Ukraine War Korea Soldiers| రష్యా, ఉక్రెయిన్ మధ్య జరుగుతున్న యుద్ధంలో ఒక కీలక పరిణామం చోటుచేసుకుంది. ఉక్రెయిన్ అధికారులు, యుద్ధంలో పాల్గొన్న ఉత్తర కొరియా సైనికులు ఇప్పుడు కనిపించడం లేదని మరియు వారు తమ దేశానికి వెనుతిరిగుతున్నట్లు తెలిపారు. ఉక్రెయిన్ సైన్యాధికారుల ప్రకారం.. ఉత్తర కొరియా సైనికులు ఉక్రెయిన్ దళాలతో పోరాడలేక వెనుతిరిగారు. ఈ క్రమంలో తాము పైచేయి సాధించినట్లు ఉక్రెయిన్ సైన్యాధికారులు ప్రకటించారు.
ఉక్రెయిన్ స్పెషల్ ఆపరేషన్ ఫోర్సెస్ ప్రతినిధి ఒలెక్సాండర్ కిండ్రాటెంకో ఇటీవల మాట్లాడుతూ, “గత మూడు వారాలుగా మాతో యుద్ధంలో పాల్గొన్న ఉత్తర కొరియా సైనికుల కార్యకలాపాలను గుర్తించలేదు. మా సైనికుల చేతిలో ఓడిపోయి భారీ నష్టాలు చవిచూడటంతో వారు వెనుతిరిగినట్లు విశ్వసిస్తున్నాం. ఉత్తర కొరియా సైనికులు ఎక్కడా కనిపించడం లేదు” అని తెలిపారు.
ఇక, ఉక్రెయిన్-రష్యా యుద్ధంలో రష్యాకు మద్దతుగా ఉత్తర కొరియా సైన్యం పోరాడుతున్న విషయం తెలిసిందే. దాదాపు 11 వేల మంది ఉత్తర కొరియా సైనికులు యుద్దంలో రష్యాకు సహాయం చేస్తున్నారు. ప్రత్యేక శిక్షణ తర్వాత వీరిని యుద్ధరంగంలోకి పంపినప్పటికీ, రష్యా, ఉత్తర కొరియా సైనికుల మధ్య భాషా సమస్య కారణంగా సమన్వయం లోపించింది. ఈ క్రమంలోనే ఉత్తర కొరియా సైనికులు ఉక్రెయిన్ దళాల చేతిలో మృతి చెందుతున్నారని ఉక్రెయిన్ ప్రకటించింది.
Also Read: వంద శాతం సుంకాలు.. ఇండియా సహా బ్రిక్స్ దేశాలకు ట్రంప్ వార్నింగ్..
మరోవైపు, ఉక్రెయిన్ అధికారుల వ్యాఖ్యలపై రష్యా ప్రతినిధి దిమిత్రి పెస్కొవ్ తీవ్ర స్పందించారు. ఆయన మాట్లాడుతూ, “ఉక్రెయిన్ అధికారులు చెప్పిన వ్యాఖ్యల్లో నిజం లేదు. దీనిలో భిన్నమైన వాదనలు ఉన్నాయి. ప్రతిసారీ వివరించలేం” అని తెలిపారు.
ట్రంప్ శాంతి ప్రయత్నాలు
ఇదే సమయంలో, డొనాల్డ్ ట్రంప్ అమెరికా అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఉక్రెయిన్-రష్యా యుద్ధానికి ముగింపు పలుకుతానని చెప్పారు. అనంతరం, యుద్ధాన్ని ఆపేందుకు ఇరు దేశాల అధ్యక్షులు శాంతి చర్చలకు ముందుకు రావాలని కోరారు. ఈ చర్చలకు రష్యా నిరాకరిస్తే వారిపై ఆంక్షలు విధిస్తానని ట్రంప్ హెచ్చరించారు. ఈ నేపథ్యంలో రష్యా అధ్యక్షుడు పుతిన్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనేది ఆసక్తికరంగా మారింది.
జెలెన్స్కీ శాంతి చర్చలకు సిద్ధమని ప్రకటన
ఉక్రెయిన్ అధ్యక్షుడు వలోడిమిర్ జెలెన్స్కీ, యుద్ధాన్ని ఆపేందుకు తాము శాంతి చర్చలకు సిద్ధమని ప్రకటించారు. అయితే, ఈ చర్చలకు రష్యా అధ్యక్షుడు పుతిన్ ముందుకు రావడం లేదని ఆయన విమర్శించారు. “బలమైన నాయకులు అన్నా, చర్చలన్నా పుతిన్ భయపడతారు” అని జెలెన్స్కీ తీవ్రంగా వ్యాఖ్యానించారు. మూడేళ్లుగా జరుగుతున్న ఈ యుద్ధానికి ముగింపు పలుకుతానని చెప్పిన జెలెన్స్కీ, పుతిన్ తనతో చర్చలను తోసిపుచ్చడం వల్ల ఈ పరిస్థితి తేలిపోయిందని సోషల్ మీడియాలో పోస్ట్ ద్వారా తెలిపారు.
జెలెన్స్కీతో శాంతి చర్చలు అసాధ్యం
మరోవైపు, రష్యా అధ్యక్షుడు పుతిన్, ఉక్రెయిన్-రష్యా మధ్య శాంతిని నెలకొల్పే చర్చలు సాధ్యమేనని పేర్కొన్నారు. అయితే జెలెన్స్కీతో ఈ చర్చలు సాధ్యం కావని వ్యాఖ్యానించారు. “చర్చలు జరిపి, రాజీ పడాలనే కోరిక ఉంటే మేము సిద్ధంగా ఉన్నాము. కానీ, జెలెన్స్కీతో ఈ చర్చలు సాగవు. మా ప్రయోజనాలకు అనుగుణంగానే మేము ప్రయత్నిస్తాము” అని పుతిన్ తెలిపారు. పాశ్చాత్య దేశాలు ఉక్రెయిన్కు మద్దతు నిలిపివేస్తే, ఈ యుద్ధం రెండు నెలల్లోనే ముగిసిపోతుందని ఆయన అన్నారు.