Los Angeles Wildfire | అమెరికాలోని లాస్ ఏంజెలెస్‌లో కార్చిచ్చు మరోసారి భారీ బీభత్సాన్ని సృష్టిస్తోంది. కాస్టాయిక్ లేక్ సమీపంలో ఇటీవల చెలరేగిన మంటలు ఇంకా శాంతించకముందే, తాజాగా మరో ప్రాంతంలో మంటలు చెలరేగాయి. దీని వల్ల దక్షిణ కాలిఫోర్నియాలో ప్రజలు మరోసారి ఆందోళనకు గురవుతున్నారు. కాస్టాయిక్ లేక్ సమీపంలోని కొండ ప్రాంతాల్లో మొదలైన ఈ మంటలు కొన్ని గంటల వ్యవధిలోనే 8 వేల ఎకరాలకు పైగా వ్యాపించాయి.
మంటలు వ్యాపించిన ప్రాంతాలు
బుధవారం ఉదయం (అమెరికా కాలమానం ప్రకారం) కాస్టాయిక్ లేక్ సమీపంలో మొదలైన మంటలు కేవలం కొన్ని గంటల్లోనే 39 చదరపు కిలోమీటర్ల ప్రాంతంలోని చెట్లను, పొదలను బూడిద చేశాయి. ఇటీవలి కాలంలో అగ్నికి ఆహుతైన పాలిసేడ్స్, ఏటాన్ ప్రాంతాలకు ఈ కొత్త మంటలు కేవలం 64 కిలోమీటర్ల దూరంలోనే ఉన్నాయి. దక్షిణ కాలిఫోర్నియా నుంచి వీస్తున్న బలమైన గాలులు.. మంటల వ్యాప్తిని మరింత ప్రమాదకరంగా మార్చాయి.
ప్రభావిత ప్రాంతాలు ఖాళీ చేయాలని ఆదేశాలు
మంటల తీవ్రత దృష్ట్యా ప్రభావిత ప్రాంతాల్లో నివాసం ఉండే దాదాపు 50 వేల మందికి పైగా ప్రజలు తమ ఇళ్లను ఖాళీ చేయాలని అధికారులు ఆదేశించారు. ప్రస్తుతం గంటకు 67 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తుండగా, ఈ వేగం మరింత పెరిగి 96 కిలోమీటర్ల వరకు చేరవచ్చని అంచనా వేస్తున్నారు. విమానాల ద్వారా వాటర్ బాంబులను జారవిడుస్తూ మంటలను అదుపు చేసేందుకు ప్రయత్నిస్తున్నారు.
ఇటీవలి కాలంలో లాస్ ఏంజెలెస్‌లోని హాలీవుడ్ సహా పలు ప్రాంతాల్లో ఘోర కార్చిచ్చు ఘటనలు చోటుచేసుకున్నాయి. 14 వేల నిర్మాణాలు దగ్ధమవగా, 28 మంది ప్రాణాలు కోల్పోయారు. పాలిసేడ్స్, ఏటాన్ ప్రాంతాల్లో మంటలు ఇంకా పూర్తిగా ఆరిపోలేదని అధికారులు తెలిపారు. అయితే, బలమైన గాలుల కారణంగా మంటలు మళ్లీ తీవ్రమవుతున్నాయి.
నూతన సంవత్సర వేడుకల కారణమా?
ఈ కార్చిచ్చు చెలరేగడానికి నూతన సంవత్సర వేడుకల సమయంలో కాల్చిన బాణాసంచా కారణమని వాషింగ్టన్ పోస్ట్ ఒక కథనంలో పేర్కొంది. బాణాసంచా వల్ల మొదలైన మంటలు గాలుల కారణంగా వేగంగా వ్యాపించాయని రిపోర్ట్ పేర్కొంది.
దొంగల తాకిడి
కార్చిచ్చు వల్ల ప్రజలు ఇళ్లు ఖాళీ చేయడం ప్రారంభించడంతో, దొంగలు చెలరేగిపోతున్నారు. పాలిసేడ్స్ సహా ఇతర ప్రాంతాల్లో ఖాళీ ఇళ్లలో చోరీలు జరుగుతుండటంతో, నేషనల్ గార్డ్స్‌ను మోహరించారు. ఇప్పటివరకు 29 మంది దొంగలను అరెస్టు చేసినట్లు అధికారులు వెల్లడించారు.
మంటల అదుపు కోసం ప్రయత్నాలు
మంటలను అదుపు చేసేందుకు అగ్నిమాపక సిబ్బంది ఫోస్ చెక్ అనే రసాయనంతో కూడిన ద్రవాన్ని హెలికాఫ్టర్ల సహాయంతో వ్యాపిస్తున్న ప్రాంతాల్లో చల్లుతున్నారు. ఈ పదార్థం గులాబి రంగులో ఉండి మంటల వ్యాప్తిని తగ్గిస్తుందని అధికారులు తెలిపారు.
మృతుల సంఖ్య పెరుగుతోంది
ఈ కార్చిచ్చు కారణంగా ఇప్పటివరకు 28 మంది ప్రాణాలు కోల్పోయారు. ఏటాన్‌లో 18 మంది, పాలిసేడ్స్‌లో 10 మంది మరణించారని సమాచారం. లాస్ ఏంజెలెస్‌లో జరిగిన ఈ ఘోర ఘటన ప్రజలను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. మంటలను అదుపులోకి తెచ్చేందుకు ప్రయత్నాలు కొనసాగుతున్నాయి.