GreenLand Usha Vance Visit| అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ భార్య ఉషా వాన్స్ గ్రీన్ లాండ్ లో పర్యటించనున్నారు. అయితే ఆమె పర్యటన గురించి ప్రకటన రాగానే గ్రీన్ లాండ్ నుంచి తీవ్ర వ్యతిరేకత ఎదురైంది. దీంతో ఇప్పుడు అమెరికా, గ్రీన్ లాండ్ మధ్య కొత్త వివాదం మొదలైంది.
పర్యటనపై నిషేధం:
అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ భార్య ఉషా వాన్స్ గ్రీన్ లాండ్ పర్యటన ప్రకటించిన కొద్దీ రోజుల్లోనే తీవ్ర వ్యతిరేకత ఎదురైంది. రెండు రోజుల పాటు నిర్వహించాలనుకున్న ఈ పర్యటనను గ్రీన్ లాండ్ తాత్కాలిక ప్రభుత్వం నిషేధించింది. ఈ ద్వీపంపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేస్తున్న వ్యాఖ్యలే ఈ పరిస్థితికి కారణమయ్యాయి. గత కొంత కాలంగా అమెరికా అధ్యక్షుడు ట్రంప్ గ్రీన్ లాండ్ లో భారీగా ఖనిజ సంపద ఉందని.. దాంతో పాటు గ్రీన్ లాండ్ తమ ఆధీనంలో ఉంటే ఇతర దేశాల నుంచి అమెరికాపై దాడులు జరగకుండా సమర్థవంతంగా నివారించగలమని చెప్పారు.
Also Read: చదువుకునేందుకు అమెరికా వెళ్లడం ఇక కష్టమే – ఈ లెక్కలు చూస్తే మీకే అర్థం అవుతుంది
ఉషా వాన్స్ పర్యటన వివరాలు:
ఉషా వాన్స్ ఈ నెల 27 నుండి 29 తేదీల మధ్య గ్రీన్ లాండ్లో డాగ్ స్లెడ్ రేస్ ఈవెంట్ లో పాల్గొనేందుకు ఆ దేశానికి పర్యటనకు వెళ్లనున్నారు. కానీ గ్రీన్ లాండ్ ప్రధాన మంత్రి మ్యూట్ ఎగేడే ఈ పర్యటనను తీవ్రంగా విమర్శించారు. అమెరికా-గ్రీన్ లాండ్ సంబంధాలు ఇటీవల కాలంలో దెబ్బతిన్నాయని, అందుకే ఈ పర్యటన ప్రచార ప్రయోజనాల కోసం మాత్రమేనని ఆయన పేర్కొన్నారు.
ఉషా వాన్స్ తో పాటు అమెరికా జాతీయ భద్రతా సలహాదారు మైక్ వాల్ట్జ్, శక్తి శాఖా కార్యదర్శి క్రిస్ రైట్ కూడా వస్తున్నారని తెలిసి ఎగేడే మరింత ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ పర్యటనకు ముందు ఉషా వాన్స్ ఒక ప్రచార వీడియోను కూడా విడుదల చేయడం గమనార్హం.
ఏంటి వివాదం?
గ్రీన్ లాండ్ భౌగోళికంగా ఉత్తర అమెరికాలో ఉన్నప్పటికీ, రాజకీయంగా డెన్మార్క్ పరిపాలనలో ఉంది. ట్రంప్ ప్రభుత్వం ఈ ద్వీపాన్ని కొనుగోలు చేయాలనే ప్రయత్నాలు చేస్తున్న విషయం రెండు దేశాల నుండి తీవ్ర వ్యతిరేకతను ఎదుర్కొంది. ఇటీవలే ట్రంప్ కుమారుడు కూడా గ్రీన్ లాండ్ సందర్శించడంతో అక్కడి ప్రభుత్వం సీరియస్ అయింది.
గ్రీన్ లాండ్ కు డెన్మార్క్ పోలీసు బలగాలు
మార్చి 11న జరిగిన గ్రీన్ లాండ్ పార్లమెంట్ ఎన్నికల్లో డెమోక్రట్స్ పార్టీకి చెందిన జెన్స్ ఫ్రెడరిక్ నీల్సన్ విజయం సాధించారు. ఆయన కూడా ఉషా వాన్స్ పర్యటనను తీవ్రంగా విమర్శించారు. అయితే, ఆయన విమర్శలు చేసినా ఉషా వాన్స్ తన పర్యటనను ఆపలేదు. అమెరికా ప్రత్యేక భద్రతా బలగాలను గ్రీన్ లాండ్‌కు పంపింది. అదే సమయంలో డెన్మార్క్ కూడా తమ పోలీసు బలగాలను పంపింది.