Kartarpur Corridor: ఉత్తరాదిలో భారీ వర్షాలు బీభత్సం సృష్టిస్తున్నాయి. భారీ నదులు పొంగి ప్రవహిస్తున్నాయి. ముఖ్యంగా భారత్-పాకిస్థాన్‌కు కీలకమైన రావి నది ప్రమాదకర స్థాయిలో పొంగి ప్రవహిస్తోంది. గురుద్వార్ దర్బార్ సాహిబ్‌తో సహా కర్తార్‌పూర్ కారిడార్ కాంప్లెక్స్ వరద నీటిలో మునిగిపోయింది. ఈ విషయాన్ని కర్తార్‌పూర్ కారిడార్ ప్రాజెక్ట్ మేనేజ్‌మెంట్ యూనిట్ అధిపతి సైఫుల్లా ఖోఖర్ తెలిపారు. వరదల్లో చిక్కుకుపోయినవారిలో ఎక్కువ మంది కర్తార్‌పూర్ ప్రాజెక్ట్ ఉద్యోగులు ఉన్నారు.
పాకిస్తాన్‌లోని గురుద్వార్ దర్బార్ సాహిబ్- భారత్‌లో డేరా బాబా నానక్ మందిరానికి కలిపేది కర్తార్‌పూర్ కారిడార్. భారీ వర్షాల కారణంగా ఆ ప్రాంతం వరదలకు గురైంది. వర్షాల కారణంగా రావి నదిలోకి భారీగా నీరు విడుదలైంది. నీటి మట్టాలు అకస్మాత్తుగా పెరగడంతో చుట్టుపక్కల ప్రాంతాలు నీట మునిగిపోయాయి.
కారిడార్ మౌలిక సదుపాయాలు, సమీపంలో వారసత్వ ప్రదేశాలు రెండింటికీ నష్టం వాటిల్లుతుందనే ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. గురునానక్ అంతిమ యాత్ర స్థలం. అంతేకాదు సిక్కులకు ప్రధానమైన తీర్థయాత్ర స్థలం కూడా. భారత్‌లోని పంజాబ్‌లో గురుదాస్‌పూర్ జిల్లాలోని అనేక సరిహద్దు గ్రామాలు గతరాత్రి కారిడార్ సమీపంలో ధుస్సీ కట్ విరిగిపోవడంతో నీటి ప్రవాహం ముంచెత్తింది.
కూలిపోయిన కట్ట వల్ల రావి నది, డేరా బాబా నానక్ ప్రాంతాల్లోని చుట్టుపక్కలున్న అనేక గ్రామాలలోకి వరద నీరు వచ్చింది. దీంతో వేలాది ఎకరాల వ్యవసాయ భూములు నీటిలో మునిగిపోయాయి. డేరా బాబా నానక్ పట్టణంలో ఇళ్లలోకి వరద నీరు చేరింది. రాత్రిపూట కురిసిన వరదల కారణంగా అప్రమత్తంగా లేని నివాసితులు అత్యవసరంగా సహాయం కోసం విజ్ఞప్తి చేస్తున్నారు.
ALSO READ: మిలియాపొలిస్‌లో రక్తపాతం.. చర్చి స్కూల్ పై రైఫిల్ దాడి
వరదల కారణంగా పాకిస్తాన్‌లో ఇప్పటివరకు 802 మంది మరణించారు. 1000 మందికి పైగా గాయపడ్డారు. వరదల తీవ్రత దృష్ట్యా పంజాబ్ ప్రావిన్స్ నుండి వేలాది మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. పరిస్థితి జఠిలంగా ఉండడంతో సైన్యం రంగంలోకి దిగింది.
పంజాబ్ ప్రావిన్స్‌లో వరద ప్రభావిత ప్రాంతాల్లో పాఠశాలలను నిరవధికంగా మూసివేస్తున్నట్లు ప్రకటించారు అధికారులు. సియాల్‌కోట్, నరోవాల్, గుజరాత్, పస్రూర్‌లలో అన్ని ప్రభుత్వ మరియు ప్రైవేట్ పాఠశాలలు సెలవులు ప్రకటించారు.
భారతదేశం-పాకిస్తాన్ సరిహద్దు వెంబడి ప్రవహించే రావి, బియాస్, సట్లేజ్ నదులు సంక్షోభానికి కేంద్ర బిందువుగా మారాయి. పంజాబ్, హిమాచల్ ప్రదేశ్, జమ్మూ కాశ్మీర్‌లో వాటి పరివాహక ప్రాంతాల్లో భారీ వర్షాలు కారణంగా ఆయా నదులు అమాంతంగా పొంగి ప్రవహిస్తున్నాయి.
करतारपुर साहिब पूरी तरह पानी में डूबा, गुरुद्वारा परिसर में 5 फीट तक पानी भरा….#KartarpurSahib #KartarpurCorridor #kartarpursahibcorridor #PakistanFloods #LatestNews #Nedricknews pic.twitter.com/79rPJb63Yc
— Nedrick News (@nedricknews) August 27, 2025