India decession on crisis of Bangladesh..Sheikh Hasina.. Narendra Modi : రిజర్వేషన్ల వ్యతిరేక ఉద్యమం ఊపందుకున్న దశలో అనూహ్యంగా బంగ్లాదేశ్ లో రాజకీయ పరిణామాలు ఒక్కసారిగా మారిపోయాయి. తీవ్ర సంక్షోభంలో చిక్కుకున్న బంగ్లాదేశ్ లో సైనిక, పోలీసుల ఆంక్షలను ఛేదించుకుని ఆందోళనకారులు విద్రోహ చర్యలకు పాల్పడ్డారు. పరిస్థితి చేయిదాటిపోతోందని గ్రహించిన ఆ దేశ ప్రధాని షేక్ హసీనా తన పదవికి రాజీనామా చేసి దేశం విడిచి పారిపోయారు. పొరుగు దేశం అయిన బంగ్లా దేశ్ ఆందోళనలు భారత్ పై ఎలాంటి ప్రభావం చూపుతాయి? తదుపరి భారత్ స్పందన ఏ విధంగా ఉండబోతోందనే దాపిపై అందరిలో ఆసక్తి పెరిగిపోయింది. దీనితో సోమవారం మోదీ అధ్యక్షతన భద్రతా వ్యవహారాల శాఖ భేటీ అయ్యారు. ఈ సమావేశంలో ప్రస్తుత పరిస్థితిలో భారత్ అనుసరించాలాస్సిన వ్యూహంపై చర్చలు జరిగినట్లు సమాచారం. ఈ సమావేశంలో కేంద్ర విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్, అమిత్ షా, నిర్మలా సీతారామన్ తదితర శాఖల అధికారులతో సహా ఎన్ ఎస్ ఏ అడ్వయిజర్ అజిత్ దోవల్ భేటీ అయ్యారు.
15 సంవత్సరాలుగా భారత్ తో స్నేహహస్తం
గత 15 సంవత్సరాలుగా షేక్ హసీనా భారత్ తో సన్నిహిత సంబంధాలు కొనసాగిస్తున్నారు. చాలా సందర్భాలలో భారత్ వ్యతిరేకులు బంగ్లాదేశ్ లో రెచ్చగొట్టే వ్యాఖ్యలను ఆమె తిప్పికొట్టారు. భారత్ కు బాహాటంగానే మద్దతు ఇస్తూ వచ్చారు. మన్మోహన్ సింగ్ ప్రధానిగా ఉన్న కాలంనుంచే షేక్ హసీనా భారత్ తో సంబంధ బాంధవ్యాలు కొనసాగిస్తున్నారు. మోదీ ప్రధాని అయ్యాక బంగ్లా బంధం మరింత పటిష్టవంతం అయింది. అటు చైనా బంగ్లాదేశ్ ను ఎంతగా భారత్ పై ఉసిగొల్పినా భారత్ కే మద్దతు ఇస్తూ వస్తోంది బంగ్లాదేశ్. పెట్టుబడుల విషయంలో బంగ్లాదేశ్ కు భారత్ అండగా ఉంటూ వస్తోంది.
కరోనా వ్యాక్సిన్ల పంపిణీ
రెండేళ్ల క్రితం మహమ్మారి కరోనా వచ్చి దాదాపు అన్ని దేశాలు అతలాకుతలం అయిన సందర్భంలోనూ బంగ్లాదేశ్ కు భారత్ వ్యాక్సిన్లు పంపిణీ చేసి మానవతను చాటుకుంది. పాకిస్తాన్ ను శత్రుదేశంగా చూసేదే కానీ బంగ్లాదేశ్ ను మాత్రం భారత్ ఎప్పుడూ మిత్ర దేశంగానే భావిస్తూ వస్తోంది. అయితే షేక్ హసీనా ఎప్పుడైతే దేశం విడిచి పారిపోయారో బంగ్లా దేశ్ సైన్యం అధీనంలోకి వెళ్లిపోయింది. అంతేకాదు షేక్ హసీనా ప్రత్యర్థి ఖలీదా జియా జైలు నుంచి విడుదలయ్యారు.
ఖలీదా జియా ప్రధాని అవుతారా?
ఖలీదా జియా భారత్ కు భద్ద శత్రువు. ఆమె ప్రధానిగా ఉన్న హయాంలో భారత్ సరిహద్దుల్లో బంగ్లా టెర్రరిస్టు చర్యలను ఆమె సమర్థించారు. అయితే ఎప్పటిలాగానే భారత్ బంగ్లాదేశ్ తో స్నేహంగానే ఉంటుందని, అక్కడ ఏ ప్రభుత్వం వచ్చినా తమ మద్దతు ఇచ్చేందుకు ప్రయత్నిద్దామనే ఆలోచనలతో సమావేశం జరిగినట్లు సమాచారం. శాంతి భద్రతల విషయానికికొస్తే అది ఆ దేశానికి సంబంధించిన అంతర్గత సమస్య. అందులో జోక్యం చేసుకోకపోవడమే ఉత్తమం అని నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.
సరిహద్దు అప్రమత్తం
ఇప్పటికే భారత్, బంగ్లాదేశ్ సరిహద్దు ప్రాంతాలలో భారత భద్రతా బలగాలు పర్యవేక్షిస్తున్నాయి. చొరబాటు దారులు ఎవరూ భారత్ భూభాగంలో చొచ్చుకురాకుండా జాగ్రత్త పడుతున్నారు. ఇక బంగ్లాదేశ్ లో ఇరుక్కుపోయిన మూడు వేల మంది విద్యార్థులందరినీ భారత్ కు ప్రత్యేక విమానం ద్వారా తీసుకొచ్చే ఏర్పాట్లు సత్వరమే చేపట్టాలని కీలక నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.