ఫ్రాన్స్ రాజధాని పారిస్ బాంబు భయంతో వణికిపోయింది. గారే డు నార్డ్ రైల్వే స్టేషన్ సమీపంలో రెండవ ప్రపంచ యుద్దం నాటి పేలని బాంబు బయటపడటంతో, ఈ స్టేషన్ నుంచి అన్ని రైల్వే సర్వీసులను రద్దు చేస్తున్నట్లు అధికారులు ప్రకటించారు. కొద్ది గంటల పాటు కష్టపడి భద్రతా సిబ్బంది ఆ బాంబును నిర్వీర్యం చేశారు. ఈ నేపథ్యంలో లండన్, బస్సెల్స్ సహా ఇతర ప్రాంతాలకు యూరో స్టార్ రైల్వే సర్వీసులు మళ్లీ మొదలయ్యాయి. అయితే, అనుకున్న షెడ్యూల్ కంటే కాస్త ఆలస్యంగా నడుస్తున్నాయి.
ఇంతకీ అసలు ఏం జరిగిందంటే?
పారిస్ లోనే అత్యతం రద్దీగా ఉండే గారే డు నార్డ్ రైల్వే స్టేషన్ కు ఉత్తరాన సుమారు 2.5 కిలో మీటర్ల దూరంలో ట్రాక్ మెయింటెన్స్ పనులతో పాటు, కొత్త రైల్వే వంతెనను నిర్మించాలని అధికారులు నిర్ణయించారు. ఇందుకోసం కార్మికులు తవ్వకాలు జరుపుతుండగా ట్రాక్ సమీపంలో రెండు మీటర్ల లోతులో 500 కిలోల బాంబును గుర్తించారు. ఈ విషయాన్ని రైల్వే అధికారులకు చెప్పారు. అలర్ట్ అయిన అధికారులు భద్రతా సిబ్బందికి సమాచారం అందించారు. వెంటనే అక్కడికి చేరుకున్న పోలీసులు దాన్ని బాంబుగా గుర్తించారు. ముందు జాగ్రత్త చర్యగా గారే డు నార్డ్ రైల్వే స్టేషన్ నుంచి బయల్దేరే అన్ని రైల్వే సర్వీసులను క్యాన్సిల్ చేశారు. ఆ ప్రాంతంలో హై అలర్ట్ ప్రకటించారు. ఫ్రెంచ్ పోలీసులు సెయింట్ డెనిస్‌లో సమీపంలో ఉన్న ఇళ్ల నుంచి 200 మందిని ఖాళీ చేయించారు. పారిస్ శివారులోని ప్రధాన రింగ్ రోడ్డులో కొంత భాగాన్ని తాత్కాలికంగా మూసివేశారు. ఆ తర్వాత అధికారులు కొద్ది గంటల పాటు శ్రమించి రెండవ ప్రపంచ యుద్ధం నాటి బాంబును నిర్వీర్యం చేశారు. దీంతో పారిస్ వాసులు ఊపిరి పీల్చుకున్నారు.
Read Also: రైలు పట్టాల దగ్గర సెకెండ్ వరల్డ్ వార్ బాంబు.. ప్రయాణీకుల వెన్నులో వణుకు!
రైళ్ల నిలిపివేతతో ప్రయాణీకుల ఇబ్బందులు
గారే డు నార్డ్ రైల్వే స్టేషన్ నుంచి స్థానిక, అంతర్జాతీయ రైల్వే సేవలు నిలిపి వేయడంతో చాలా మంది ప్రయాణీకులు తీవ్ర అవస్థలు పడ్డారు. విమానాల్లో వెళ్లాలని ప్రయత్నించినప్పటికీ ఫ్లైట్లలో టికెట్లన్నీ బుక్ కావడంతో ఎటూ దారి లేక పారిస్ లోనే ఉండాల్సి వచ్చింది. సుమారు ఒక రోజు పాటు పారిస్ లోని హోటళ్లలో గడిపారు. మరికొంత మందికి సరైన వసతి సౌకర్యం లేక ఇబ్బందులు పడ్డారు. ఇంకొంత మంది తమ రైలు టికెట్లను క్యాన్సిల్ చేసుకుని, ప్రత్యామ్నాయ మార్గాల్లో ప్రయాణం కొనసాగించారు. ఆ అవకాశం లేని చాలా మంది రైళ్ల కోసం పడిగాపులు కాశారు. బాంబును నిర్వీర్యం చేసిన తర్వాత తమ ప్రయాణాలను కొనసాగించారు. ఓవైపు ఆలస్యం అవుతుందనే ఆందోళన, మరో వైపు బాంబు భయంతో ప్రయాణీకులు బిక్కు బిక్కుమంటూ గడిపారు. తమ జీవితంలోనే ఇదో భయానక అనుభవం అని చాలా మంది ప్రయాణీకులు వెల్లడించారు.
Read Also: ఏపీ నుంచి యూపీకి మూడేళ్ల జర్నీ.. అత్యంత ఆలస్యమైన రైలుపై PIB ఆసక్తిర వ్యాఖ్యలు!