Net Flix : ఓవర్-ది-టాప్ (OTT) స్ట్రీమింగ్ సేవలందించే నెట్‌ఫ్లిక్స్ సంస్థ తొలిసారిగా తమ యూజర్లు ఎన్ని గంటల పాటు కంటెంట్‌ను తిలకించారనే వివరాలను వెల్లడించింది. నెట్‌ఫ్లిక్స్ యూజర్లు జనవరి-జూన్ నెలల మధ్య 18 వేల టైటిళ్లను వీక్షించగా.. ఆ డేటాను బయటపెట్టింది.
ఇకపై ప్రతి ఆరునెలలకు ఈ నివేదికను విడుదల చేస్తామని ప్రకటించింది. ఈ ఏడాది తొలి ఆరునెలల్లో ‘ది నైట్ ఏజెంట్’ను యూజర్లు అత్యధిక సమయం చూశారు. ఈ పొలిటికల్ థ్రిల్లర్ షోను 812 మిలియన్ల గంటల పాటు తిలకించారు. తొలి ఆరు నెలల్లో దాదాపు 100 బిలియన్ల గంటల పాటు నెట్‌ఫ్లిక్స్ షోలను చూసినట్టు ఆ నివేదిక స్పష్టం చేస్తోంది.
గిన్నీ అండ్ జార్జియా, గిల్మా గర్ల్స్, సైన్‌ఫెల్డ్, ఫ్రెండ్స్ అండ్ ది ఆఫీస్ తదితర షోలకూ ఆదరణ బాగానే లభించింది. జెనిఫ లోపెజ్ నటించిన ‘మదర్’ను 249 మిలియన్ గంటల కన్నా ఎక్కువ సమయమే వీక్షించారు.
నెట్‌ఫ్లిక్స్‌లో ప్రదర్శించిన సినిమాల్లో ఇదే టాప్‌లో నిలిచింది. మూవీలు, టీవీ షోలకు యూజర్ల నుంచి ఎక్కువ ఆదరణ లభిస్తోందని కంపెనీ వెల్లడించింది. ప్రపంచవ్యాప్తంగా 250 మిలియన్ల మంది యూజర్లతో అతి పెద్ద స్ట్రీమింగ్ సంస్థగా నెట్‌ఫ్లిక్స్ సంస్థ రికార్డులకి ఎక్కింది.