పై ఎంతో చర్చ సాగింది.
రీ లాంఛ్ కి సిద్ధం అవుతున్న ఫ్లిప్ కార్ట్ వీడియో..
అయితే ఇప్పుడు తాజాగా మళ్లీ ఫ్లిప్ కార్ట్ వీడియో రీ లాంఛ్ కానుంది అని సమాచారం. టాలీవుడ్ నిర్మాత సాహు గారపాటి ఇటీవల ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ..” 2025లో ఫ్లిప్ కార్ట్ ఓటీటీ గేమ్ లోకి తిరిగి రావాలని ప్లాన్ చేస్తోంది” అంటూ తెలిపారు. ఫ్లిప్ కార్ట్ వీడియో అనేది వాల్ మార్ట్ యాజమాన్యం లోని ఫ్లిప్ కార్ట్ (ఆన్లైన్ గూడ్స్ డెలివరీ సంస్థ) నిర్వహించే ఓటీటీ వీడియో స్ట్రీమింగ్ ఫ్లాట్ ఫారం 2019లో ప్రారంభించారు. అదే ఏడాది అక్టోబర్లో మొదటి ఒరిజినల్ సిరీస్ ‘బ్యాక్ బెంచెర్స్’ ను ఫ్లిప్ కార్ట్ ప్రకటించింది.. ఇది బాలీవుడ్ దర్శకనిర్మాత ఫరాకాన్(Farah khan)హోస్ట్ చేసిన క్విజ్ షో కావడం గమనార్హం. ఇందులో బాలీవుడ్ ప్రముఖులు విద్యార్థులుగా పాల్గొన్నారు. ఇక బాలీవుడ్ ప్రముఖులైన శిల్పా శెట్టి, పరిణితి చోప్రా, అనిల్ కపూర్, అనన్య పాండే, జాన్వి కపూర్, మలైకా అరోరా తదితరులు పాల్గొన్నారు. అప్పుడు కొన్ని కారణాల వల్ల మూతపడిన ఈ ఫ్లిప్కార్ట్ వీడియో మళ్లీ వినోదరంగంపై దృష్టి పెట్టి త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. మరి ఇది ఓటీటీ రంగంలో సవాళ్లను ఎదుర్కొని వీక్షకులను ఆకర్షించడానికి పగడ్బందీగా రాబోతోంది. ఇక దీని దెబ్బకు మిగతా ఓటీటీ లు ఏమైపోతాయో అనే అనుమానాలు కూడా వ్యక్తం చేస్తున్నారు నెటిజన్స్.