ఎలన్ మస్క్, డొనాల్డ్ ట్రంప్.. కొన్నిరోజులు విపరీతంగా ప్రేమించుకుంటారు, మరికొన్నాళ్లు విపరీతంగా ద్వేషించుకుంటారు. ఒకరిపై ఒకరు పగ తీర్చుకుంటారేమో అని అనుకునేంతలోనే కౌగిలించుకుని కబుర్లు చెప్పుకుంటారు. వీరిద్దర్నీ అర్థం చేసుకోవడం చాలా కష్టం. ఇద్దరూ ఇద్దరే. ఇద్దర్నీ మూర్ఖుల కింద జమకట్టలేం, ఎందుకంటే తమ తమ కెరీర్లలో అత్యుత్తమ దశలో ఉన్నారిద్దరూ. అలాగని ఇద్దర్నీ పరిపూర్ణ మేథావులని కూడా అనుకోలేం. ఎందుకంటే ఎప్పుడు ఎలాంటి సంచలన నిర్ణయాలు తీసుకుంటారో వారికే తెలియదు. అలాంటి ట్రంప్, మస్క్ మళ్లీ గొడవపడ్డారు. ఈసారి మస్క్ వ్యాఖ్యలకు ట్రంప్ మరింత ఘాటుగా బదులిచ్చారు. తనకు తిక్కరేగితే మస్క్ దుకాణం సర్దుకోవాల్సిందేనన్నాడు. అమెరికానుంచి తట్టాబుట్టా సర్దుకుని దక్షిణాఫ్రికాకు పారిపోతావంటూ మస్క్ ని హెచ్చరించాడు ట్రంప్.
సారీ చెప్పిన కొన్నిరోజులకే..
ఆమధ్య వన్ బిగ్ బ్యూటిఫుల్ బిల్ విషయంలో ఇద్దరికీ గొడవ మొదలైన సంగతి తెలిసిందే. ఒకరినొకరు అంతుచూసుకుంటామని బెదిరించుకున్నారు. ఆ తర్వాత మస్క్ తాను సొంత రాజకీయ పార్టీ పెడతానని కూడా హెచ్చరించాడు. అంతలోనే ఏమైందో ఏమో ఆ ప్రకటన పక్కనపెట్టి, తాను చేసిన పనికి పశ్చాత్తాప పడుతున్నట్టు ప్రకటించాడు. తన సోషల్ మీడియా పోస్ట్ లు చాలా దూరం వెళ్లాయంటూ, ట్రంప్ పై చేసిన వ్యాఖ్యల్ని వెనక్కి తీసుకుంటున్నట్టు చెప్పారు మస్క్. అక్కడితో ఆ గొడవ అయిపోయిందనుకుంటే పొరపాటే.. మళ్లీ కొత్తగా వివాదం మొదలైంది. ఈసారి కూడా అదే బిల్లు, ఆ బిల్లు విషయంలోనే మస్క్ తమాయించుకోలేకపోతున్నారు. ఆ బిల్లుకి సెనెట్ ఆమోదం తెలపడంతో మరోసారి మస్క్ వరుస ట్వీట్లతో విరుచుకుపడ్డాడు.
తరిమేస్తా జాగ్రత్త..
ఈసారి ట్రంప్ మరింత రెచ్చిపోయారు. మస్క్ కి ఓ రేంజ్ లో వార్నింగ్ ఇచ్చారాయన. ‘‘మానవ చరిత్రలో ఎవరూ పొందనంత రాయితీలను ఎలాన్ మస్క్ తీసుకొంటున్నారు’’ అని అన్నారు. ఒకవేళ ఆ రాయితీలే ఇవ్వకపోతే.. అతడు తన దుకాణం మూసుకొని వెళ్లాల్సిందేనని చెప్పారు. కొన్నాళ్ల క్రితం అమెరికా అధ్యక్షుడిగా తనకు మస్క్ బలమైన మద్దతు ఇచ్చారని గుర్తు చేశారు ట్రంప్. అయితే అప్పటికే విద్యుత్తు వాహనాల విషయంలో తన నిర్ణయాలు వేరేగా ఉన్నాయని చెప్పారు. విద్యుత్ వాహనాల వినియోగాన్ని తాను తప్పుబట్టను కానీ, వాటినే వినియోగించాలని ఒత్తిడి చేయడం సరికాదన్నారు ట్రంప్. ఆ పని మస్క్ చేస్తున్నారని మండిపడ్డారు. అంతే కాదు, మస్క్ కి చెందిన స్పేస్ ఎక్స్ ప్రయోగాలపై కూడా తీవ్ర విమర్శలు చేశారు ట్రంప్. మస్క్ చేపట్టే రాకెట్, ఉపగ్రహ ప్రయోగాలు, ఎలక్ట్రిక్ కార్ల ఉత్పత్తులు ఇక ఉండకపోవచ్చని హెచ్చరించారు. అవే జరక్కపోతే అమెరికా మరింత సొమ్మును ఆదా చేసుకొంటుందన్నారు.
మొత్తమ్మీద మరోసారి ఇద్దరి మధ్య మాటల యుద్ధం ముదిరింది. ఒకసారి మస్క్ సారీ చెప్పారు, సర్దుకుపోయారు. ఈసారి మాత్రం ఆయన తగ్గేది లేదంటున్నారు. అటు ట్రంప్ కూడా మస్క్ వ్యాపారాలపై దెబ్బకొడతానంటున్నారు. దీనికి మస్క్ రియాక్షన్ ఎలా ఉంటుందో చూడాలి. వీరిద్దరి మధ్య గొడవ జరిగినప్పుడల్లా మస్క్ కి చెందిన వ్యాపారాల షేర్లు పతనం అవుతున్నాయి. అది చాలామందిపై తీవ్ర ప్రభావం చూపిస్తోంది. ఈసారి ఏమవుతుందో ఏంటో అని చాలామంది ఆసక్తిగా చూస్తున్నారు.