రష్యాలో బుధవారం ఏర్పడిన భూకంపం వల్ల పసిఫిక్ మహా సముద్రంలో సునామీ ఏర్పడింది. అది ఏకంగా ప్రపంచంలోని 30 దేశాలకు విస్తరించింది. ముందుగా హవాయ్ దేశంలో భారీ ఎత్తున సముద్ర అలలు ఎగసిపడ్డాయి. తాజాగా వాషింగ్టన్, ఒరెగాన్, కాలిఫోర్నియా తీరాలను సైతం సునామీ అలలు తాకాయి. అదేవిధంగా శాన్‌ఫ్రాన్సిస్కో, సౌత్ కాలిఫోర్నియా తీరంలో సునామీ అలజడి రేగింది. ప్రస్తుతం 3 మీటర్ల వరకు రాకాసి అలలు ఎగసిపడుతున్నాయి.
ప్రధానంగా హవాయిలోని హోనోలులో సునామీ సైర్లను మోగుతూనే ఉన్నాయి. ఉదయం నుండి కంటిన్యూగా మోగుతుండటంతో హవాయి ద్వీపాన్ని అటు పర్యాటకులు, ఇటు స్థానికలు వీడుతున్నారు. దీంతో రోడ్లపై ఎక్కడికక్కడ ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. తాజాగా ఉత్తర కాలిఫోర్నియా తీరంలోనూ సునామీ హెచ్చరికలు జారీ అయ్యాయి.
సునామీ హెచ్చరికలతో అమెరికాలోని భారత కాన్సులేట్ జనరల్ అప్రమత్తమైంది. ప్రజలంతా అవసరమైన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది. అంతేకాదు.. అమెరికాలోని భారతీయులను అలర్ట్ చేసింది. తీర ప్రాంతాలకు దూరంగా ఉండాలని హెచ్చరించింది. అందరూ ఎత్తైన ప్రాంతాలకు తరలివెళ్లాలని సూచనలు చేసింది.
మరోవైపు సునామీ హెచ్చరికలపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ స్పందించారు. ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు. సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్లాలన్నారు ఆయన. అధికారులు జారీ చేసే అలర్ట్‌లను ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ పాటించాలని ట్వీట్‌లో పేర్కొన్నారు. అత్యవసర పరిస్థితికి సిద్ధమవ్వాలన్నారు. అదేవిధంగా సాయం కోసం ఎమర్జెన్సీ నెంబర్లను సంప్రదించాలన్నారు డొనాల్డ్ ట్రంప్.
తాజాగా ఇప్పుడు సునామీ ముప్పులో మరిన్ని దేశాలు కూడా కలిశాయి. ఇండోనేసియా, మెక్సికో, న్యూజిలాండ్ సహా పనామా, తైవాన్ తదితర దేశాలు ఉన్నాయి. ఇప్పుడు న్యూజిలాండ్‌లోనూ సునామీ హెచ్చరికలు జారీ అయ్యాయి. అక్కడి ఎయిర్ పోర్టు అధికారులు, సిబ్బందిని మరింత అలర్ట్ చేశారు.
అయితే.. జపాన్‌ను సైతం సునామీ ముంచెత్తిందనే వార్తలు వస్తున్నాయి. మరి ఆ రాకాసి అలలు ఇండియా వైపుకు కూడా వస్తాయా అనే సందేహాలు చాలామందిలో నెలకొన్నాయి. దీనిపై ఇండియన్ సునామీ ఎర్లీ వార్నింగ్ సెంటర్ (ITEWC) స్పందిస్తూ.. ‘‘రష్యాలో ఏర్పడిన భూకంప తీవ్రత వల్ల పలు దేశాల్లో సునామీ అలలు తాకుతున్నాయి. అయితే, ఇండియాకు ఎలాంటి ప్రభావం లేదు. ఎవరో ఆందోళన చెందవద్దు’’ అని పేర్కొంది.
ఇండియాకు సునామీ చేరలేదు.. ఎందుకంటే?
భౌగోళిక పరిస్థితులను పరిశీలిస్తే ఇండియాకు సునామీ అలలు తాకే అవకాశం లేదు. ఎందుకంటే మధ్యలో జపాన్, ఇండోనేషియా, ఫిలిపిన్స్, మలేషియా, పపువా న్యూ గునియా, ఆస్ట్రేలియా వంటి దేశాలు అడ్డుగా ఉన్నాయి. భారీ సునామీ ఏర్పడినా సరే.. అలలు తాకిడి ఇండియాకు చేరే అవకాశాలు తక్కువే.
Also Read: సునామీ వీడియోలు.. 30 దేశాల్లో అలల అల్లకల్లోలం
రష్యాలోని కామ్చట్కా పెనిన్సులా ప్రాంతంలో భూకంప కేంద్రాన్ని గుర్తించినట్లు యూఎస్ జియోలాజికల్ సర్వే (USGS) వెల్లడించింది. 8.8 తీవ్రతతో భూకంపం ఏర్పడినట్లు ప్రకటించారు. భూమికి 19.3 కిమీల లోతులో భూకంప కేంద్రం ఉన్నట్లు వెల్లడించారు. ఆ వెంటనే పసిఫిక్ మహా సముద్రం తీర దేశాలకు సునామీ హెచ్చరికలు జారీ చేశారు. చెప్పినట్లే పలు తీర ప్రాంతాలను సునామీ ముంచెత్తింది. జపాన్‌లో సునామీ హెచ్చరికలు రేపటి వరకు కొనసాగనున్నాయి.