Trump India Tariffs| అమెరికా ఉత్పత్తులపై సుంకాలను తగ్గించడానికి భారత్ అంగీకరించిందని అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ తెలిపారు. భారత్ అత్యధిక సుంకాలు విధించే దేశమని.. ఆ దేశంలో ఏవీ విక్రయించడానికి వీలు లేనంత భారంగా అవి ఉన్నాయన్నారు. ఇదంతా తాము సుంకాల గురించి బహిర్గతం చేయడం వల్లే సాధ్యమైందని ట్రంప్ అన్నారు. ఈ అంశాన్ని లేవనెత్తడం.. భారత్ చర్యలను తాము బహిరంగ పరచడం వల్లే సుంకాలను తగ్గించడానికి ఆ దేశం అంగీకరించిందని తెలిపారు. వైట్ హౌస్‌లో జరిగిన సమావేశంలో అమెరికా అధ్యక్షుడు మరోసారి సుంకాల అంశాన్ని ప్రస్తావించారు.
అమెరికా వాణిజ్య శాఖ మంత్రితో చర్చలు జరిపేందుకు భారత వాణిజ్య శాఖ మంత్రి పీయూష్ గోయల్ వాషింగ్టన్ వెళ్లిన సమయంలో ట్రంప్ ఈ వ్యాఖ్యలు చేశారు. మరోవైపు.. రెండు దేశాల మధ్య ప్రతిపాదిత ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందం (Bilateral Trade Agreement – BTA) అమల్లోకి వస్తే ఇరువురికీ ప్రయోజనకరమని విదేశాంగ శాఖ ప్రకటించింది. రెండు ప్రభుత్వాలు వాణిజ్య ఒప్పందాలకు సంబంధించిన చర్చలను ముందుకు తీసుకెళ్లడంపై దృష్టి పెట్టాయని అధికార ప్రతినిధి రణధీర్ జైశ్వాల్ తెలిపారు. దీని వల్ల టారిఫ్‌ల అడ్డంకులు తొలగిపోతాయన్నారు. భారత్ చైనాలపై ట్రంప్ విధించిన సుంకాలు ఏప్రిల్ 2 నుంచి అమలు కానున్నాయి. ఈ క్రమంలో భారత దేశ ప్రభుత్వం అమెరికాతో డిప్లొమేటిక్‌గా వ్యవహరిస్తోంది.
Also Read: ఇండియా మేరా దోస్త్.. స్వరం మార్చిన చైనా!
మరోవైపు ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ నేతృత్వంలోని టెస్లా త్వరలో భారత్‌లో అడుగుపెట్టనుంది. ప్రస్తుతం భారత్ కార్ల దిగుమతిపై 110 శాతం సుంకాలు విధిస్తోంది. ఈ విషయంపై ఎలాన్ మస్క్ ఇప్పటికే పలుమార్లు భారత్‌పై బహిరంగంగా విమర్శలు చేశారు. ఈ నేపథ్యంలో అమెరికా నుంచి దిగుమతి అయ్యే కార్లపై సుంకాలను పూర్తిగా తొలగించేలా ఆ దేశంతో వాణిజ్య ఒప్పందంపై చర్చలు జరుగుతున్నాయి. అయితే భారత్ మాత్రం తక్షణమే సుంకాలను పూర్తిగా తొలగించే విషయంలో ఆచితూచి స్పందిస్తోంది. ఈ నేపథ్యంలో ట్రంప్ వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.
‘అమెరికా నుంచే ఆయుధాలను కొనాలి’
ఇది ఇలా ఉండగా.. భారత్ ఆయుధాల కోసం రష్యాపై ఆధారపడడాన్ని మానుకోవాలని యూఎస్ వాణిజ్య మంత్రి హోవార్డ్ లుట్నిక్ చెప్పారు. అప్పుడే భారత్, అమెరికా సంబంధాలు బలోపేతం అవుతాయని తెలిపారు. ప్రత్యామ్నాయంగా అధునాతన అమెరికన్ రక్షణ వ్యవస్థలను అందించడానికి తమ దేశం సిద్ధంగా ఉందని పేర్కొన్నారు. యూఎస్ డాలర్‌ను భర్తీ చేయడానికి కొత్త కరెన్సీ కోసం బ్రిక్స్ యత్నిస్తే ఇరు దేశాల సంబంధాలు దెబ్బతింటాయని వ్యాఖ్యానించారు. ఇరు దేశాల మధ్య వాణిజ్య సంబంధాలు న్యాయంగా ఉండాలని తాము కోరుకుంటున్నట్లు వెల్లడించారు.
కెనడా, మెక్సికోలకు ఊరట
కెనడా, మెక్సికోల వస్తువులపై విధించిన 25 శాతం సుంకాల అమలు విషయంలో ట్రంప్ కాస్త వెనక్కి తగ్గారు. ఆ దేశాల నుంచి దిగుమతి అయ్యే అనేక వస్తువులపై సుంకాలను మరో నెల రోజుల పాటు వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు. ఇంతకుముందు కూడా ట్రంప్ కెనడా, మెక్సికోలపై సుంకాల అమలు వాయిదా వేశారు.