Revanth govt MoU: తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి అమెరికా పర్యటన మంచి ఫలితాలు వస్తున్నాయి. ఇప్పటికే ఎన్నారైలతో సమావేశమైంది రేవంత్ టీమ్. అమెరికాకు చెందిన వాల్స్‌కర్రా హోల్డింగ్స్ సంస్థ తెలంగాణలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకొచ్చింది.
తెలంగాణలోకి విదేశీ పెట్టుబడులను రప్పించేందుకు సీఎం రేవంత్‌రెడ్డి టీమ్ ప్రయత్నాలు ముమ్మరం చేసింది. ఇందులోభాగంగా ప్రస్తుతం ఆయన అమెరికాలో పర్యటిస్తున్నారు. తెలంగాణలో పెట్టుబడులు పెట్టేందుకు అమెరికాకు చెందిన వాల్స్ కర్రా హోల్డింగ్స్ సంస్థ ముందుకొచ్చింది.
న్యూయార్క్‌లో ఏర్పాటు చేసిన ఓ కార్యక్రమంలో ఆ సంస్థకు చెందిన ఫణి కర్రా, గ్రేగ్ వాల్స్, వీ హబ్ సీఈవో సీతా పల్లచోళ్ల మధ్య అవగాహన ఒప్పందాలు జరిగాయి. ఈ సందర్భంగా ఆ సంస్థ ప్రతినిధులను సీఎం రేవంత్‌రెడ్డి అభినందించారు.
ALSO READ: సీఎం మీటింగ్ సక్సెస్.. హైదరాబాద్‌లో కాగ్నిజెంట్ కొత్త సెంటర్
రాబోయే ఐదేళ్లలో వీ హబ్‌లో 42 కోట్ల రూపాయలు పెట్టుబడులు పెట్టనుంది. అంతేకాదు రాష్ట్రంలో నెల కొల్పే స్టార్టప్‌ల్లో దాదాపు 839 కోట్లు పెట్టుబడులకు సిద్ధంగా ఉన్నట్లు తెలిపింది. ఔత్సాహిక పారిశ్రామిక వేత్తలు తెలంగాణ సామర్థాన్ని చాటుతున్నారని ఈ సందర్భంగా అన్నారు సీఎం రేవంత్‌రెడ్డి.
అటు న్యూయార్క్ స్టాక్ ఎక్స్చేంజ్‌ని సీఎం రేవంత్‌రెడ్డి టీమ్ సందర్శించింది. ఈ సందర్భంగా అక్కడి విశేషాలను అధికారులకు వివరించారు. అమెరికా ఆర్థిక వ్యవస్థకు గుండెకాయ లాంటి న్యూయార్క్ స్టాక్ ఎక్స్చేంజ్‌ను సందర్శించడం చాలా సంతోషంగా ఉందని చెప్పుకొచ్చారు. సంపద సృష్టికర్తల చరిత్రకు సజీవ చిహ్నంగా దీన్ని వర్ణించారు.