Singer Monali Thakur : “సవార్ లూన్”, “మోహ్ మోహ్ కే ధాగే” వంటి హిట్స్ తో పాపులర్ అయిన సింగర్ మోనాలీ ఠాకూర్ (Singer Monali Thakur). తాజాగా ఆమె లైవ్ పర్ఫార్మెన్స్ ఇస్తూ, మధ్యలోనే స్టేజ్ దిగి, ఆసుపత్రికి పరుగులు తీసింది. దీంతో కాన్సర్ట్ లో ఉన్న అభిమానులు గందరగోళంలో పడ్డారు. తరువాత అనారోగ్యం కారణంగా ఆమె హాస్పిటల్ లో అడ్మిట్ అయినట్టు తెలిసింది.
అనారోగ్యంతో హాస్పిటల్ లో…
పశ్చిమ బెంగాల్ లోని కూచ్ బెహార్‌లో జరిగిన దిన్ హటా ఫెస్టివల్‌లో లైవ్ పర్ఫార్మెన్స్ సందర్భంగా సింగర్ మోనాలీ ఠాకూర్ (Singer Monali Thakur) తీవ్రమైన శ్వాసకోశ ఇబ్బందులతో ఆసుపత్రిలో చేరింది. సమాచారం ప్రకారం మోనాలీ ఫెస్టివల్‌లో పర్ఫార్మెన్స్ ఇస్తుండగా, ఆమె అకస్మాత్తుగా శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది పడింది. ఆమె ఆరోగ్యం పరిస్థితి ఏమాత్రం బాగా లేకపోవడంతో లైవ్ ను మధ్యలోనే ఆపేయాల్సి వచ్చిందని తెలుస్తోంది. అంతలోనే ఆమె టీం వైద్య సహాయం కోసం అంబులెన్స్ కు కాల్ చేసింది.
నిమిషాల వ్యవధిలో అంబులెన్స్ వేదిక వద్దకు చేరుకోగా, మోనాలీ (Singer Monali Thakur)ని కూచ్ బెహార్‌లోని ఒక ప్రైవేట్ హెల్త్‌కేర్ ఫెసిలిటీ అయిన దిన్హాటా సబ్-డిస్ట్రిక్ట్ హాస్పిటల్‌కు తరలించారు. ఆ తరువాత అక్కడి నుంచి మరో ప్రైవేట్ ఆసుపత్రికి ఆమెను తీసుకెళ్లినట్టు సమాచారం. ఆమె ఇప్పుడు ఏ ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది అన్న విషయం ఇంకా తెలియరాలేదు. అలాగే ఈ సింగర్ తన ఆరోగ్యంపై సోషల్ మీడియా ద్వారా ఇంకా అప్‌డేట్‌ను షేర్ చేయలేదు. మోనాలీ ‘ట్యూనే మారి ఎంట్రీయన్’ పాటను పాడుతున్నప్పుడు ఘటన చోటు చేసుకుంది. ఆమె త్వరగా కోలుకోవాలని కోరుతున్నారు అభిమానులు.
ఇదే మొదటిసారి కాదు
గత ఏడాది డిసెంబర్‌లో కూడా లైవ్ ను మధ్యలో ఆపేసింది మోనాలి (Singer Monali Thakur). ఉత్తరప్రదేశ్ లోని వారణాసిలో ఈవెంట్ నిర్వాహకుల నిర్వహణ, మౌలిక సదుపాయాలు సరిగ్గా లేకపోవడంతో మోనాలీ వేదికపై నుండి మధ్యలోనే వెళ్ళిపోవడం సంచలనంగా మారింది. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట్లో కూడా వైరల్ గా మారింది.
తర్వాత ఈవెంట్ నిర్వాహకులు మోనాలీ, ఆమె బృందం వేధింపులకు పాల్పడ్డారని ఆరోపించారు. దీంతో ఆ ఆరోపణలపై మోనాలీ స్పందిస్తూ ఇన్‌స్టాగ్రామ్ లో షాకింగ్ పోస్ట్ పెట్టారు. ఈవెంట్ నిర్వాహకులు చేసిన తప్పులను ఎత్తి చూపుతూ, తన టీం పట్ల అసభ్యంగా ప్రవర్తించారని వెల్లడించింది. ఆమె పోస్ట్‌లో “ఆర్టిస్ట్ అయినా, మేనేజర్లు లేదా కోఆర్డినేటర్ ఎవరైనా కావచ్చు. కానీ తెర వెనుక పని చేసే వారిని అగౌరవపరచడం, వేధించడం కరెక్ట్ కాదు” అంటూ రాసుకొచ్చింది మోనాలి.
ఇప్పుడు స్విట్జర్లాండ్‌లో నివసిస్తున్న మోనాలీ ఠాకూర్ (Singer Monali Thakur) భారతీయ మ్యూజిక్ ప్రపంచంలో మంచి పాపులారిటీతో దూసుకెళ్తోంది. కర్లే ప్యార్ కర్లే, చామ్ చామ్, బద్రీ కి దుల్హనియా వంటి హిట్ సాంగ్స్ ఆమె ఖాతాలో ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే ప్రపంచవ్యాప్తంగా ఉన్న అభిమానులు ఆమె త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నారు.