67 అంతస్తుల భవనం
అందులో 764 అపార్ట్‌మెంట్లు
వాటిలో 3,820 మంది నివాసం
అలాంటి భవనంలో అగ్ని ప్రమాదం జరిగితే పరిస్థితి ఎంత ఘోరంగా ఉంటుందో ఊహించుకోండి. కానీ ఒక్కటంటే ఒక్క ప్రాణం కూడా పోలేదు. అగ్ని ప్రమాదం వల్ల ఆస్తినష్టం జరిగింది కానీ, ప్రాణ నష్టం లేదు. అంత సమర్థంగా పనిచేశాయి దుబాయ్ సివిల్ డిఫెన్స్ బృందాలు. దాదాపు ఆరు గంటలపాటు అవిశ్రాంతంగా శ్రమించి మంటల్ని అదుపులోకి తీసుకొచ్చారు ఫైర్ ఫైటర్స్. స్థానికులు వారిని అభినందించారు.
దుబాయ్ మెరీనాలోని 67 అంతస్తుల భవనంలో ఈ అగ్నిప్రమాదం జరిగింది. ప్రమాదానికి గల కారణాలు తెలియలేదు కానీ, శుక్రవారం రాత్రి భారీ అగ్నిప్రమాదం జరిగింది. దీంతో వెంటనే అక్కడి సివిల్ డిఫెన్స్ బృందాలకు సమాచారమిచ్చారు స్థానికులు వారు రంగంలోకి దిగారు. అగ్నిమాపక యంత్రాలతో అక్కడకు చేరుకున్నారు. మంటల్ని అదుపులోకి తేవడం కంటే ముందు అక్కడ ఉన్న బాధితుల్ని బయటకు తెచ్చే ప్రయత్నం చేశారు. ఆ పనిలో వారు సక్సెస్ అయ్యారు. మొత్తం 764 అపార్ట్‌మెంట్‌ల నుండి 3,820 మందిని సురక్షితంగా తరలించారు. ఆపరేషన్ సక్సెస్ ఫుల్ గా జరిగింది, ప్రత్యేక బృందాలు ప్రతి ఒక్కరినీ భవనం నుండి సురక్షితంగా బయటకు తీసుకొచ్చాయి. వారంతా అగ్నిమాపక సిబ్బందికి కృతజ్ఞతలు తెలిపారు.
🚨Dubai skyscraper engulfed in a massive fire, nearly 4,000 people evacuated from the building.
Fortunately, there were no casualties. Rescue teams responded quickly. pic.twitter.com/fogzQrvU1G
— Neetu Khandelwal (@T_Investor_) June 14, 2025
మంటల్ని కూడా వెంటనే అదుపులోకి తీసుకొచ్చారు. శుక్రవారం రాత్రి నుంచి శనివారం తెల్లవారు ఝాము వరకు వారు శ్రమిస్తూనే ఉన్నారు. మంటలు అదుపులోకి వచ్చిన తర్వాత కూడా ఆ ప్రాంతం ఇంకా పొగల మధ్య చిక్కుకుని ఉంది. లగ్జరీ అపార్ట్ మెంట్లలో ఉన్న ఫర్నిచర్ అంతా బూడిదైపోయింది. ఆ ప్రదేశంలో పొగల అలముకోవడంతో రవాణాకు అంతరాయం ఏర్పడింది. బాధితులకు ప్రభుత్వం తాత్కాలిక నివాస ఏర్పాట్లు చేస్తోంది. వారి రోజువారీ కార్యకలాపాలకోసం ప్రభుత్వం సహాయం చేస్తుందని అంటున్నారు.
మెరీనా ప్రాంతంలోని భవనంలో అగ్నిప్రమాదం జరగడంతో.. దుబాయ్‌లో ట్రామ్ సేవలు నిలిచిపోయాయి. అయితే ప్రయాణికులకోసం బస్సు సర్వీసుల్ని ఏర్పాటు చేశారు. మెరీనా స్టేషన్ నుంచి పామ్ జుమైరా స్టేషన్ మధ్య రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. దుబాయ్ లో జరిగిన ప్రమాదం గురించి తెలియగానే.. మెరీనా ప్రాంతానికి సంబంధించిన చాలామంది తమ బంధువులకోసం ఆరా తీశారు. వారికి ఫోన్లు చేసి యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. ప్రమాదం పెద్దది అయినా ఏ ఒక్కరికీ ప్రాణాపాయం లేకపోవడం ఇక్కడ విశేషం. సకాలంలో స్పందించి తమ ప్రాణాలను కాపాడినందుకు దుబాయ్ సివిల్ డిఫెన్స్ బృందాలను ప్రతి ఒక్కరూ అభినందిస్తున్నారు.