అదంపూర్ బేస్ క్యాంప్ లో మాట్లాడిన ప్రధాని మోదీ.. అణ్వాయుధాల పేరుతో బ్లాక్ మెయిలింగ్ జరిగినా భారత్ ధీటుగా బదులిచ్చిందని చెప్పారు. భారత సైన్యం ధైర్య సాహసాలకు ఆయన సెల్యూట్ చేశారు. అసలింతకీ అణ్వాయుధాలను ఎలా తయారు చేస్తారు..? వాటిని ఎలా దాచి పెడతారు..? తిరిగి ఉపయోగించుకునే వరకు వాటికి ఎలాంటి భద్రత కల్పిస్తారు..? ఇప్పుడు తెలుసుకుందాం.
అణ్వాయుధాలు ఎన్ని రకాలు..?
అణుశక్తి ఆధారంగా విధ్వంసం సృష్టించే బాంబులనే అణ్వాయుధాలుగా పరిగణిస్తాం. కేంద్రక సంలీనం అనే చర్య ద్వారా విధ్వంసం సృష్టిస్తే, వాటిని హైడ్రోజన్ బాంబులు అంటారు. సూర్యునిలో నిరంతరం కేంద్రక సంలీనం అనే రసాయనిక చర్య ద్వారానే శక్తి వెలువడుతుంది. ఇక రెండో రకం అణుబాంబు. ఇక్కడ కేంద్రక విచ్ఛిత్తి అనే రసాయనిక చర్య జరుగుతుంది. ఈ అణు బాంబుల తయారీకోసం యురేనియం, ప్లుటోనియం వంటి అణుధార్మిక పదార్థాలను ఉపయోగిస్తారు.
అణ్వాయుధాలు ప్రయోగిస్తే ఏమవుతుంది..?
పురాతన కాలం నుంచి నేటి వరకు యుద్ధ రీతులు మారిపోతున్నాయి. కత్తులతో ఒకరినొకరు నరుక్కోవడం నుంచి, ఎక్కడో దూరం నుంచి బాణాలతో గాయపరచడం, ఆ తర్వాత వాటి స్థానంలో బుల్లెట్లు రావడం మనందరికీ తెలిసిన విషయమే. ఇటీవల రష్యా-ఉక్రెయిన్, భారత్-పాకిస్తాన్ సమరంలో క్షిపణి దాడులు జరిగాయి. బోర్డర్ నుంచే కాదు, ఒక దేశం మధ్యనుంచి, మరో దేశంలో మనం కోరుకున్న ప్రాంతాలను క్షిపణులతో టార్గెట్ చేయవచ్చు. అయితే ఆ క్షిపణిలో వాడే పేలుడు పదార్థం సామర్థ్యాన్నిబట్టి అవతలివారికి నష్టం జరుగుతుంది. ఒకవేళ ఆదేశం క్షిపణి రక్షణ వ్యవస్థలను ఉపయోగిస్తే అవి ఆకాశంలోనే పేలిపోతాయి. అంటే నష్టాన్ని వీలైనంత వరకు తగ్గించవచ్చు, ఒకరకంగా పూర్తిగా అరికట్టవచ్చు కూడా. ఇక అణుబాంబులు ప్రయోగిస్తే మాత్రం ఆ నష్టాన్ని ఊహించలేం. 1945 రెండో ప్రపంచ యుద్ధంలో జపాన్ నగరాలైన హిరోషిమా, నాగసాకిపై అమెరికా అణుబాంబులు ప్రయోగించింది. ఈ దాడిలో హిరోషిమాలో దాదాపు లక్షన్నర మంది ప్రజలు మరణించారు. నాగసాకిలో దాదాపు 80వేలమంది మరణించినట్టు అంచనా.
అణ్వాయుధాలు ప్రయోగిస్తే బాంబులు పేలిన సమయంలోనే సగం మంది మరణిస్తారు. ఆ తర్వాత బాంబు దాడి ప్రభావం వల్ల మిగతా సగం మంది కాలక్రమంలో చనిపోతారు. రేడియేషన్ ప్రభావం, ఇతర అనారోగ్య సమస్యలు చుట్టుముట్టడం వల్ల బాంబుదాడి జరిగిన ప్రాంతంలో ఉన్నవారెవరూ బతికిబట్టకట్టలేరు. అందుకే వీటిపై ప్రపంచ దేశాలన్నీ కూడబలుక్కుని ఓ మాటమీదకొచ్చాయి. ఎట్టి పరిస్థితుల్లోనూ అణ్వాయుధాలు ప్రయోగించకూడదని తీర్మానించుకున్నాయి. పైకి అంతా బాగానే ఉన్నా.. ఎవరికి వారే అణ్వాయుధాలు సమకూర్చుకోవడం ఇక్కడ విశేషం. శత్రు దేశాలను భయపెట్టడానికి, తమ జోలికి రాకుండా చూసుకోడానికి ఈ అణ్వాయుధాలను సమకూర్చుకుంటున్నారు.
నిల్వ ఎలా..?
అణుబాంబు పేలితే ఎంత తీవ్ర పరిణామాలుంటాయో అందరికీ తెలుసు. మరి దాని నిర్వహణ సమర్థంగా లేకపోతే.. ప్రయోగించాల్సిన దేశంలోనే అది పేలిపోతే నష్టం ఎవరికి..? అందుకే వీటి తయారీకంటే వీటి నిర్వహణ, నిల్వ చేయడం అన్నిటికంటే పెద్ద సమస్య. అణుబాంబులను తయారు చేసే సమయంలో కూడా రేడియేషన్ నుంచి రక్షించుకోడానికి శాస్త్రవేత్తలు, సిబ్బంది రక్షణ సూట్లు ధరిస్తారు. ప్రస్తుతం అమెరికా, రష్యా, చైనా, ఫ్రాన్స్, బ్రిటన్, ఇండియా, పాకిస్తాన్, ఉత్తర కొరియా వంటి దేశాలకు మాత్రమే ఈ సాంకేతికత ఉంది. అణుబాంబులను నిల్వచేసే ప్రదేశం అత్యంత రహస్యంగా ఉంటుంది. ముఖ్యంగా శత్రు దేశాలకు ఆ ప్రదేశం తెలిస్తే.. ఒకవేళ ఆ ప్రాంతంపై క్షిపణులతో దాడి జరిగితే నిల్వ ఉంచిన దేశం సర్వ నాశనం అవుతుంది. అందుకే ఆయా ప్రాంతాలు ఆ దేశ పౌరులకు కూడా తెలియనంత రహస్యంగా ఉంటాయి. నిత్యం సాయుధ దళాల పహారా మాత్రం ఉంటుంది. భౌతిక పరమైన రక్షణతోపాటు.. పర్మిషన్ కోడ్ ఉంటేనే అక్కడికి వెళ్లేలా సాంకేతిక రక్షణ కూడా ఉంటుంది. అధికారిక అనుమతి కలిగిన వారు మాత్రమే అక్కడికి వెళ్లగలరు. ఇక రేడియేషన్ ప్రభావాన్ని తగ్గించేందుకు నిత్యం అక్కడ ప్రత్యేక ఏర్పాట్లు ఉంటాయి.
తరలింపు..
ఇక అణ్వాయుధాలను తరలించేందుకు కూడా ప్రత్యేక ఏర్పాటు ఉంటుంది. ఆయుధాలను GPS ట్రాకింగ్ సిస్టమ్ ద్వారా తరలిస్తారు. భారీ ఎస్కార్ట్ తో సాయుధ వాహనాలలో వాటిని ప్రయోగ కేంద్రాలకు చేరవేస్తారు. అణ్వాయుధాలను సరిగా నిల్వ చేయకపోయినా రేడియేషన్ ప్రభావం వల్ల భారీ నష్టం జరుగుతుంది. గాలి, నీరు, నేల విషపూరితం అవుతుంది. దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలు వస్తాయి. అణ్వాయుధాలను ప్రయోగించడానికి కూడా ప్రత్యేక వ్యవస్థ ఉంటుంది. వాటి తయారీ, నిల్వ, ప్రయోగం.. అన్నీ సమస్యాత్మకమైనవే. అయినా కూడా అణుబాంబులు కలిగి ఉండటం అత్యవసరం అనుకుంటున్నాయి కొన్నిదేశాలు. వాటి పేరు చెప్పి శత్రు దేశాలను భయభ్రాంతులకు గురి చేయాలనుకుంటున్నాయి.
గతంలో అణ్వస్త్రాల ప్రయోగం కేవలం హిరోషిమా, నాగసాకిపై మాత్రమే జరిగింది. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఎవరు ఎవరిపై అణుబాంబుని ప్రయోగించినా.. అల్లకల్లోలం జరగక మానదు. ప్రతీకార దాడులు మొదలైతే.. ప్రపంచమే నాశనం అవుతుంది.