Techies fear Recession Again : కరోనా కారణంగా రెండేళ్లకు పైగా ఇంటి నుంచే పని చేస్తూ కాలం నెట్టుకొచ్చిన సాఫ్ట్ వేర్ ఇంజనీర్లలో… మళ్లీ భయాలు మొదలయ్యాయి. ప్రస్తుత పరిస్థితుల్లో చాలా MNCలు ఉద్యోగుల్ని తొలగించబోతున్నాయనే సంకేతాలు… టెక్కీలను కలవరపెడుతున్నాయి. ఇప్పటికే ఫేస్‌బుక్ ఆధ్వర్యంలోని మెటా సంస్థ… పనితీరు ప్రతిపాదికగా 12 వేల మందిని తొలగించబోతున్నట్లు ప్రకటించింది. దాదాపు లక్షా 15 వేల మంది ఉద్యోగులు ఉన్న ఇంటెల్ సంస్థ… అంతర్జాతీయంగా 20 శాతం మంది ఉద్యోగులను తొలగించేందుకు సిద్ధమవుతోందని ప్రచారం జరుగుతోంది. ఇక దేశంలోనూ… ప్రముఖ ఎడ్‌టెక్ సంస్థ బైజూస్ రెండున్నర వేల మంది ఉద్యోగుల్ని తొలగిస్తున్నట్లు ప్రకటించింది. గూగుల్ కూడా ఆదాయం తగ్గడంతో ఈ ఏడాది నియామకాల్లో కోత విధించింది.
ఉద్యోగుల తొలగింపే కాదు.. క్యాంపస్ ఇంటర్వ్యూల్లో కొందరు విద్యార్థులను ఎంపిక చేసుకుని ఆఫర్ లెటర్లు కూడా ఇచ్చిన కొన్ని కంపెనీలు… జాయినింగ్ లెటర్ ఇవ్వడంలో తీవ్ర జాప్యం చేస్తున్నాయి. మరికొన్ని కంపెనీలు అయితే… ఆఫర్ లెటర్స్ ఇచ్చిన వారికి, ఆ ఆఫర్‌ను తిరస్కరిస్తున్నామని సమాచారం కూడా ఇస్తున్నాయి. తమ సంస్థ ప్రమాణాలకు అనుగుణంగా అర్హతలు లేవనో… ప్రొఫైల్ సర్టిఫికేషన్ పూర్తి చేయలేదనో సాకు చెప్పి ఉద్యోగం ఇవ్వకుండా తప్పించుకుంటున్నాయి. దాంతో… క్యాంపస్ ఇంటర్వ్యూల్లో తమ ప్రతిభను చూసి ఎంపిక చేసుకుని ఆఫర్ లెటర్లు ఇచ్చిన సంస్థలు… ఇప్పుడు ఉద్యోగం లేదనడం ఏంటని అభ్యర్థులు ప్రశ్నిస్తున్నారు.
అమెరికాలో ఆర్థిక మాంద్యం తలెత్తవచ్చనే భయాలే ఐటీలో ఆన్‌బోర్డింగ్ ఆలస్యానికి కారణమని చెబుతున్నారు. మన దేశంలో ఎక్కువ సంస్థలు అమెరికా కంపెనీలకు ఔట్ సోర్సింగ్ విధానంలో సేవలందిస్తున్నాయి. అమెరికా మాంద్యం ముంగిట నిలిచిందనే వార్తలతో… అక్కడి కంపెనీల్లో కార్యకలాపాలు మందగిస్తున్నాయి. దాంతో కంపెనీలు కొత్త ప్రాజెక్ట్‌ల విషయంలో ఆచితూచి అడుగులు వేస్తున్నాయి. ఆ ఎఫెక్ట్ మన ఐటీ కంపెనీలపై పడుతోంది. అందుకే ఆఫర్ లెటర్లు ఇచ్చినా… ఉద్యోగాలు ఇవ్వడం లేదంటున్నారు. రష్యా–ఉక్రెయిన్ యుద్ధ ప్రభావం, అంతర్జాతీయ పరిణామాలతో కొత్త ప్రాజెక్ట్‌లు రావడం కష్టంగా మారిందని… ఆన్ బోర్డింగ్ ఆలస్యానికి ఇది మరో కారణమని చెబుతున్నారు.