పాకిస్తాన్ సైన్యం, ఉగ్రవాదులు వేరు కాదు. యుద్ధవాతావరణంలో మరోసారి పాకిస్తాన్ సైన్యం ఇదే విషయాన్ని రుజువు చేసింది. ఉగ్రవాదుల్ని తామే పెంచి పోషిస్తున్న సంగతి మరోసారి ప్రపంచానికి తెలిసేలా ప్రవర్తించింది. ఇన్నాళ్లూ తాము కూడా ఉగ్రవాదులతో పోరాడుతున్నామని ప్రపంచాన్ని నమ్మించాలని చూసేవారు పాక్ సైనికాధికారులు. కానీ ఇప్పుడా ముసుగు తొలగించారు. ఆపరేషన్ సిందూర్ లో 9 ఉగ్రవాద శిబిరాలపై భారత్ దాడి తర్వాత మరణించిన ఉగ్రవాదుల అంత్యక్రియలకు పాక్ సైనికాధికారులు హాజరయ్యారు. పాకిస్తాన్ జాతీయ జెండాలను వారి శవపేటికలపై ఉంచి అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు చేశారు. ఈ ఘటనతో పాక్ సైన్యం బరితెగింపు అందరికీ అర్థమైంది. గతంలో ఉగ్రవాదుల దాడిలో మరణించిన జర్నలిస్ట్ డేనియల్ పెర్ల్ తండ్రి జూడియా పెర్ల్ ఈ ద్వంద్వ వైఖరిని తీవ్రంగా తప్పుబట్టారు. మీ పిల్లలకు మీరిచ్చే సందేశం ఇదేనా అని నిలదీశారు. ఉగ్రవాదుల అంత్యక్రియలకు హాజరైన సైన్యం ప్రపంచ దేశాలకు ఇచ్చే సందేశం ఏంటని సూటిగా ప్రశ్నించారు జూడియా పెర్ల్.
I wish these dignitaries could tell us: "What exactly are you mourning? What role models you wish your children to revere? What have you learned from this man? https://t.co/Z6DRQFJvkR
— Judea Pearl (@yudapearl) May 9, 2025
ఎవరీ డేనియల్ పెర్ల్..?
ది వాల్ స్ట్రీట్ జర్నల్ పత్రికకు చెందిన జర్నలిస్ట్ డేనియల్ పెర్ల్. విధి నిర్వహణలో భాగంగా ఆయన పాకిస్తాన్ కి వచ్చారు. అప్పటికే ఉగ్రవాదులు పాకిస్తాన్ లోని చాలామంది జర్నలిస్ట్ లను టార్గెట్ చేశారు. పాక్ లో ఉగ్రమూలాలపై జర్నలిస్ట్ లు ఇస్తున్న కథనాలు ప్రపంచానికి ఆ దేశాన్ని ఒక ఉగ్రవాద దేశంగా పరిచయం చేస్తున్నాయి. దీంతో ప్రపంచ దేశాలన్నీ పాక్ ని అసహ్యించుకునే పరిస్థితి. అందుకే ఉగ్రవాదులు.. జర్నలిస్ట్ లను టార్గెట్ చేశారు. తమ ఉనికి బయటకు రాకుండా ఉండాలని భావించారు. ఈ క్రమంలో వాల్ స్ట్రీట్ జర్నల్ కి చెందిన జర్నలిస్ట్ డేనియల్ పెర్ల్ ని వారు కిడ్నాప్ చేశారు. 2002లో కరాచీలో ఈ కిడ్నాప్ జరిగింది. ఆ తర్వాత అతడిని దారుణంగా హత్యచేశారు. ఆ హత్యకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు వారే కావాలని బయటపెట్టారు. ప్రపంచ వ్యాప్తంగా మీడియాని భయభ్రాంతులకు గురి చేయాలనుకున్నారు. అప్పట్లో ఈ కిడ్నాప్, హత్య ప్రపంచ వ్యాప్తంగా సంచలనంగా మారాయి.
ఉగ్రవాదుల చేతుల్లో దారుణ హత్యకు గురైన యువ జర్నలిస్ట్ డేనియల్ పెర్ల్ తండ్రి జూడియా పెర్ల్.. ఇప్పుడు ఒక ఆవేదనతో కూడిన ట్వీట్ వేశారు. తన కొడుకు మరణానికి కారణం జైష్-ఎ-మొహమ్మద్ ఉగ్రవాద సంస్థకు చెందిన కీలక స్థావరాలపై భారత సైన్యం దాడి చేయడంపై ఆయన సంతోషం వ్యక్తం చేశారు. ఆపరేషన్ సిందూర్ ద్వారా భారత్ ఉగ్రవాద శిబిరాలను పేల్చివేసింది. ఈ ఘటనలో జైష్-ఎ-మొహమ్మద్ కమాండర్ అబ్దుల్ రౌఫ్ అజార్ చనిపోయాడు. అతడితోపాటు మరికొన్ని ఇతర ఉగ్రవాద సంస్థలకు చెందిన కీలక నేతలు కూడా హతమయ్యారు. భారత సైన్యం చేపట్టిన ఆపరేషన్ సిందూర్.. ఉగ్రవాదుల దాడుల్లో చనిపోయిన సామాన్యుల ఆత్మలకు శాంతిని చేకూర్చింది. వారి కుటుంబ సభ్యులకు సాంత్వననిచ్చింది. అయితే ఉగ్రమూక చనిపోయిన తర్వాత పాకిస్తాన్ సైన్యం వైఖరి మాత్రం తీవ్ర విమర్శలకు దారితీసింది. ఉగ్రవాదుల అంత్యక్రియలకు పాక్ సైనికాధికారులు హాజరయ్యారు. అధికారిక లాంఛనాలతో వారి అంత్యక్రియలు జరిగేందుకు సహకరించారు.
ఉగ్రవాదులు అరాచకశక్తులు. వారి వల్ల ఏదేశానికైనా ప్రమాదమే. ఒకవేళ తమకు ప్రమాదం లేదు అని ఏ దేశమైనా అనుకుంటే అంతకంటే మూర్ఖత్వం ఇంకోటి ఉండదు. కానీ పాకిస్తాన్ మాత్రం ఉగ్రవాదుల్ని వెనకేసుకు వస్తోంది. వారిని పెంచిపోషిస్తోంది. ఉగ్రవాదులకు పాకిస్తాన్ సైన్యం మద్దతు ఉందనే విషయం బహిరంగ రహస్యం. అయితే ఇన్నాళ్లూ తాము కూడా ఉగ్రవాదానికి వ్యతిరేకం అని చెప్పుకున్న పాకిస్తాన్, ఇప్పుడు మాత్రం ముసుగు తీసేసి తన అసలు రంగు బయపెట్టుకుంది. ఈ వైఖరిని ప్రపంచ దేశాలన్నీ ఖండిస్తున్నాయి. ముఖ్యంగా ఉగ్రవాదుల దాడుల్లో హతమైన వారి కుటుంబ సభ్యులు పాకిస్తాన్ వైఖరిని ఎండగడుతున్నారు. జర్నలిస్ట్ డేనియల్ పెర్ల్ తండ్రి జూడియా పెర్ల్ కూడా ఇదే విషయమై సోషల్ మీడియా ద్వారా తన ఆవేదన వ్యక్తం చేశారు. పాక్ సైన్యం చర్యల్ని ఆయన తీవ్రంగా ఖండించారు. ఉగ్రవాదుల్ని వారు దేశభక్తులుగా చూపాలనుకుంటున్నారా..? అసలుపాకిస్తాన్ సైన్యం ఎందుకు బాధపడుతోంది..? ఉగ్రవాదులు చనిపోయారనా..? అనిప్రశ్నించారు. ఇలాంటి చర్యల వల్ల తమ పిల్లలకు సైనికాధికారులు ఎలాంటి సందేశం ఇవ్వాలనుకుంటున్నారని మండిపడ్డారు డేనియల్ పెర్ల్.