Twitter : ట్విట్టర్ ను కొంటానంటూ ముందుకొచ్చి ఆ తర్వాత అనేక ట్విస్టులిచ్చిన టెస్లా అధినేత ఎలాన్ మస్క్… ఎట్టకేలకు డీల్ పూర్తి చేసేందుకే నిర్ణయించుకున్నాడు. ట్విటర్ డీల్ ను రెండ్రోజుల్లో… అంటే కోర్టు గడువు విధించిన అక్టోబర్ 28 నాటికి ముగించేస్తానని… మస్క్ బ్యాంకర్లతో చెప్పాడు. డీల్ పూర్తి చేసేందుకు కావాల్సిన నిధులను సమకూర్చే బ్యాంకర్లతో వీడియో కాన్ఫరెన్స్‌లో మాట్లాడిన మస్క్… ట్విట్టర్ ను కొంటానని తేల్చిచెప్పాడు.
మొత్తం 44 బిలియన్ డాలర్లకు ట్విట్టర్ కొంటానన్న మస్క్… 13 బిలియన్ డాలర్లను బ్యాంకుల నుంచి సమకూర్చుకుంటున్నాడు. నిధులు ఇచ్చే బ్యాంకులతో ఒప్పందాలపై చర్చలు కూడా జరిపాడు. ప్రస్తుతం ఈ ప్రక్రియ తుది దశకు వచ్చిందని చెబుతున్నారు. నిధులకు సంబంధించిన పేపర్లపై మస్క్ సంతకం చేయడమే ఇక మిగిలి ఉందని… ఆయన ఖాతాల్లోకి నిధులు వచ్చి పడతాయని సమాచారం.
ట్విట్టర్ డీల్ ను పూర్తి చేసేందుకు మస్క్ కు నిధులిస్తున్న బ్యాంకర్లలో మోర్గాన్ స్టాన్లీ, బ్యాంక్ ఆఫ్ అమెరికా, బార్‌క్లేస్, ఎంయూఎఫ్‌జీ, బీఎన్‌పీ పారిబస్, మిజుహో, సోషియేట్ జనరల్ వంటి ప్రముఖ సంస్థలు ఉన్నట్లు గతంలో బ్లూమ్‌బెర్గ్ వెల్లడించింది. అయితే, డీల్ విషయంలో మస్క్ ఇచ్చిన ట్విస్టులకు గందరగోళంలో పడిపోయిన బ్యాంకర్లు… ఇప్పుడు ఆయన నుంచి స్పష్టత తీసుకున్నారు. నిధులు బదిలీ అయితే… శుక్రవారాని కల్లా ట్విట్టర్ పిట్ట మస్క్ చేతిలోకి వస్తుందన్నమాట.