Pakistan President Corona positive: పాకిస్తాన్ ప్రెసిడెంట్ ఆసిఫ్ అలా జర్దారీ హాస్పిటల్లో చేరారు. ఆయనకు ప్రత్యేక వైద్యుల బృందం చికిత్సను అందిస్తున్నది. వైద్య పరీక్షల్లో ఆయనకు కరోనా సోకినట్లు వెల్లడి అయ్యింది. ప్రస్తుతం ఆయన ఐసోలేషన్ లో ఉన్నట్లు.. ప్రెసిడెంట్ వ్యక్తిగత వైద్యుడు వెల్లడించారు.
నబాబ్ షా నుంచి ప్రత్యేక విమానంలో కరాచీకి తరలింపు
69 ఏళ్ల ఆసిఫ్ అలీ జర్దారీ నవాబ్ షాలో అస్వస్థతకు గురయ్యారు. వెంటనే, భద్రతా సిబ్బంది ఆయనను ప్రత్యేక విమానంలో కరాచీకి తరలించారు. నవాబ్ షా కరాచీకి సుమారు 300 కి.మీ దూరంలో ఉంటుంది. అక్కడి నుంచి ఆయనను నేరుగా కరాచీలోని హాస్పిటల్ కు తీసుకొచ్చారు. శ్వాసకోశ సమస్యలు, జ్వరం సహా పలు లక్షణాలతో ఆయన ప్రైవేట్ ఆసుపత్రిలో చేరారు. ఈ నేపథ్యంలో ప్రెసిడెంట్ వ్యక్తిగత డాక్టర్ అసిమ్ హుస్సేన్ కీలక విషయాలు వెల్లడించారు. ఆసిఫ్ అలా జర్దారీకి కరోనా వైరస్ సోకినట్లు తెలిపారు. “అనారోగ్య సమస్యలతో ప్రెసిడెంట్ ఆసిఫ్ హాస్పిటల్ లో చేరారు. పలు పరీక్షల తర్వాత ఆయనకు కరోనా సోకినట్లు నిర్ధారణ అయ్యింది. ప్రస్తుతం ఆయనను ఐసోలేషన్ లో ఉంచారు. ప్రత్యేక వైద్యుల బృందం ఆయన ఆరోగ్యాన్ని 24 గంటలు పర్యవేక్షిస్తోంది. నిపుణుల బృందం అధ్యక్షుడికి సరైన చికిత్స అందిస్తున్నది. ఆయన పరిస్థితి మెరుగుపడుతోంది” అని డాక్టర్ అసిమ్ తెలిపారు.
నవాబ్ షాలో రంజాన్ ప్రార్థనలు
ఇక పాక్ మీడియా కథనాల ప్రకారం ఆసిఫ్ అలీ జర్దారీ సోమవారం ఈద్ ప్రార్థనలు చేయడానికి నవాబ్ షాకు వెళ్లారు. దానికి ముందు ఆదివారం నాడు పార్టీ నాయకులతో సమావేశం నిర్వహించారు. ఈ నేపథ్యంలో ఆయనతో దగ్గరగా మెలిగిన వారికి సహితం కరోనా పరీక్షలు నిర్వహిస్తున్నట్లు తెలుస్తోంది.
ఆసిఫ్ అలీకి పలు ఆరోగ్య సమస్యలు
ఆసిఫ్ అలీ జర్దారీ గత కొద్ది సంవత్సరాలుగా పలు ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. 2022 జూలైలో ఆయనకు COVID-19 పాజిటివ్ గా తేలింది. అప్పట్లో ఆయనకు స్వల్ప లక్షణాలు కనిపించాయి. మార్చి 2023లో ఆసిఫ్ అలీ జర్దారీకి యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ లో కంటి శస్త్రచికిత్స జరిగింది. గత ఏడాది అక్టోబర్ లో ఆయన విమానం దిగుతున్న సమయంలో పాదంలో పగుళ్లు ఏర్పడ్డాయి. వైద్య పరీక్షల అనంతరం, ఆయన పాదానికి కాస్ట్ ను అమర్చారు.
Read Also: విశాఖలో రెచ్చిపోయిన ప్రేమోన్మాది దాడి.. తల్లి మృతి, కూతురి పరిస్థితి విషమం
అధ్యక్షుడి ఆరోగ్యం గురించి ప్రధాని ఆరా
పాకిస్తాన్ ప్రధాన మంత్రి షెహబాజ్ షరీఫ్.. అధ్యక్షుడు ఆసిఫ్ అలీ జర్దారీ ఆరోగ్యం గురించి టెలిఫోన్‌లో విచారించారని పాక్ ప్రభుత్వ ఆధ్వర్యంలో నడిచే అసోసియేటెడ్ ప్రెస్ (APP) వార్తా సంస్థ వెల్లడించింది. ఆయన త్వరగా కోలుకోవాలని ఆయన ఆకాంక్షించినట్లు వెల్లడించింది. వైద్యులను అడిగి పూర్తి వివరాలు తెలుసుకోవడంతో పాటు మెరుడైన చికిత్స అందించాలని ఆదేశించినట్లు వివరించింది.
Read Also: దేశంలో మూడో అతి పెద్ద భూస్వామి.. వక్ఫ్ బోర్డుకు ఉన్న ఆస్తులివే, సవరణ బిల్లులో ఏం ఉంది?