US Immigrants : అధికారిక పత్రాలు లేకుండా దేశంలోకి అక్రమంగా ప్రవేశించిన విదేశీయులపై అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేపట్టిన కఠిన చర్యల్లో భాగంగా.. దేశం నుంచి బహిష్కరణ విధించిన భారతీయులతో సహా దాదాపు 300 మందిని పనామానాలోని ఓ హోటళ్లో ఉంచారు. అక్కడి నుంచి ఆయా వలసదారులను వారివారి దేశాలకు తరలించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ సందర్భంలోనే.. మమ్మల్ని రక్షించండి, మేము సురక్షితంగా లేము అంటూ హోటళ్లోని వాళ్లు కిటికీల నుంచి పోస్టర్లను ప్రదర్శించారు. ఈ ఫోటోలు ఇంటర్నెట్లో వైరల్ అవుతున్నాయి.
అక్రమ వలసదారులను ఎవరి దేశానికి వాళ్లను పంపే ముందు వారందరిని పనామానగరంలోని డెకాపోలిస్ హోటల్ లో ఉంచారు. ఈ ప్రాంగణాన్ని భద్రతా బలగాలు అదుపులోకి తీసుకున్నాయి. అక్కడి నుంచి ఎవరూ తప్పించుకునేందుకు వీలు లేకుండా కాపాలా ఏర్పాటు చేశారు. దీంతో.. హోటల్ లోని కిటీకీల నుంచి వలసదారులు “దయచేసి మాకు సహాయం చేయండి”, “మేము సురక్షితంగా లేము” అని రాసి ఉన్న పేపర్లతో ప్రదర్శన నిర్వహించారు. ఈ ఫోటోలను ఇంటర్నేషన్ సైట్లు ప్రచురించడంతో పాటు అక్కడ ఏం జరుగుతుందని ఆరాలు మొదలుపెట్టాయి.
అసోసియేటెడ్ ప్రెస్ నివేదిక ప్రకారం, దాదాపు 300 మంది బహిష్కరణకు గురైన వ్యక్తుల్ని ఆ హోటళ్లో ఉంచినట్లు తెలుస్తోంది. వీరిలో ఎక్కువగా.. భారత్, నేపాల్, శ్రీలంక, పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్, చైనా, వియత్నాం, ఇరాన్ దేశాలకు చెందిన వారిగా అమెరికా అధికారులు వెల్లడించారు. అయితే.. అక్రమ వలసదారుల్ని తిరిగి దేశంలోకి పంపేందుకు భారత్ సానుకూలంగా స్పందించింది. ప్రధాని మోదీ సహా విదేశాంగ మంత్రి జై శంకర్.. అక్రమ వలసల్ని వ్యతిరేకించారు. ఏదేశంలోకి అయినా చట్టవిరుద్ధంగా ప్రవేశించడం తప్పు అని తేల్చి చెప్పేశాయి.
దాంతో.. వలసదారులతో వస్తున్న విమానాలకు అనుమతులు కానీ, తిరిగి వస్తున్న వారిని స్వీకరించే విషయంలో కానీ భారత్ తో ఎలాంటి సమస్యలు లేవు. కానీ.. అంతర్జాతీయంగా అనేక దేశాలు అక్రమ వలసదారుల్ని తిరిగి స్వీకరించేందుకు ఇష్టపడడం లేదు. ఆయా దేశాలతో అమెరికా కొన్ని ఇబ్బందుల్ని ఎదుర్కొంటోంది. అలాంటి వారందరిని పనామా తరలించి.. అక్కడి నుంచి అవకాశం వచ్చినప్పుడు తరలిస్తున్నారు. ఈ ప్రక్రియ పూర్తయ్యే వరకు పనామాను స్టాప్-ఓవర్‌గా అమెరికా ఉపయోగిస్తోంది.
ఆ విషయంపై స్పందించిన పనామా రక్షణ మంత్రి ఫ్రాంక్ అబ్రెగో… వలసదారుల స్వేచ్ఛను తాము హరించడం లేదని స్పష్టం చేశారు. వారిని సురక్షితంగా ఉంచేందుకు మాత్రమే తమ దేశంలో అదుపులో ఉన్నారని తెలిపారు. ఇలా వలసదారుల్ని తరలించే ప్రక్రియలో స్టాప్ ఓవర్ గా పనామా దేశాన్ని వినియోగించుకునేందుకు పనామా – యుఎస్ మధ్య ఒప్పందం కుదిరిందని తెలిపారు. ఇరు దేశాల మధ్య వలస ఒప్పందంలో భాగంగా బహిష్కరణకు గురైన వాళ్లకు వైద్య సహాయం, ఆహారం అందజేస్తున్నామని తెలిపారు. ఫిబ్రవరి ప్రారంభంలో అమెరికా విదేశాంగ కార్యదర్శి మార్కో రూబియో.. పనామాను సందర్శించిన సందర్భంగా ఈ ఒప్పందం కుదిరింది. అప్పుడే.. అమెరికా నుంచి బహిష్కరణ ఎదుర్కొనే వాళ్లను కొన్నాళ్లు తమ దేశంలో స్టాప్ గా నిలిపి ఉంచి, వాళ్లకు వసతులు కల్పించేందుకు అంగీకరించినట్లు తెలిపారు. ఇందుకయ్యే ఖర్చులన్నింటినీ.. వాషింగ్టన్ భరించనుందని ఫ్రాంక్ అబ్రెగో తెలిపారు.
Also Read : Trump vs Zelenskyy : బైడెన్ కు ఫిడేల్ వాయించి డబ్బులు దండుకున్నారు- జెలెన్స్సీకి ట్రంప్ షాక్
ఇక్కడి నుంచి ఎవరి స్వస్థలాలకు వారిని తరలించనున్నారు. అయితే.. స్వదేశాలకు వెళ్లేందుకు ఇష్టపడని వారిని కొలంబియాతో పనామా సరిహద్దుకు సమీపంలోని డేరియన్ అడవిలోని ఓ ఆశ్రయానికి తరలించనున్నట్లు అమెరికా అధికారులు వెల్లడించారు. వీరి బాగోగుల్ని ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ ఫర్ మైగ్రేషన్, UN రెఫ్యూజీ ఏజెన్సీ వారు చూసుకుంటారని తెలిపారు. ప్రస్తుతం పనామాలోని 300 మందిలో 171 మంది అక్రమ వలసదారులు వారి స్వదేశాలకు తిరిగి వెళ్లేందుకు స్వచ్ఛందంగా అంగీకరించారని అధికారులు చెబుతున్నారు. మిగతా వాళ్లల్లో స్వదేశానికి కాకుండా.. వేరే దేశాలకు వెళ్లాలి అనుకునే వారిలో 97 మందిని డేరియన్‌లోని ఒక శిబిరానికి తరలించారు.