America: తుపాకుల మోతతో అగ్రరాజ్యం అమెరికా దద్దరిళ్లుతోంది. వరుసగా కాల్పులు చోటుచేసుకుంటుండడంతో జనాలు భయాందోళనలకు గురవుతున్నారు. తాజాగా మిసిసిపీలోని టేట్ కౌంటీలో ఓ దుండగుడు కాల్పులకు తెగబడ్డాడు. రెండిళ్లతోపాటు ఓ స్టోర్‌లో విచక్షణారహితంగా కాల్పులు జరిపాడు. ఈ ఘటనలో ఆరుగురు దుర్మరణం చెందారు. మరికొందరు తీవ్రంగా గాయపడ్డారు.
పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించారు. కాల్పులు జరిపిన కొద్ది సమయంలోనే నిందితుడిని స్టోర్ సమీపంలో అదుపులోకి తీసుకున్నారు.
ఈ ఘటనపై ఆదేశ అధ్యక్షుడు జో బైడెన్ స్పందించారు. ‘‘ఇక చాలు.. ఈ ఏడాదిలో 48 రోజుల్లో 73 కాల్పుల ఘటనలు చోటుచేసుకున్నాయి. తుపాకీ హింస ఒక అంటువ్యాధి. చట్టసభ చర్యలు తీసుకోవాలి’’ అని అన్నారు.