Israel Attack Lebanon Ceasefire| మిడిల్ ఈస్ట్ దేశాల్లో ఇజ్రాయెల్ కారణంగా నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులు అంత త్వరగా సాధారణ స్థితికి చేరేలా కనిపించడం లేదు. రెండు నెలలకు పైగా లెబనాన్‌లో జరుగుతున్న ఇజ్రాయెల్, హిజ్బుల్లా మధ్య యుద్ధంలో తాత్కాలికంగా కాల్పుల విరమణకు రెండు వర్గాలు ఒప్పుకున్నాయి. కానీ కాల్పుల విరమణ సంధికి 24 గంటలు గడవక ముందే ఇజ్రాయెల్ మరోసారి లెబనాన్ భూభాగంపై రాకెట్ దాడులు చేసింది. ఈ దాడులు గురువారం నవంబర్ 28, 2024న దక్షిణ లెబనాన్ లో జరిగాయని అంతర్జాతీయ మీడియా తెలిపింది.
కాల్పుల విరమణ సంధికి అంగీకరించిన 24 గంటల్లోనే ఇజ్రాయెల్ చేసిన తొలి దాడి ఇదే కావడం గమనార్హం. స్థానిక మీడియా ప్రకారం.. దక్షిణ లెబనాన్ లోని బయెసరియె గ్రామానికి సమీపంలో ఇజ్రాయెల్ ఆకాశ మార్గాన ఈ దాడులు చేసింది. ఈ ప్రాంతంలో హిజ్బుల్లా మిలిటెంట్లు భారీగా ఆయుధాలు సమకూర్చి నిల్వ చేశారని.. అందుకే ఆ ఆయుధ భాండాగారాన్ని ధ్వంసం చేసేందుకే రాకెట్ దాడులు చేశామని ఇజ్రాయెల్ సైన్యం అధికారికంగా ప్రకటించింది.
ఇజ్రాయెల్ భూభగంపై మళ్లీ హిజ్బుల్లా దాడి చేసేందుకు ప్లాన్ చేసిందని.. ఈ ఉగ్రవాద చర్యను ముందస్తుగా నివారించేందుకే ఈ దాడి చేశామని ఇజ్రాయెల్ సైనికాధికారులు తెలిపారు. అయితే ఈ దాడుల్లో దక్షిణ లెబనాన్ లో ప్రవేశించే రెండు కార్లపై కూడా ఇజ్రాయెల్ మిసైల్స్ అటాక్ చేశాయి. దీంతో ఇద్దరు వ్యక్తులు మరణించారని సమాచారం.
సెప్టెంబర్ 2024లో ఇజ్రాయెల్ లబనాన్ లోని హిజ్బుల్లా స్థావరాలే లక్ష్యంగా దాడులు చేసింది. ఆ తరువాత హిజ్బుల్లా మిలిటెంట్లు కూడా ఇజ్రాయెల్ సరిహద్దు పట్టణాలపై దాడులు చేశారు. అలా దాడులు ప్రతిదాడులు పెరిగపోవడంతో ఇజ్రాయెల్ సైన్యం లెబనాన్ భూభాగంలో ప్రవేశించింది. ముఖ్యంగా లెబనాన్ రాజధాని బేరుట్ నగరం, దక్షిణ లెబనాన్ లో ఇజ్రాయెల్ సైన్యం చేసిన దాడుల్లో ఇప్పటి వరకు 3000 మందికి పైగా ప్రజలు చనిపోయారు.
Also Read: ఆఫీసులో నిద్రపోయినందకు ఊడిన ఉద్యోగం.. కంపెనీకి రూ.40 లక్షలు జరిమానా!
మరోవైపు ఇజ్రాయెల్ సైన్యంలోని 82 సైనికులు, 47 మంది పౌరులు చనిపోయారు. ఇజ్రాయెల్, హిజ్బుల్లా మధ్య జరుగుతన్న యుద్దంలో పరోక్షంగా ఇరాన్ కూడా ప్రవేశించింది. దీంతో ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య కూడా దాడులు, ప్రతిదాడులు జరిగాయి. ఈ పరిణామాలతో మిడిల్ ఈస్ట్ దేశాలు ఆందోళన చెందాయి. ఇజ్రాయెల్ ని నియంత్రణ చేయడానికి, కాల్పుల విరమణ చేయడానికి అమెరికా, ఫ్రాన్స్, కతార్ దేశాలు గత నెల రోజులుగా మధ్యవర్తత్వం చేశాయి. చివరికి నవంబర్ 26, 2024న కొన్ని షరతులపై ఇజ్రాయెల్, హిజ్బుల్లా వర్గాలు అంగీకిరించాయి. ఈ కాల్పుల విరమణ 60 రోజుల పాటు మాత్రమే ఉంటుంది.
ఈ కాల్పుల విరమణ అమలుపరచడానికి లెబనాన్ సైన్యం, ఐక్యరాజ్య సమితి పీస్ కీపర్స్ బలగాలు, అమెరికా నేతృత్వంలోని పర్యవేక్షణ బృందం దక్షిణ లెబనాన్ లో కృషి చేస్తాయి. ముందుగా దక్షిణ లెబనాన్ లోని హిజ్బుల్లా మిలిటెంట్లు ఆ ప్రాంతం నుంచి విరమించాలి. ఆ తరువాత దశల వారీగా ఇజ్రాయెల్ సైన్యం కూడా తమ దేశ సరిహద్దులకు తిరిగి వెళుతుంది.
కానీ ఇప్పుడు ఇజ్రాయెల్ కాల్పుల విరమణ నిబంధనలు ఉల్లంఘించి దక్షిణ లెబనాన్ పై దాడులు చేయడంతో హిజ్బుల్లా మిలిటెంట్లు కూడా తాము ఇజ్రాయెల్ ను ఎదుర్కోవడానికి సిద్ధమని తెలిపారు. దీంతో పరిస్థితులు ఆందోళనకరంగా మారాయి.