అమెరికాలోని ప్రముఖ కంపెనీలు విదేశాల్లో తమ ప్లాంట్లను ఏర్పాటు చేసుకోవడం సర్వ సాధారణం. అందులోనూ ప్రొడక్షన్ కాస్ట్ తక్కువగా ఉండే చైనాను చాలా కంపెనీలు తమ స్థావరంగా ఏర్పాటు చేసుకుంటున్నాయి. ఇక ఉద్యోగుల విషయానికొస్తే అమెరికాలోని చాలా కంపెనీలు భారతీయులకు అవకాశాలివ్వడం చూస్తూనే ఉన్నాం. భారతీయ ఉద్యోగులు లేని ఐటీ కంపెనీలు అమెరికాలో లేవంటే అతిశయోక్తి కాదు. చాలా కంపెనీల్లో అమెరికన్లనే డామినేట్ చేసే స్థాయిలో భారతీయ ఉద్యోగులు అక్కడ పనిచేస్తున్నారు. అయితే ఇలాంటి విధానాలను అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ తీవ్రంగా ఖండిస్తున్నారు. రెండోసారి అధికారంలోకి వచ్చిన ఆయన అమెరికా కంపెనీలపై ఆంక్షలు విధించారు.
ఆ పప్పులు ఉడకవు..
అమెరికా కంపెనీలు ముందు స్థానికులకే అవకాశాలివ్వాలని అంటున్నారు డొనాల్డ్ ట్రంప్. అదే సమయంలో కొత్త ప్లాంట్ల ఏర్పాటుకి ఇతర దేశాలను ఎంపిక చేసుకోవడాన్ని కూడా ఆయన తప్పుబడుతున్నారు. ఇకపై కొత్తగా ఇతర దేశాల్లో ప్లాంట్లను ఏర్పాటు చేయాలనుకునే కంపెనీలపై ఆయన ఆంక్షలు విధించారు. ఇటీవల భారత్ లో యాపిల్ కంపెనీ కొత్త ప్లాంట్ ఏర్పాటుకి కూడా ట్రంప్ అడ్డుపుల్ల వేశారు. ట్రంప్ ప్రత్యక్షంగానే అమెరికా కంపెనీలకు హెచ్చరికలు జారీ చేశారు. భారతీయులను నియమించుకోవడం, చైనాలో ఫ్యాక్టరీలు ఏర్పాటు చేయడం వంటివి తన హయాంలో కుదరవని చెప్పారు. ఆరోజులు ముగిశాయని అన్నారు ట్రంప్.
ఇండియా, చైనాలో ఔట్ సోర్సింగ్ పద్ధతిలో ఉద్యోగులను నియమించుకుంటున్న అమెరికా టెక్ కంపెనీలను టార్గెట్ చేశారు ట్రంప్. వాషింగ్టన్‌లో జరిగిన AI సమ్మిట్‌లో ఆయన ఘాటు వ్యాఖ్యలు చేశారు. అమెరికాలోని టెక్ కంపెనీలు లక్షలాది అమెరికన్ల అపనమ్మకాన్ని చూరగొన్నాయని, స్థానికులకు ఆ కంపెనీలు ఉద్యోగాలివ్వడం లేదని విమర్శించారు. అమెరికన్లకు అమెరికన్ కంపెనీలు చేస్తున్న ద్రోహంగా దీన్ని పరిగణించాలని అన్నారాయన. అధ్యక్ష ఎన్నికల సమయంలో కూడా ట్రంప్ ఇదే వాదనను తెరపైకి తెచ్చారు. తన ఫస్ట్ ప్రయారిటీ అమెరికన్లేనని అన్నారు. అక్రమ వలసలను నిరోధిస్తానన్నారు. అన్నట్టుగానే అధ్యక్షుడిగా ఎన్నికైన తర్వాత ఆంక్షల కొరడాను బయటకు తీశారు ట్రంప్. అక్రమ వలసదారుల్ని తన్ని తరిమేస్తున్నారు. అమెరికాతో అంతర్జాతీయ వాణిజ్యం చేస్తున్న వివిధ కంపెనీలతో సుంకాల యుద్ధం మొదలు పెట్టారు. విదేశీ వాణిజ్యంతో అమెరికా చాలా నష్టపోయిందంటున్న ట్రంప్, తన హయాంలో అలాంటిది జరగబోదని చెప్పారు. ఉద్యోగాల విషయంలో కూడా అమెరికన్లకు నష్టం జరగనివ్వబోనని హామీ ఇచ్చారాయన.
టెక్నాలజీ కంపెనీలు అమెరికాకు మద్దతునివ్వాలని కోరారు ట్రంప్. ప్రపంచంలో అమెరికాను మొదటి స్థానంలో నిలబెట్టేందుకు కృషి చేయాలన్నారు. తాను అదొక్కటే అడుగుతున్నానని, టెక్ కంపెనీలు ఆ పని చేయాల్సిందేనని చెప్పారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీలో అమెరికా ఆధిపత్యం ఉండాలన్నారు ట్రంప్. అంతరిక్ష పోటీల్లో గెలిచినట్టే ఏఐ పోటీల్లో కూడా మనమే ముందుండాలని టెక్ కంపెనీలకు ఉపదేశించారు ట్రంప్. పక్షపాతంలో వ్యవహరించే ఏఐలను అడ్డుకోవాలని అలాంటి వాటిని అధిగమించి అమెరికా ఏఐ టాప్ ప్లేస్ లో ఉండాలని చెప్పారు. ఏఐ రంగంలో భవిష్యత్ తమదేనన్నారు. అయితే ఆయా కంపెనీలు అమెరికన్లకు ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. విదేశాల్లో విస్తరణ ప్రణాళికలు ఓకే కానీ, ఆ పేరుతో మానవ వనరులను వెదుక్కుంటూ విదేశాలకు తరలి వెళ్లడం సరికాదన్నారు ట్రంప్.