Vizag Crime News: విశాఖపట్నంలో దారుణ ఘటన చోటుచేసుకుంది. తల్లి, కూతురిపై ఓ ప్రేమోన్మాది కిరాతకంగా కత్తితో దాడి చేశాడు. విశాఖపట్నంలోని మధురవాడలో జరిగిన ఈ ఘటన ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా కలకలం రేపుతోంది. ప్రేమోన్మాది నవీన్ దాడిలో తల్లి లక్ష్మీ మృతి చెందగా.. కూతురు దీపిక పరిస్థితి విషమంగా ఉంది. ప్రస్తుతం దీపక ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ప్రేమోన్మాది నవీన్ కు, దీపకకు మధ్య రిలేషన్ ఏంటి..? వారు ఎప్పటి నుంచి పరిచయం..? అనే దానిపై పోలీసులు విచారిస్తున్నారు. దీనిపై మరింత సమాచారం తెలియాల్సి ఉంది.
ప్రేమోన్మాది నవీన్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. శ్రీకాకుళం జిల్లా బూర్జిలో నవీన్ ను పట్టుకున్నట్టు పోలీసులు వెల్లడించారు. ప్రేమించిన యువతిని పెళ్లి చేయడం లేదనే కారణంతోనే తల్లి, కూతురుపై కిరాతకంగా దాడి చేశాడని పోలీసులు పేర్కొన్నారు. దీనిపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
విశాఖ పోలీస్ కమీషనర్ శంకబ్రత బాగ్చీ దారుణ ఘటనపై మాట్లాడారు. ఆరేళ్లుగా దీపికను నవీన్ ప్రేమిస్తున్నాడని చెప్పారు. ‘నవీన్ ప్రవర్తన సరిగా లేదని పెళ్లికి ఒక ఏడాది ఆగమని దీపిక తండ్రి అన్నారు. దీంతో ఇంటికి వచ్చి కత్తితో తల్లి కూతరు మీద దాడి చేశాడు. ఈ ఘటనలో తల్లి మృతి చెందగా.. దీపిక ప్రస్తుతం ఆస్పత్రిలో కోలుకుంటోంది’ అని సీపీ శంకబ్రత బాగ్చీ తెలిపారు.
మృతురాలు లక్ష్మి చెల్లి మీడియాతో మాట్లాడింది. నిందితుడు నవీన్ ను నడిరోడ్డుపై ఉరి తీయాలంటూ ఆమె డిమాండ్ చేసింది. పెళ్లి చేస్తామని చెప్పినా కానీ దారుణంగా చంపాడని చెప్పింది. కాళ్లు, చేతులు నరికి నిందితుడిని కఠినంగా శిక్షించాలని పోలీసు ఉన్నతాధికారులు వేడుకుంది. ఈ ఘటనపై ప్రభుత్వం తక్షణమే స్పందించాలని ఆమె మొరపెట్టుకుంది.
దారుణ ఘటపై స్పందించిన ముఖ్యమంత్రి చంద్రబాబు
విశాఖపట్నంలో యువతిపై ప్రేమోన్మాది దాడిలో ఒకరు ప్రాణాలు కోల్పోవడం, మరొకరు ప్రాణాపాయ స్థితిలో ఉండటంపై సీఎం చంద్రబాబు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. దాడిని అడ్డుకునే ప్రయత్నంలో నిందితుడి చేతిలో యువతి తల్లి నక్కా లక్ష్మి ప్రాణాలు కోల్పోవడం విచారకరం అన్నారు. ఈ ఘటనపై సీఎం చంద్రబాబు నాయుడు ఆవేదన వ్యక్తం చేశారు. తీవ్ర గాయాలతో చికిత్స పొందుతున్న యువతి ఆరోగ్య పరిస్థితిపై అధికారులను అడిగి వివరాలు తెలుసుకున్నారు. బాధిత యువతికి మెరుగైన వైద్యం అందించాలని అధికారులకు సూచించారు. నిందితుడిపై కఠిన చర్యలు తీసుకోవాలని సీఎం ఆదేశించారు.
స్పందించిన హోం మంత్రి అనిత
మధురవాడ ప్రేమోన్మాది ఘటనపై హోం మంత్రి వంగలపూడి అనిత స్పందించారు. విశాఖ నగర పోలీస్ కమీషనర్ శంకబ్రత బాగ్చీతో ఫోన్ కాల్ లో హోం మంత్రి మాట్లాడారు. బాధితురాలు నక్క దీపిక ఆరోగ్య పరిస్థితిపై ఆమె ఆరా తీశారు. దివ్యకు మెరుగైన వైద్యం అందించాలని అధికారులను ఆదేశించారు. ప్రేమోన్మాది నవీన్ ను త్వరగా గాలించి పట్టుకుని కఠినంగా శిక్షించాలని పోలీసులను ఆదేశించారు. దివ్య తల్లి లక్ష్మి మృతిపై హోంమంత్రి అనిత దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.
ALSO READ: German Woman Rape Case: కారులో తిప్పుతూ జర్మనీ యువతిపై అత్యాచారం.. నిందితుడు అరెస్టు