Israel Buses Explode : రెండేళ్ల నుంచి ఇస్లాం ఉగ్రమూకపై యుద్ధంలో అవిశ్రాంతంగా పోరాడుతున్న ఇజ్రాయిల్.. ఇటీవలే కాల్పుల విరమణ ఒప్పందాన్ని కుదుర్చుకుంది. ఇలాంటి తరుణంలో మరోసారి ఆదేశం ఉలిక్కి పడింది. ఇజ్రాయెల్‌లోని సెంట్రల్ సిటీ బాట్ యామ్‌లో సాయంత్రం వేళలో ఒకేసారి మూడు బస్సులపై భారీ బాంబులు పేలాయి. దీంతో.. మరోసారి ఇజ్రాయిల్ దళాలు అప్రమత్తం అయ్యాయి. హుటాహుటిగా సంఘటనా స్థలానికి చేరుకున్న దర్యాప్తు, పోలీసు బృందాలు.. బాంబులు పేలడానికి కారణాల్ని అన్వేషిస్తున్నాయి. కాగా.. ఈ ఘటనపై ఇజ్రాయిల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు భద్రతా సమావేశం నిర్వహించనుండగా.. పేలుళ్లకు పాలస్తీనా ఉగ్రవాద సంస్థలు కారణమని ఆదేశ రక్షణ మంత్రి ఇజ్రాయెల్ కాట్జ్ ఆరోపించారు.
ఇజ్రాయెల్ (Israel) అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. గురువారం సాయంత్రం బాట్‌యామ్‌లోని వివిధ ప్రదేశాల్లో ఈ బస్సు పేలుళ్లు చోటుచేసుకున్నాయి. ఈ ఘటనలో ఎవరికీ గాయాలు కాలేదని తెలిపిన అధికారులు.. బస్సులు దారుణంగా పేలిపోయినట్లు వెల్లడించారు. పేలుళ్ల సమాచారం అందుకున్న వెంటనే.. బాంబు నిర్వీర్య విభాగం అధికారులు కుణ్ణంగా తనిఖీలు చేపట్టారు. ఈ ఘటనకు పాల్పడ్డ అనుమానితుల కోసం పోలీసులు, నిఘా విభాగం అధికారులు ప్రత్యేక గాలింపు చర్యలు చేపట్టారు.
ఈ ఘటన తర్వాత ఆ ప్రాంతానికి ప్రజలు దూరంగా ఉండాలని, ఏవైనా అనుమానాస్పద వస్తువుల కనిపిస్తే సమాచారం అందించాలని కోరారు. అలాగే.. దేశ వ్యాప్తంగా బస్సు డ్రైవర్లు తమ వాహనాలను ఎక్కడికక్కడ నిలిపివేశారు. వారి వాహనాల్లో ఏవైనా అనుమానాస్పద పేలుడు పరికరాలు, వస్తువులు, బ్యాగులు ఉన్నాయేమోనని తనిఖీ చేసుకోవాలని ఇజ్రాయెల్ భద్రతా అధికారులు కోరారు. ఈ ఘటనకు కచ్చితంగా పాలస్తీనా ఉగ్రవాద సంస్థలే కారణమన్న అధికారులు.. వెస్ట్‌బ్యాంక్‌లో కనుగొన్న పదార్థాలు తాజా పేలుడు పరికరాలు ఒకేలా ఉన్నాయని టెల్‌అవీవ్ పోలీసు అధికారి తెలిపారు. ఈ ఘటనను తీవ్రంగా పరిగణిస్తున్నట్లు ప్రధాని కార్యాలయం ఓ ప్రకటనలో పేర్కొంది.
తాజా దాడులతో ఉగ్రవాదులు తమతో చేసుకున్న కాల్పుల విమరణ ఒప్పందాన్ని ఉల్లంఘిస్తున్నారంటూ ఆగ్రహిస్తున్న సైనిక అధికారులు.. పాలస్తీనా అంతటా భారీ ఎత్తున తనిఖీలకు ఆదేశించారు. ముఖ్యంగా శరణార్థి శిబిరాల్లో ఉగ్రమూకలపై దాడులను ముమ్మరం చేయాలని సైన్యాన్ని ఆదేశించినట్లు కాట్జ్ ఒక ప్రత్యేక ప్రకటనలో తెలిపారు. ఇజ్రాయెల్‌లోని పౌర జనాభాపై పాలస్తీనా ఉగ్రవాద సంస్థలు గుష్ డాన్ (సెంట్రల్) ప్రాంతంలో తీవ్రమైన దాడులకు ప్రయత్నించిన నేపథ్యంలో.. తుల్కరేమ్ శరణార్థి శిబిరంలో, జుడియా, సమారియాలోని అన్ని శరణార్థి శిబిరాల్లో ఉగ్రవాదాన్ని అడ్డుకోవడానికి తనిఖీలను ముమ్మరం చేయాలని ఐడీఎఫ్ (మిలిటరీ)కి ఆదేశాలు అందాయి. పాలస్తీనా ఉగ్రవాదులను లక్ష్యంగా చేసుకుని సైన్యం కొన్ని వారాలుగా వెస్ట్ బ్యాంక్‌లోని అనేక నగరాలు, శరణార్ధి శిబిరాల్లో రోజువారీ దాడులు నిర్వహిస్తోంది. ఈ దాడులు ప్రస్తుత పేళుళ్ల నేపథ్యంలో మరింత ముమ్మరం చేయనున్నారు.
గాజాపై మళ్లీ కాల్పులకు అవకాశం
బంధీల మార్పిడి ఒప్పందం మేరకు గాజాలోని ఉగ్రవాదులు, ఇజ్రాయిల్ మధ్య కాల్పుల విమరణ ఒప్పందం కుదిరింది. దీంతో.. ఒకరి ఆధీనంలోని బంధీలను మరొకరు పరస్పరం మార్పిడి చేసుకుంటున్నారు. ఈ నేపథ్యంలోనే.. హమాస్ ఆధీనంలోని నలుగురు ఇజ్రాయిలీల మృతదేహాల్ని తిరిగి అప్పగించారు. వీరిని స్వాధీనం చేసుకున్న అధికారులు.. అందులోని ఓ మహిళ మృతదేహం తమ పౌరురాలిది కాదని స్పష్టం చేసింది. వేరే ఎవరో మహిళ మృతదేహాన్ని తమదిగా చెప్పి అప్పగించారని, ఇది కాల్పుల విమరణ ఒప్పందాన్ని ఉల్లంఘించినట్లుగానే చూడాలని టెల్ అవీవ్ పేర్కొంది.
Also Read : US Immigrants : ట్రంప్ క్రూరత్వం – డేరియన్ అడవులకు అక్రమ వలసదారుల తరలింపు